No Entry: పాఠశాల ఆవరణలో హిజాబ్ ధరించినందుకు విద్యార్థినులను తరగతి గదిలోకి రానీయకుండా చేసి బయట నిలబెట్టారు పాఠశాల ప్రిన్సిపాల్ . ఈ ఘటన కర్ణాటకలోని ఉడిపి నగరంలో ప్రభుత్వ మహిళా పీయూ యూనివర్సిటీ కళాశాలలో చోటుచేసుకుంది.

ప్రథమ, ద్వితీయ పీయూలకు చెందిన ఆరుగురు విద్యార్థులు హిజాబ్ ధరించి మూడు రోజులుగా కళాశాలలో రిపోర్టు చేస్తున్నారని.. అందుకు ప్రిన్సిపల్ రుద్ర గౌడ వారిని తరగతి గదుల్లోకి రానివ్వడం లేదని ఆరోపించారు. తమ మతపరమైన హక్కును గౌరవించాలని .. హిజాబ్‌తో తరగతులకు అనుమతించాలని బాలికల తరఫున విద్యార్థులు ప్రిన్సిపాల్‌ను కోరుతున్నారు.

విద్యాసంస్థ నిబంధనల ప్రకారం విద్యార్థినులు హిజాబ్ ధరించకుండా కళాశాలకు వస్తేనే అనుమతిస్తామని ప్రిన్సిపాల్ హుకూం జారీ చేశాడు. ఈ ఘటనను క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఖండించింది. అయితే కళాశాల అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు యశ్‌పాల్ సువర్ణ మాట్లాడుతూ.. తాము ప్రిన్సిపాల్ వెంటే ఉన్నామని.. కళాశాల విద్యా వాతావరణాన్ని పాడుచేయనివ్వబోమని అన్నారు.
అటెండెన్స్ తగ్గే అవకాశం ఉంది.. అనుమతివ్వండి..
కాలేజీ ప్రిన్సిపాల్ రుద్ర గౌడ ఈ విషయాలను స్పష్టం చేస్తూ.. ”ఇప్పటి వరకు ముస్లిం విద్యార్థులు హిజాబ్ ధరించాలనే నిబంధన కాలేజీలో లేదు. అయితే, గత మూడు రోజుల నుండి.. మొత్తం 60 మంది ముస్లిం బాలికలలో ఆరుగురు విద్యార్థులు హిజాబ్ ధరించి కళాశాలకు వస్తున్నారు. కాబట్టి మేము వారిని తరగతులకు అనుమతించలేదు. వారు హిజాబ్‌ను తొలగిస్తే తరగతులకు హాజరు కావచ్చు. వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమస్యపై చర్చించాం. వారు ఈ నియమాన్ని అర్థం చేసుకున్నారు.. అంతే కాదు వాళ్లు ఈ నిబంధనను అంగీకరించారని తెలిపాడు. కానీ ఈ విషయంపై ఆ బాలికల తల్లిదండ్రులు తాము ప్రిన్సిపాల్ తో ఈ విషయంపై మాట్లాడేందుకు అనుమతి ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. వారు ఈ విషయాన్ని స్థానికి మీడియాతో వెల్లడించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. క్లాస్ లోకి తమ పిల్లలను మూడు రోజులుగా అనుమంతించకపోవడంతో.. అటెండెన్స్ పర్సంటేజ్ తగ్గే అవకాశం ఉందని.. దయచేసి వాళ్లను అనుమతివ్వండి అంటూ వేడుకున్నారు.































