ఆంధ్రప్రదేశ్‌లో పచ్చదనం పెంపు, అటవీ విస్తీర్ణం పెంచే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్‌ఫ్లై పార్క్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కొనసాగుతోంది.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్వయంగా పాల్గొని విత్తన బంతుల తయారీలో భాగమయ్యారు. అధికారులు, విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి స్థానికంగా పెరిగే అంకుడు, వేప, రావి, మర్రి వంటి స్వదేశీ వృక్షాల విత్తనాలతో సీడ్ బాల్స్ తయారు చేశారు. జూన్ 15లోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 కేంద్రాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుండగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పవన్ కళ్యాణ్ అన్ని చోట్ల పనులను సమీక్షించారు. కొండ కోనలు, అడవుల లోతైన ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో సీడ్ బాల్స్ వెదజల్లే విధానాన్ని కూడా ఆయన పరిశీలించారు.
బటర్‌ఫ్లై పార్క్‌లో ఏర్పాటు చేసిన అటవీ శాఖ స్టాల్స్‌ను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి, అక్కడ ఉన్న యోగా హాల్ నమూనాను ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రతి ఎకో టూరిజం పార్కులో యోగా హాళ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
అలాగే కొండపల్లి బొమ్మల కళాకారులు సహా చేతివృత్తుల సమస్యలపై స్పందించిన ఆయన, వుడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కళాకృతులకు మార్కెటింగ్, ప్రచారం కల్పించడంతో పాటు కళాకారులతో తరచూ సమావేశాలు నిర్వహించాలని సూచించారు.





























