తెలంగాణలోని అటవీ ప్రాంతంలో ఉన్న జిల్లాల్లోని ప్రజలను గత కొద్ది రోజుల నుంచి చిరుత తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. అయితే ఈ చిరుత కొన్ని రోజులు కనిపించక పోవడంతో తిరిగి అడవిలోకి వెళ్ళిపోయిందని ప్రజలు భావించారు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గ్రామశివారులో చిరుత పులి తిరుగుతుండడంతో ఆ గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామ శివారులోనే కాకుండా కురుమూర్తి స్వామి గుట్టపై కూడా ఈ చిరుత ప్రభావం ఉన్నట్టు కనబడుతుంది.

పేదల తిరుపతిగా భావించే ఈ గుట్టపై గత వారం రోజుల నుంచి చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు తెలియజేస్తున్నారు. ఈ గుట్టపైకి కొందరు గొర్రెల కాపరులు గొర్రెలు మేకలను అటవీ ప్రాంతంలోనికి మేత కోసం తీసుకెళ్ళేవారు. అయితే రోజు మేకలు మాయమవడంతో కాపరులకు విషయం అంతుపట్టడం లేదు. ఈ క్రమంలోనే ఒకరోజు వారికి ఆ గుట్ట పరిసర ప్రాంతాలలో చిరుత కనిపించడంతో ఆందోళన చెందారు.

ఆ చిరుత సంచరిస్తున్న ప్రదేశాలను కాపరులు సెల్ ఫోన్ లలో బంధించి స్థానిక గ్రామ ప్రజలకు చూపించగా ప్రజలు భయాందోళనలకు గురై ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితులలో ఉన్నారు.చుట్టుపక్కల గ్రామాలలో పొలాల్లోకి వెళ్లి పనులు చేసుకోవడానికి కూడా రైతులు భయపడుతున్నారు.

అదేవిధంగా ఎప్పుడూ భక్తులతో రద్దీగా ఉండే కురుమూర్తి స్వామి ఆలయాన్ని దర్శించుకోవాలన్న భక్తులు భయంతో వెనకడుగు వేస్తున్నారు. ఈ విషయంపై అటవీ అధికారులు స్పందించి చిరుతను బంధించి తమ గ్రామ ప్రజలను కాపాడాలని గ్రామస్తులు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here