అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఇండియాలో తన తొలి కార్యాలయాన్ని ప్రారంభించనుంది. ఈ ఆఫీస్ బెంగళూరులో ఏర్పాటు కానుంది. ఆసియా ఖండంలో టోక్యో తర్వాత రెండో కేంద్రంగా భారత్‌ను ఎంపిక చేయడం ప్రాధాన్యంగా మారిం

భారత్‌లో బాధ్యతాయుతమైన ఏఐ వినియోగానికి ఇది కీలక మలుపుగా భావిస్తున్నారు. కంపెనీలు, స్టార్టప్‌లు, లాభాపేక్షలేని సంస్థలు, భాషా సాంకేతికత రంగాలు, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి విభాగాల్లో అంథ్రోపిక్ సేవలను విస్తరించనుంది.
భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి
అంథ్రోపిక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఇరినా ఘోష్ మాట్లాడుతూ, ఏఐ ప్రయోజనాలు కేవలం పెద్ద కార్పొరేట్ సంస్థలకు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి రావాలన్న లక్ష్యంతో భారత్‌లో విస్తరణ చేపడుతున్నామని చెప్పారు. స్థానిక భాగస్వామ్యాల ద్వారా వివిధ రంగాల్లో ప్రయోగాత్మక పరిష్కారాలను అందించనున్నట్లు వెల్లడించారు.
ఎయిర్ ఇండియాతో కలిసి కస్టమ్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేయడం, ఫిన్‌టెక్ సంస్థ CRED తమ Claude Code ప్లాట్‌ఫారమ్ ద్వారా వేగంగా ఫీచర్లను అభివృద్ధి చేయడం వంటి ప్రాజెక్టులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఐటీ దిగ్గజం Cognizant పాత సిస్టమ్‌లను ఆధునీకరించడానికి Claude మోడళ్లను ఉపయోగిస్తోంది. Razorpay, Emergent వంటి స్టార్టప్‌లు కూడా అంథ్రోపిక్ కస్టమర్ల జాబితాలో ఉన్నాయి.
భారతీయ భాషలకు ప్రాధాన్యం
ఈ విస్తరణలో మరో ముఖ్య అంశం భారతీయ భాషలపై దృష్టి సారించడం. Karya, Collective Intelligence Projectలతో కలిసి వ్యవసాయం, న్యాయరంగం వంటి విభాగాల్లో స్థానిక భాషల వినియోగదారులకు ఉపయోగపడే ఏఐ మోడళ్లను అభివృద్ధి చేస్తున్నారు. Digital Green, Adalat AI వంటి సంస్థల నిపుణులు కూడా ఈ ప్రాజెక్టుకు సహకరిస్తున్నారు. అభివృద్ధి చేసిన పరిశోధన ఫలితాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సంస్థ ప్రకటించింది.
ఉద్యోగాలపై పెరుగుతున్న ఆందోళన
ఇక మరోవైపు, అంథ్రోపిక్ భారత్‌లోకి అడుగుపెట్టడం ఐటీ ఉద్యోగులలో కొత్త చర్చకు దారితీసింది. ఇప్పటికే ఏఐ టూల్స్ విస్తరణతో సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగ భద్రతపై సందేహాలు పెరుగుతున్నాయి. ఇటీవల అంథ్రోపిక్ సీఈవో దారియో అమోడీ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమయ్యాయి. వచ్చే ఐదేళ్లలో ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాల్లో సగానికి పైగా తగ్గుదల ఉండొచ్చని ఆయన హెచ్చరించారు.
అంతేకాకుండా, వచ్చే 6 నుంచి 12 నెలల్లోనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల పనిని భర్తీ చేసే స్థాయి ఏఐ మోడళ్లు అందుబాటులోకి రావచ్చని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన గణాంకాలు కూడా దృష్టిని ఆకర్షించాయి. డిసెంబర్ 2025 నాటికి ఉద్యోగావకాశాలు 6.54 మిలియన్లకు తగ్గినట్లు ఆ నివేదిక వెల్లడించింది. ఇది సెప్టెంబర్ 2020 తర్వాత కనిష్ఠ స్థాయి అని తెలిపింది.
అవకాశాలా? సవాళ్లా?
భారత్‌లో అంథ్రోపిక్ కార్యాలయం ప్రారంభం టెక్నాలజీ రంగానికి పెద్ద ప్రోత్సాహం అయినప్పటికీ, అదే సమయంలో ఉద్యోగ మార్కెట్‌పై ప్రభావం ఎలా ఉంటుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవైపు ఏఐ ఆధారిత కొత్త అవకాశాలు, మరోవైపు సంప్రదాయ ఉద్యోగాలపై ఒత్తిడి – ఈ రెండింటి మధ్య సమతుల్యత ఎలా సాధిస్తారన్నది చూడాల్సి ఉంది.
మొత్తానికి, అంథ్రోపిక్ ఎంట్రీతో భారత్ ఏఐ మ్యాప్‌పై మరింత బలంగా నిలుస్తోంది. అయితే ఈ మార్పులు సాఫ్ట్‌వేర్ రంగంలో కొత్త దిశలను తెరవబోతున్నాయా? లేక ఉద్యోగాలపై ప్రభావం చూపుతాయా? అనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.































