సినీనటి సౌందర్య వంద కోట్ల ఆస్తికి నిజమైన వారసులు ఎవరో తెలుసా..?

0
477

సౌందర్య. తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనవసరంలేని పేరు. టాలీవుడ్ లోనే కాదు.. దక్షిణాది చిత్ర పరిశ్రమలన్నింటిలోను ఆమె హిట్ సినిమాల్లో నటించారు. హద్దుమీరని అందంతో.. ఆకట్టుకునే అభినయంతో సినీ ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.

సౌందర్య తెలుగు, తమిళం, కన్నడం, మళయాలం భాషలలో 100కు పైగా చిత్రాలలో నటించింది. 12 సంవత్సరాలు అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈమె 2004 ఏప్రిల్ 17 న బెంగళూరులో జరిగిన విమాన ప్రమాదంలో మరణించింది. సౌందర్య అసలు పేరు సౌమ్య. సినీ రంగంలోకి ప్రవేశించిన తర్వాత ఆమె పేరును సౌందర్యగా మార్చుకున్నారు. ఆమె ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నప్పుడే తొలి చిత్రంలో నటించింది. ఆమె ఎం.బి.బి.ఎస్. మొదటి సంవత్సరంలో ఉండగా, ఆమె తండ్రి స్నేహితుడొకరు గంధర్వ అనే చిత్రంలో నటించే ఛాన్స్ ఇచ్చారు. తెలుగులో “మనవరాలి పెళ్ళి” చిత్రం ద్వారా పరిచయమైన సౌందర్య ఆ తర్వాత టాలీవుడ్ లోని అగ్ర హీరోలందరి సరసన నటించే ఆఫర్లు రావడంతో సినీ నటి సౌందర్య అగ్ర హీరోయిన్ గా మారింది. ‘అమ్మోరు’ చిత్రం విజయవంతమైన తర్వాత, ఆమె చదువును మధ్యలోనే ఆపేసింది. టాలీవుడ్ లో మంచి నటిగా గుర్తింపు సంపాదించిన సౌందర్య కన్నడ, తమిళం, మళయాళం చిత్రాలలో కూడా నటించింది.

బాలీవుడ్ లో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌తో సూర్యవంశ్ చిత్రంలో నటించింది. సౌందర్య గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో ‘ద్వీప’ అనే కన్నడ చిత్రం నిర్మించింది. ఈ చిత్రం జాతీయ పురస్కారాలలో ఉత్తమ చిత్రానికి గాను స్వర్ణకమలంతో పాటు ఎన్నో పురస్కారాలు అందుకుంది. ఈ చిత్రానికి కర్ణాటక ప్రభుత్వం నుండి ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ ఛాయా చిత్ర గ్రహణానికి గాను అవార్డులు వరించాయి. ఈ చిత్రం అంతర్జాతీయ చిత్రోత్సవాలలో కూడా ప్రదర్శించబడింది. ఏప్రిల్ 17, 2004న ఎన్నికల సందర్భంగా, భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రశంగించడానికి బయలుదేరుతున్న సమయంలో విమాన ప్రమాదం సంభవించింది. ఆమె అన్న, కన్నడ చిత్రాల నిర్మాత అమర్‌ నాధ్ కూడా ఆ ప్రమాదంలో మరణించారు. ఆమె కన్నడంలో నటించిన ఆఖరి చిత్రం ‘ఆప్త మిత్ర’ విజయవంతమైంది. ప్రస్తుతం ఆమె జ్ఞాపకార్ధం ‘సౌందర్య స్మారక పురస్కారం’ను కర్ణాటకాంధ్ర లలితకళ అకాడమీ వారు ప్రతీ ఏడాది ఉగాది పండుగ రోజున ఉత్తమ నటీమణులకు ప్రదానం చేస్తున్నారు. టాలీవుడ్ లో అత్యంత ప్రతిభను కనబరిచిన నటీమణులలో సౌందర్య ఒకరు. ప్రముఖ హీరో విక్టరీ వెంకటేశ్ సరసన రాజా, జయం మనదేరా, పెళ్ళి చేసుకుందాం, పవిత్ర బంధం వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి ఫ్యాన్స్ ప్రశంసలను అందుకున్నారు. టాలీవుడ్ లో వీళ్ళిద్దరూ విజయవంతమైన జంటగా మంచి గుర్తింపు పొందారు. తెలుగు ప్రజలు ఎప్పటికీ సౌందర్య ను మర్చిపోలేరు.

