చైనా దేశం నుంచి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారి పలు దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతూ మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వైరస్ వ్యాప్తికి కారణమైన చైనానే వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టడం గమనార్హం. చైనా తయారు చేసిన ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదేనని.. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పలు కరోనా వ్యాక్సిన్లు తుది దశ క్లినికల్ ట్రయల్స్ జరుపుకుంటున్నాయి. కొన్ని వ్యాక్సిన్లు స్వల్పంగా సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తున్నా మెజారిటీ వ్యాక్సిన్లు మంచి ఫలితాలనే నమోదు చేస్తుండటం గమనార్హం. చైనీస్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరోనా వ్యాక్సిన్ ను తయారు చేయగా వ్యాక్సిన్ ప్రయోగదశ ఫలితాలు వ్యాక్సిన్ సురక్షితమేనని వెల్లడిస్తున్నాయి.
191 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చి శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాలు చేశారు. మెడిక్సివ్ అనే జర్నల్ లో వ్యాక్సిన్ ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని శాస్త్రవేత్తలు పొందుపరిచారు. సాధారణంగా వ్యాక్సిన్ తీసుకుంటే కనిపించే అలసట, నొప్పి, ఇంజెక్షన్ చేసిన చోట వాపు లాంటి లక్షణాలు మాత్రమే కనిపించాయని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మరోవైపు చైనాలో తయారవుతున్న కొన్ని వ్యాక్సిన్లను పూర్తిస్థాయిలో క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాకముందే ఆ దేశ ప్రజలకు ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. చైనా ప్రజలకు బలవంతంగా వ్యాక్సిన్లు ఇస్తూ ఉండటంపై ప్రపంచ దేశాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు భారత్ సహా పలు దేశాల్లో కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతుండటం గమనార్హం.




























