సాక్షి రంగారావు కొడుకు మనదరికి ఎంతో ఇష్టమైన నటుడు.. ఎవరో తెలుసా?

0
871

1967వ సంవత్సరంలో బాపు దర్శకత్వంలో తెరకెక్కిన సాక్షి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు సహనటుడిగా పరిచయమైన రంగారావు… తన పేరును సాక్షి రంగారావు గా మార్చుకున్నారు. కె.విశ్వనాథ్, బాపు, వంశీ వంటి గొప్ప దర్శకుల సినిమాల్లో సాక్షి రంగారావు ఎక్కువగా నటించేవారు. సిరివెన్నెల, స్వర్ణకమలం, ఏప్రిల్ 1 విడుదల, స్వరాభిషేకం వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో తన అద్భుతమైన నటన చాతుర్యాన్ని చూపి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సాక్షి రంగారావు నాలుగు దశాబ్దాల కాలంలో 450 చిత్రాలకు పైగా నటించారు. సాక్షి రంగారావు నటించినవన్నీ కూడా చాలావరకు హాస్యభరితమైన చిత్రాలేనని చెప్పుకోవచ్చు.

కృష్ణాజిల్లా కొండిపర్రు గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ, రంగనాయకమ్మ దంపతులకు 1942 ఆగస్టు 15వ తేదీన జన్మించిన సాక్షి రంగారావు విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ లో స్టెనోగ్రాఫర్ గా కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత నటనపై ఆసక్తితో ఎన్నో నాటకాలలో నటించి స్టేజ్ ఆర్టిస్టుగా మంచి పేరును దక్కించుకున్నారు. తదనంతరం సినిమా పరిశ్రమలో అరంగేట్రం చేసి 1967 నుండి 1995 వరకు నటించి ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. సాక్షి రంగారావుకి శివ అనే ఒక్కగానొక్క కుమారుడు ఉన్నారు. అతనికి కూడా నటనపై చాలా మక్కువ. అందుకే బుల్లితెర నటుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు అయ్యారు.

సాక్షి శివ 1972 ఫిబ్రవరి 6వ తేదీన భీమవరంలో జన్మించారు. ఇతను 2000వ సంవత్సరం నుండి టీవీ సీరియల్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు. తమిళ భాషలో రాధిక తో కలిసి రాడార్ మీడియా నిర్మించిన అన్ని సీరియళ్లలో సాక్షి శివ నటించారు. ఆనందం, అహల్య, సీతామహాలక్ష్మి, శివశక్తి, లక్ష్మీ కళ్యాణం, మహాభారతం, చంద్రలేఖ వంటి ఎన్నో సీరియళ్లలో నటించి బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.

సాక్షి శివ స్టేట్ లెవెల్ బ్యాట్మెంటన్ ఛాంపియన్ గా ఎన్నోసార్లు నిలిచారు. ఇతను క్రికెట్ కూడా బాగా ఆడతారు. ఇకపోతే సాక్షి రంగారావు 2005వ సంవత్సరంలో చెన్నైలో కన్యాశుల్కం చిత్రీకరణ జరిగే సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ అతను మార్గమధ్యంలోనే తన తుది శ్వాస విడిచారు. మధుమేహ వ్యాధితో చాలా కాలం బాధపడిన సాక్షి రంగారావు కిడ్నీ ఫెయిల్ అవ్వడంతో చనిపోయారని డాక్టర్లు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here