ఆరడుగుల ఆజానుబాహుడు కంచుకంఠం,మంచి ముఖవర్చస్సు ఉన్న పుడిపెద్ది జోగేశ్వర శర్మ(పి.జె.శర్మ) తెలుగువాడైన కొన్ని కారణాల వలన 1950 ప్రాంతంలోనే మద్రాస్ వలస వెళ్లారు. ఒడ్డు పొడుగు ఉన్న శర్మ అడపాదడపా తెలుగు చిత్రాల్లో అవకాశాలు వచ్చినా ప్రత్యేకంగా బ్రేక్ ఇచ్చిన సినిమా అంటూ ఏదిలేదు. అలా కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ తన కుటుంబాన్ని నెట్టుకుంటూ వచ్చాడు. అలా కొన్ని ఆర్థిక ఇబ్బందులతో నడుస్తున్న కుటుంబానికి పి.జె.శర్మ పెద్ద కుమారుడైన సాయి కుమార్ తరంగిణి సినిమాతో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తెరంగేట్రం చేయడంతో కుటుంబ పోషణకు కొంత చేదోడువాదోడుగా ఉన్నాడు.

పి.జె.శర్మ రెండవ కుమారుడు రవిశంకర్ సినిమాల్లో గొప్ప స్థాయికి చేరుకోవాలనే ఆలోచనతో తల్లి కృష్ణ జ్యోతి రవిశంకర్ కు యాక్టింగ్, డాన్స్, సంగీతం హార్స్ రైడింగ్ వంటి అనేక కళల్లో శిక్షణ ఇప్పించారు. ఒక రకంగా చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి అంత ఎత్తుకు ఎదగాలని ఆమె రవిశంకర్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తల్లి కృష్ణ జ్యోతి చనిపోకముందు డైరీ రాస్తుండేవారని ఆమె మరణానంతరం దానిని చదివే అవకాశం కేవలం అన్నయ్య సాయికుమార్ కే ఉందని చెప్పేవారని.. అలా కొన్ని రోజుల అనంతరం అమ్మ చనిపోవడంతో అన్నయ్య ఆ డైరీ తీసి చదివారని అందులో “మన బర్త్ మామూలుగా ఉన్న మన డెత్” మాత్రం ప్రపంచమంతా చెప్పుకోవాలని ఒకరకంగా హిందూ లాంటి న్యూస్ పేపర్లో హెడ్ లైన్స్ లో రవిశంకర్ పేరు రావాలని తన తల్లి గారు కోరుకున్నారని ఒక ఇంటర్వ్యూలో రవిశంకర్ చెప్పుకొచ్చారు.

ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన తర్వాత 1986లో ఆర్ నారాయణమూర్తి దర్శకత్వంలో వచ్చిన “ఆలోచించండి” అనే చిత్రంతో తిరిగి యాక్టింగ్ మొదలుపెట్టాడు. తర్వాత మధురనగరిలో, కీచురాళ్ళు, తొలివలపు మొదలగు చిత్రాల్లో నటించిన పెద్దగా అవకాశాలు రాకపోవడంతో రౌ డీ యిజం జిందాబాద్ అనే తెలుగు సినిమాతో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారి దాదాపు మూడువేల ఐదువందల చిత్రాలకు తన వాయిస్ ను అందించారు. 2009లో విడుదలైన అరుంధతి సినిమాలో విలన్ సోనూసూద్ కు చెప్పిన “అమ్మ బొమ్మాలి” అనే వాయిస్ రవిశంకర్ కు ఎక్కడలేని ప్రజాదరణ తీసుకువచ్చింది. నటుడిగా తెలుగు సినిమా మరిచి పోవడం తో కన్నడంలో సుదీప్ హీరోగా వచ్చిన కెంపెగౌడ (తెలుగు మిర్చి రీమేక్ చిత్రం) బ్లాక్ బస్టర్ కావడంతో కన్నడ ప్రజలు “అఖిల కర్ణాటక సకల కళా వల్లభ రవిశంకర్ అభిమాన సంఘాన్ని” ఏర్పాటు చేసి బొమ్మాలి రవిశంకర్ పై తిరుగులేని తమ అభిమానాన్ని చాటుకున్నారు. వారి అభిమానానికి పరవశించి పోయిన రవిశంకర్ జై నా కన్నడ ప్రజలకు అని కంచు కంఠంతో వారందరికీ జై కొట్టారు.



























