కృష్ణం వందే జగద్గురుమ్. సృష్టికర్తైన మహా విష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీ కృష్ణుడిగా 8వ అవతారంగా జన్మించిన కృష్ణ జన్మాష్టమిని “కృష్ణాష్టమి”, “గోకులాష్టమి” లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు. ద్వాపర యుగంలో మహావిష్ణువు ఎత్తిన పరిపూర్ణావతారం శ్రీకృష్ణుడిదే. అలాంటి దైవం చిన్ని కృష్ణయ్యగా గోపికలందరి ఆట పట్టించి చిలిపి కృష్ణుడు కాస్త వెన్నదొంగగా పేరు తెచ్చుకున్నాడు. ధర్మబద్దమైన జీవన గమనాన్ని సమస్త మానవాళికీ తెలియజేసే భగవద్గీతను అందించిన పురుషోత్తముడు శ్రీకృష్ణుడు.

ఈరోజు శ్రీకృష్ణుడి జన్మాష్టమి సందర్భంగా తెలుగు తెరపై శ్రీకృష్ణావతారంలో అలరించిన మన తెలుగు హీరోలలో ముందుగా చెప్పుకోవాల్సింది మహా నటుడు NTR గురించే. శ్రీకృష్ణుడంటే తెలుగు ప్రేక్షకులందరికీ టక్కున గుర్తొచ్చే రూపం NTR దే. ఆ తర్వాత ఎంతోమంది నటులు ఆ పాత్రను పోషించిన నేటికీ శ్రీకృష్ణుడంటే తెలుగు ప్రజలకు ఆ తారకరాముడే గుర్తుకు వస్తాడంటే అతిశయోక్తి కాదేమో.! టాలీవుడ్ లో ఒక్క NTR కాకుండా ఇంకా కాంతారావు, ANR, శోభన్ బాబు, రాజేంద్రప్రసాద్, బాలకృష్ణ, నాగార్జున, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలందరు శ్రీకృష్ణావతారంలో కనిపించి ప్రేక్షకులందరినీ అలరించారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే..

మహా భారతంలోని పర్వాల సంఖ్య 18. భగద్గీతలోని అధ్యాయాల సంఖ్య 18. అలాగే మన టాలీవుడ్ తారక రాముడు NTR కూడా తన సినీ ప్రస్థానంలో 18 చిత్రాలలో శ్రీకృష్ణుడిగా నటించడం కాకతాళీయమనే చెప్పాలి. ఎన్టీఆర్ తొలిసారిగా శ్రీకృష్ణుడి వేషంలో నటించిన చిత్రం. 1953లో విడుదలైన ‘ఇద్దరు పెళ్ళాలు’. ఈ చిత్రంలో NTR 30ఏళ్ళ వయసులో వున్నప్పుడే ఓ స్వప్న గీతంలో తెలుగు తెరపై కృష్ణుడిగా తొలిసారిగా మెప్పించారు. ఆ తర్వాత ‘మాయా బజార్’. చిత్రంలో శ్రీకృష్ణునిగా పూర్తి నిడివి వున్న పాత్రలో NTR తన నటనతో ప్రేక్షకులను మాయ చేశాడు. అలాగే ‘దీపావళి’, ‘భక్త రఘునాథ్’, ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’, ‘కర్ణ, ‘శ్రీకృష్ణ సత్య’, ‘వీరాభిమన్యు’, ‘శ్రీకృష్ణ పాండవీయం’, ‘శ్రీకృష్ణ తులాభారం’, ‘శ్రీకృష్ణావతారం’, ‘శ్రీకృష్ణ విజయం’, ‘శ్రీకృష్ణాంజనేయ యుద్ధం’, ‘దాన వీర శూర కర్ణ’, ‘శ్రీ మద్విరాట పర్వం’ మొదలైన పౌరాణిక చిత్రాల్లో శ్రీకృష్ణునిగా ప్రేక్షకులకు కనువిందు చేశారు. NTR శ్రీకృష్ణునిగా నటించిన చిత్రాలన్నిటిలోనూ ఒకే ఆహార్యం, ఒకే వయసును ప్రతిబింబిస్తూ నటించడం ఒక్క NTRకు మాత్రమే సాధ్యమైంది. ఈవిధంగా శ్రీకృష్ణుని పాత్రను ఎక్కువ సినిమాల్లో నటించిన హీరోగా NTR తెలుగు చలనచిత్ర పుటల్లో ప్రపంచ రికార్డును నెలకొల్పారు. అంతేకాకుండా తెలుగు చిత్రాల్లోని అంతర్నాటకాలతో కలిపి మొత్తం 33 సార్లు శ్రీకృష్ణునిగా నటించి మెప్పించారు NTR. NTR కు సంబంధించిన మరో విశేషమేమంటే.. శ్రీకృష్ణుడిగా ఎన్నో చిత్రాలలో నటించిన NTR ఒక్క ‘పాండురంగ మహత్యం’ చిత్రంలో మాత్రం భక్తుడిగా నటించారు. ఈ చిత్రంలో ప్రముఖ నటి విజయ నిర్మల చిన్ని కృష్ణుడి పాత్రలో నటించడం విశేషం.

