తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు వెలువడ్డాయి.

రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతున్నాయి. రానున్న మూడు రోజుల్లో ఈ వేడి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, హైదరాబాద్ వంటి జిల్లాల్లో తీవ్రమైన వేడి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు.
ఇక కొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. నిజామాబాద్, ఖమ్మం, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఇవాళే వేడి గాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పారు. రేపు ఆదిలాబాద్, నాగర్ కర్నూలు, వనపర్తి తదితర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. వడగాలులు వీచే ప్రాంతాలకు ఎల్లో అలర్ట్‌లు జారీ చేశారు.
ఈ పరిస్థితుల్లో ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని, మధ్యాహ్న సమయంలో ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తగినంత నీరు తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం, చిన్నపిల్లలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అవసరమని వైద్యులు చెబుతున్నారు.































