విద్యార్థులను ప్రోత్సహించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంత ముఖ్యమో మరోసారి నిరూపించిన ఘటన పెద్దపల్లి జిల్లాలో వెలుగుచూసింది. రామగిరి మండలం బేగంపేట ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మల్క రామకిషన్‌రావు తన ఇచ్చిన మాటను నిలబెట్టుకుని విద్యార్థికి విమాన ప్రయాణం కల్పించారు.

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు ఆయన ప్రత్యేక హామీ ఇచ్చారు. 550కి పైగా మార్కులు సాధిస్తే విమానంలో ప్రయాణం చేయిస్తానని ప్రకటించారు. ఈ సవాల్‌ను స్వీకరించిన విద్యార్థుల్లో పూర్ణచందర్ అనే విద్యార్థి 554 మార్కులు సాధించి గురువు నమ్మకాన్ని నిలబెట్టాడు.
తన హామీ మేరకు ఉపాధ్యాయుడు స్వంత ఖర్చుతో విద్యార్థిని హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు విమానంలో తీసుకెళ్లి, అక్కడి పర్యాటక ప్రదేశాలను చూపించారు. సాధారణంగా పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందని ఈ అనుభవాన్ని కల్పించడం ద్వారా ఆయన మంచి సందేశం ఇచ్చారు.
గత ఏడాదిలో కూడా ఇదే విధంగా ఇద్దరు విద్యార్థులకు విమాన ప్రయాణం చేయించిన రామకిషన్‌రావు, ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. చదువులో ప్రతిభ కనబరిచే విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇది మంచి మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సంఘటన స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది. గ్రామస్తులు, తల్లిదండ్రులు ఉపాధ్యాయుడి సేవా భావాన్ని కొనియాడుతున్నారు. విద్యార్థుల్లో లక్ష్యసాధనకు ప్రేరణ కలిగించే ఈ చర్య ఇతరులకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని భావిస్తున్నారు.