ఇక టాలీవుడ్ లో NTR తర్వాత శ్రీకృష్ణావతారంలో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఘనత కాంతారావుకే దక్కుతుంది. తనదైన శైలిలో శ్రీకృష్ణుని పాత్రకి వన్నె తీసుకురావడమనేది కాంతారావు గొప్పతనమనే చెప్పాలి. మలయాళంలో నిర్మించిన ‘భక్త కుచేల’. చిత్రంలో కాంతారావు తొలిసారిగా శ్రీకృష్ణుడి వేషం వేశారు. ఆ తర్వాత ‘నర్తనశాల’, ‘బభ్రువాహన’, ‘పాండవ వనవాసం’, ‘ప్రమీలార్జునీయం’, వంటి చిత్రాల్లో శ్రీకృష్ణుడిగా కాంతారావు తెలుగు ప్రేక్షకులను అలరించారు.

ఆరోజుల్లో NTR, కాంతారావులతో పోటీ పడి నటించే స్ధాయిలో వున్న ANR మాత్రం తన సినిమా కెరీర్ లో ఒక్క ‘గోవుల గోపన్న’ చిత్రంలో మాత్రమే ఒక పాటలో శ్రీకృష్ణుని వేషంలో కనిపించి ప్రేక్షకులను కనువిందు చేసారు తప్ప మరే చిత్రంలోనూ శ్రీకృష్ణుడి పాత్ర ధరించలేదు.

కాబట్టి NTR, కాంతారావుల తర్వాత తెలుగు వెండితెరపై శ్రీకృష్ణునిగా మెప్పించిన హీరోల్లో శోభన్ బాబు ఒకరు. బాపు దర్శకత్వంలో వచ్చిన ‘బుద్దిమంతుడు’ చిత్రంలో మొదటిసారిగా శ్రీకృష్ణావతారంలో దర్శనమిచ్చాడు శోభన్ బాబు. ఆ తర్వాత కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో విడుదలైన ‘కురుక్షేత్రం’ చిత్రంలో పూర్తి నిడివి వున్న పాత్రలో శ్రీకృష్ణ పరమాత్ముడిగా ప్రేక్షకులను అలరించాడు మన ఆంధ్రా సోగ్గాడు శోభన్ బాబు.

టాలీవుడ్ లో NTR పౌరాణిక వారసత్వాన్ని ఆయన వారసుడైన బాలకృష్ణ కూడా కొన్నాళ్ళు కొనసాగించాడు. ‘మంగమ్మ గారి మనవడు’, ‘పట్టాభిషేకం’ వంటి సాంఘిక చిత్రాల్లో వచ్చిన పాటల్లో శ్రీకృష్ణునిగా అతిథి పాత్రలో దర్శనమివ్వడమే కాకుండా ‘శ్రీకృష్ణార్జున విజయం’, ‘పాండురంగడు’ చిత్రాలలో శ్రీకృష్ణుని పాత్రలో కనిపించి కనువిందు చేసాడు బాలకృష్ణ.

నందమూరి వంశానికి చెందిన హరికృష్ణ కూడా ‘శ్రీకృష్ణావతారం’ చిత్రం ద్వారా బాల కృష్ణునిగా వెండితెరకు పరిచయమవ్వడం విశేషం.

ఇక టాలీవుడ్ అతిలోక సుందరిగా తెలుగు ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టిన అందాల తార శ్రీదేవి ‘యశోద కృష్ణ’ చిత్రంలో బాల కృష్ణునిగా నటించింది.

అంతేకాకుండా ఇదే చిత్రంలో సీనియర్ హీరో రామకృష్ణ కూడా శ్రీకృష్ణుడిగా కనిపించాడు.

టాలీవుడ్ నట కిరిటీ హాస్య చిత్రాల హీరో రాజేంద్ర ప్రసాద్ ‘కన్నయ్య కిట్టయ్య’ చిత్రంలో.. శ్రీకృష్ణునిగా నటించి మెప్పించాడు. ఇలాగే తెలుగు వెండితెరపై శ్రీకృష్ణుని పాత్రలో ప్రేక్షకులను మెప్పించిన కొందరు హీరోలెవరన్నది పరిశీలిస్తే..

టాలీవుడ్ కింగ్ నాగార్జున విష్ణు హీరోగా వచ్చిన ‘కృష్ణార్జున’లో శ్రీకృష్ణుడి పాత్రను నెమలి పించం, కిరీటాలు లేకుండా సామాన్యుడిలా తనదైన శైలిలో నటించి మెప్పించాడు.

అలాగే ‘గోపాల గోపాల’ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా శ్రీకృష్ణునిగా నటించి ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్నాడు.

బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సాక్షి’ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ కాసేపు శ్రీకృష్ణుడిగా కనిపిస్తే.. తండ్రిబాటలోనే ప్రిన్స్ మహేశ్ బాబు కూడా ‘యువరాజు’ చిత్రంలో ఒక పాటలో శ్రీకృష్ణునిగా కనిపించి కనువిందు చేశాడు.

హాస్య నటుడు సునీల్ ‘అందాల రాముడు’లో కొంటె కృష్ణుడిగా కాసేపు ప్రేక్షకులందర్నీ అలరించాడు.

అలాగే ఆమధ్య అంతా చిన్న పిల్లలతో నిర్మించిన ‘దాన వీర శూర కర్ణ’ చిత్రంలో NTR ముని మనవడు, హరికృష్ణ మనవడు మాస్టర్ NTR కూడా శ్రీకృష్ణుని పాత్రలో నటించడం విశేషమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here