హైదరాబాద్: సినిమా ప్రపంచంలో ఎంత పెద్ద సినిమాకైనా అడ్వాన్స్ బుకింగ్‌లు మహా అయితే రెండు వారాల ముందు, లేదా ఒక నెల ముందు మొదలవుతాయి. అంతకంటే ముందు ఆన్‌లైన్ టికెట్లు అమ్మడం అరుదైన విషయం. కానీ, ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఈ లెక్కలకు అతీతంగా నిలుస్తున్నారు. ఆయన కొత్త చిత్రం ‘ఒడిస్సీ’ వచ్చే ఏడాది జూలై 17న విడుదల కానుంది. అంటే, ఇంకా సుమారు సంవత్సరం సమయం ఉంది. అయినప్పటికీ, ఈ సినిమాకు అప్పుడే అడ్వాన్స్ బుకింగ్‌లు మొదలయ్యాయి. ఆశ్చర్యకరంగా, యుఎస్, యుకెలోని ప్రముఖ ఐమ్యాక్స్ 70 ఎంఎం స్క్రీన్‌లలో టికెట్లన్నీ దాదాపు సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఇలాంటి క్రేజ్ సినీ చరిత్రలో చాలా అరుదుగా కనిపిస్తుంది.

న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్, డల్లాస్, ఫిలడెల్ఫియా, టొరంటో, గ్రాండ్ రాపిడ్స్, లండన్, ప్రేగ్ తదితర ప్రాంతాలకు సంబంధించిన సేల్స్ అప్పుడే పీక్స్‌కు చేరుకుంటున్నాయి. అసలు ‘ఒడిస్సీ’ ఎలా ఉంటుందో పూర్తి అవగాహన లేకుండానే ప్రేక్షకులు ఇంతగా ఎగబడుతున్నారంటే దానికి కారణం నోలన్ మాస్టర్ స్టోరీ టెల్లింగ్. ‘ఓపెన్‌హైమర్’ సినిమాను ఎగబడి చూసినా, పదేళ్ల క్రితం వచ్చిన ‘ఇంటర్‌స్టెల్లార్’ను మళ్ళీ రీ-రిలీజ్ చేస్తే కోట్లు వసూలు చేసినా అది నోలన్‌కే సాధ్యమైంది. కొందరికి నోలన్ టేకింగ్ అర్థం కాకపోయినా సరే, కథ చెప్పే విధానానికి ఫిదా అయిపోయి మళ్ళీ మళ్ళీ ఎంజాయ్ చేస్తారు.
భారీ బడ్జెట్, అద్భుతమైన విజువల్స్
ఇంత హైప్ ఉందంటే, ‘ఒడిస్సీ’ విడుదలవుతున్న జూలై 17న మరే ఇతర పెద్ద సినిమా కాంపిటీషన్‌లో ఉండకపోవడం ఉత్తమం. గ్రీకు పురాణాల్లోని ఇతికా రాజు ఒడిస్సిస్ చేసిన ట్రోజన్ యుద్ధంతో పాటు ఆయన జీవిత ప్రయాణాన్ని నోలన్ కథాంశంగా ఎంచుకున్నారు. 250 మిలియన్ డాలర్ల వ్యయంతో పూర్తి ఐమ్యాక్స్ కెమెరాలతో షూట్ చేస్తున్న ‘ఒడిస్సీ’లో ఇప్పటిదాకా ప్రపంచ స్క్రీన్ మీద ఎప్పుడూ చూడని విజువల్స్ ఉంటాయని సమాచారం. షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఒడిస్సీ’ పోస్ట్ ప్రొడక్షన్ కోసమే నోలన్ నెలల తరబడి వర్క్ చేస్తున్నారు. ప్రపంచంలో 365 రోజుల ముందే టికెట్లు అమ్ముడుపోయేలా చేసిన ఘనత క్రిస్టోఫర్ నోలన్‌కే దక్కుతుందేమో. ఆయన దర్శకత్వ ప్రతిభకు, ప్రేక్షకులపై ఆయనకున్న నమ్మకానికి ఇది నిదర్శనం.

































