Mukul Dev : టాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ ఇక లేరు. ఆయన వయసు 54 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ వార్త ఆయన అభిమానులను, సినీ ప్రముఖులను దిగ్భ్రాంతికి గురి చేసింది.

ముకుల్ దేవ్ మరణ వార్తను ఆయన స్నేహితురాలు, నటి దీప్శిఖా నాగ్‌పాల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “నమ్మలేకపోతున్నాను. రిప్” అంటూ ఆయనతో ఉన్న ఒక ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ పోస్ట్ తెలియజేస్తుంది.
సన్ ఆఫ్ సర్దార్ చిత్రంలో ముకుల్‌తో కలిసి నటించిన నటుడు విందు దారా సింగ్ కూడా ఈ విషాద వార్తను ధృవీకరించారు. ముకుల్‌ను మళ్లీ తెరపై చూసే అవకాశం ఎప్పటికీ రాదని ఆయన విచారం వ్యక్తం చేశారు. ముకుల్ దేవ్ చివరిగా ఆంత్ ది ఎండ్ అనే హిందీ చిత్రంలో నటించారు.

నటుడు రాహుల్ దేవ్ సోదరుడు అయిన ముకుల్ దేవ్ హిందీ, పంజాబీలతో పాటు పలు దక్షిణాది చిత్రాల్లో కూడా నటించారు. రవితేజ హీరోగా నటించిన ‘కృష్ణ’ చిత్రంతో విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘కేడి’, ‘అదుర్స్’, ‘సిద్ధం’, ‘మనీ మనీ మోర్ మనీ’, ‘నిప్పు’, ‘భాయ్’ వంటి చిత్రాల్లో తనదైన శైలిలో నటించి మెప్పించారు. 2022లో విడుదలైన ‘అంత్ ది ఎండ్’ తర్వాత ఆయన సినిమాల్లో కనిపించలేదు.
తల్లిదండ్రులు మరణించడంతో ముకుల్ దేవ్ ఒంటరిగా నివసిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యం పాలవ్వడంతో ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. ముకుల్ దేవ్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు.


































