న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా భారత మార్కెట్లో తన విస్తరణను వేగవంతం చేసింది. సోమవారం దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఏరోసిటీలో ఉన్న వరల్డ్‌మార్క్ 3 వద్ద తమ రెండో షోరూమ్‌ను ప్రారంభించింది. జూలైలో ముంబైలోని బాంద్రాలో తొలి షోరూంను ప్రారంభించిన టెస్లా, నెలరోజుల వ్యవధిలోనే రెండో షోరూంను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ షోరూమ్ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉండటం ప్రత్యేకత. రానున్న రోజుల్లో మరో మూడు షోరూమ్‌లను ఏర్పాటు చేయాలని కూడా కంపెనీ ప్రణాళికలు వేస్తోంది.

మోడల్ వై డెలివరీలు త్వరలోనే..
టెస్లా భారత మార్కెట్లో తమ మోడల్ వై (Model Y) కారును విడుదల చేసింది. ఈ కారు డెలివరీలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నుంచి ప్రారంభించే అవకాశం ఉందని తెలిపింది. మోడల్ వై రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
- 500 కిలోమీటర్ల రేంజ్ మోడల్: దీనిని ఏడాది చివరిలో డెలివరీ చేయనున్నారు.
- 622 కిలోమీటర్ల రేంజ్ మోడల్: దీనిని చివరి త్రైమాసికంలో కస్టమర్లకు అందించనున్నారు.
మోడల్ వై కారు ప్రారంభ ధర సుమారు రూ. 60 లక్షలు కాగా, లాంగ్ రేంజ్ రియర్-వీల్ డ్రైవ్ ధర రూ. 68 లక్షలుగా నిర్ణయించారు. పూర్తిస్థాయి సెల్ఫ్-డ్రైవింగ్ ఫీచర్ కావాలంటే కారు ధరకు అదనంగా రూ. 6 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
ఛార్జింగ్ స్టేషన్లు, సర్వీస్ సెంటర్లు
టెస్లా ఇప్పటికే గురుగ్రామ్‌లో సూపర్‌ఛార్జర్ సౌకర్యాన్ని అందించేందుకు చర్యలు ప్రారంభించింది. ముంబైలోని లోయర్ పరేల్, నవీ ముంబై, థానే ప్రాంతాల్లో కొత్త ఛార్జింగ్ స్టేషన్లను కూడా ప్రారంభించనుంది. ముంబై, ఢిల్లీ తర్వాత బెంగళూరు తమకు అతిపెద్ద మార్కెట్ అని టెస్లా ఆగ్నేయాసియా రీజనల్ డైరెక్టర్ ఇసాబెల్ ఫ్యాన్ తెలిపారు. త్వరలోనే మొబైల్ సర్వీస్ యూనిట్లు, రిమోట్ డయాగ్నస్టిక్స్, సర్వీస్ సెంటర్ వంటి సేవలను కూడా అందుబాటులోకి తెస్తామని ఆమె పేర్కొన్నారు.



























