మాయగాడు సినిమా షూటింగ్ అయిపోయాక దానికి సంబంధించి హీరోయిన్ ఛార్మి ప్రమోషన్‌కి రానన్నారని ప్రముఖ నిర్మాత యలమంచిలి రవి అన్నారు. ప్రమోషన్‌కు రాకపోతే ఎలా అనే విషయంపై ఆమెతో కొంచెం గొడవ పడాల్సి వచ్చిందని, ఆ తర్వాత పెద్దలైన మురళీ మోహన్ ద్వారా అది సద్దుమణిగిపోయిందని ఆయన చెప్పారు. ఆ తర్వాత ఆమె ప్రమోషన్‌కు హాజరయ్యారని ఆయన చెప్పుకొచ్చారు. రెమ్యునరేషన్ విషయంలోనూ ఆమెకు, తనకు ఎలాంటి విబేధాలు లేవన్న ఆయన, అమౌంట్ మొత్త ఇచ్చేశామని అయినా కూడా ఆమె సినిమా పబ్లిసిటీ చేయడానికి నిరాకరించారని ఆయన వివరించారు.

ఇంత చేసి, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి సినిమా ప్రమోషన్‌కు రాకపోతే ఎలా సినిమా ఏమవుతుంది ? ప్రొడ్యూసర్ ఏమవుతాడు ? అని ఆలోచించి ఆ సమయంలో కొంచెం అగ్రెసివ్‌గా ఉండాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఆ తర్వాత మా అసోసియేషన్‌లో చెప్పేసరికి, మురళీ మోహన్ గారు చర్చించి సమస్యను పరిష్కారం చేశారని ఆయన చెప్పారు.
ఇకపోతే ఏపీ ప్రభుత్వం థియేటర్స్‌పై తీసుకున్న నిర్ణయంపై నిర్మాత యలమంచిలి రవి స్పందించారు. తన దృష్టిలో చెప్పాలంటే ఆ జీవో తప్పా, ఒప్పా అనేది పక్కన పెడితే ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వాన్ని హ్యాండిల్ చేసుకునే విధానంలో వైఫల్యం జరిగిందని ఆయన అన్నారు. వ్యాపారం.. వ్యాపారంలా చేయాలన్న ఆయన, ప్రభుత్వాన్ని ఒక ప్రెస్‌మీట్‌లో కూర్చొని ఏదో ఆలోచిస్తే వారు వ్యాపారం ఎందుకు చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఎవరికి అవసరం ఉంటే వాళ్లు వెళ్లాలి కదా అని ఆయన చెప్పుకొచ్చారు.
ఇంతకు ముందు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వారంలో ఇండస్ట్రీ నుంచి ఒకరు వెళ్లి బొకే ఇచ్చి, శాలువ కప్పి కలిసొచ్చేవారని, అలా జగన్ అధికారంలోకి వచ్చాక ఎవరైనా వెళ్లారా అని ఆయన అన్నారు. అది వాళ్లు కూడా మనసులో పెట్టుకోరా అని ఆయన ప్రశ్నించారు.
ఇకపోతే పవన్ కల్యాణ్ ఈ జీవోపై స్పందించినా అవసరం ఇండస్ట్రీది కాబట్టి కూర్చొని మాట్లాడుకుంటే అవుతదా లేదంటే ప్రెస్‌మీట్‌లు పెడితే అవుతదా అని ఆయన డైరక్ట్‌గానే ప్రశ్నలు కురిపించారు. రాజకీయ పార్టీ రాజకీయమే చేస్తుందని, మా అసోసియేషన్‌లో మొన్న అంత రాజకీయం జరిగింది. కానీ దాని వల్ల ఎవరికైనా ప్రయోజనముందా అని ఆయన అన్నారు.





























