న్యూ ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి హిందీ భాషపై తన స్థానం స్పష్టం చేశారు. ఇటీవల టైమ్స్ నౌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, దక్షిణాది రాష్ట్రాల నేతలు, ముఖ్యంగా తెలంగాణ నాయకులపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ భాషపై రాజకీయ కోణంలో విమర్శలు చేయడం సరైంది కాదని పవన్ వ్యాఖ్యానించారు. “దేశవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు పొందాలంటే మాతృభాషతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషలు కూడా అవసరమే,” అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

“పెద్దమ్మ” పోలిక, విమర్శలు
పవన్ కళ్యాణ్ గత కొంత కాలంగా హిందీకి మద్దతుగా మాట్లాడుతున్న నేపథ్యంలో, ఆయనపై బీజేపీ అజెండాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో హిందీ వ్యతిరేక భావాలు ఉధృతమవుతున్న నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. తాను హిందీని “పెద్దమ్మ”గా, మాతృభాషను “తల్లి”గా పోల్చిన అంశం పెద్ద చర్చనీయాంశంగా మారింది. నటుడు ప్రకాష్ రాజ్ వంటి వారే పవన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తూ, ఆయన్ను “అమ్ముడు పోయినవాడు” అని విమర్శించారు.
“రాజకీయ వ్యతిరేకత దురుద్దేశపూరితమే”
అయితే పవన్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెబుతున్నారు. “ఇంగ్లీష్‌తో పాటు హిందీని నేర్చుకోవడంలో తప్పులేదే కానీ, రాజకీయ కోణంలో వ్యతిరేకించడం దురుద్దేశపూరితమైందే,” అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ నాయకులు హిందీపై అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. “ఉర్దూ మిశ్రమ భాషపై అభ్యంతరం లేకపోతే, హిందీపై ఎందుకు?” అని ప్రశ్నిస్తూ, దీనిపై పునరాలోచన చేయాలని పవన్ విజ్ఞప్తి చేశారు.
భవిష్యత్ రాజకీయాలపై ప్రభావం
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక వైపు ప్రజల మద్దతు, మరోవైపు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆయన.. తన స్థిరమైన మద్దతుతో భాషపై తన వాదనను కొనసాగిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఈ వ్యాఖ్యలు దక్షిణాది రాజకీయాలలో ఎలా ప్రభావం చూపుతాయో వేచి చూడాల్సిందే.
ఉర్దూ మిక్స్డ్ తెలుగు ఉండే తెలంగాణ లీడర్లు సైతం హిందీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్దం కావడం లేదు – పవన్ కల్యాణ్ https://t.co/iQqs7earyw pic.twitter.com/RKnqiSUCJ1
— Telugu Scribe (@TeluguScribe) July 22, 2025




