పన్నెండేళ్ళ అచిర కాలంలోనే సౌందర్య 6 ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలను, అమ్మోరు, అంత:పురం, రాజా, ద్వీప చిత్రాలకు ఆమె ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకున్నారు. అలాగే ఉత్తమ నటి, ఉత్తమ నిర్మాత విభాగాల్లో కూడా సౌందర్య ఆప్తమిత్ర, ద్వీప చిత్రాలకు 2 అవార్డులను అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అమ్మోరు, పవిత్రబంధం, అంత:పురం చిత్రాలకు గానూ 3 ప్రతిష్టాత్మక నంది అవార్డ్ లను అందుకున్నారు. పరిశ్రమలో లైట్ బాయ్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరినీ ఆదుకునే మనిషిగా సౌందర్యకు మంచి పేరు ఉంది. సౌందర్యని తెలుగింటి ఆడపడుచుగా ఆదరించిన ప్రేక్షకులు ఆమెను జూనియర్ సావిత్రిగా వర్ణించారు. సౌందర్యకు ‘నవరస నటన మయూరి’ అనే బిరుదు కూడా ఉంది. సౌందర్య తన మేనమామ, చిన్ననాటి స్నేహితుడు, సాఫ్ట్‌వేర్ ఇంజనీరైన జి.ఎస్. రఘును 27 ఏప్రిల్ 2003లో పెళ్ళి చేసుకున్నారు. ఈమె ‘అమర సౌందర్య సోషియల్ & ఎడ్యుకేషనల్ ట్రస్ట్’ ద్వారా తన భర్త, ఆడపడుచుల సహకారంతో ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతూ కర్నాటక, ములబాగల్ తాలూకాలోని తన గ్రామం గంగికుంటను అభివృద్ధి పరచారు. ఓ అనాధ ఆశ్రమాన్ని, ‘అమర సౌందర్య విద్యాలయ’ పేరుతో ఓ పాఠశాలను స్థాపించారు.

వీరి కుటుంబం నేటికీ ఈ విద్యాలయాలకు ధన సహాయం చేస్తూనే వుంది. సౌందర్యకు తల్లి మంజుల, భర్త జీఎస్ రఘు, సోదరుడు అమరనాథ్, అతని భార్య బి. నిర్మల, వీరి కుమారుడు సాత్విక్ ఉన్నారు. అప్పట్లోనే స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్న సౌందర్యకు  ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయంటారు. అప్పటి లెక్క ప్రకారమే దాదాపు 100 కోట్ల ఆస్తులు సౌందర్యకు ఉన్నట్లు సౌందర్య కుటుంబ సభ్యులే చెప్పడం ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే నటి సౌందర్య మరణించిన తర్వాత ఆస్తుల పంపకాల విషయమై కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు చెలరేగాయి. సౌందర్య 2003 ఫిబ్రవరి 15న వీలునామా రాశారని, ఆమె వీలునామా ప్రకారం ఆస్తులు పంపిణీ చేయాలని అమరనాథ్ భార్య నిర్మల 2009లో బెంగళూరులోని మెజిస్టేట్ కోర్టును ఆశ్రయించారు. సౌందర్య ఎలాంటి వీలునామా రాయలేదని, నిర్మల సోదరుడు న్యాయవాది కావడంతో తప్పుడు వీలునామా సృష్టించారని సౌందర్య తల్లి మంజుల, రఘు కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి కోర్టులో ఆస్తి వివాదం నడుస్తోంది. తన అత్త మంజుల, వరుసకు సోదరుడు అయిన రఘు తనపై కక్ష సాధిస్తూ దౌర్జన్యం చేస్తున్నారని నిర్మల కోర్టులో కేసు ఫైల్ చేసింది. సౌందర్య రాసిన వీలునామా డూప్లికేట్ అని ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ నిర్మల న్యాయవాది ధనరాజ్, సౌందర్య భర్త రఘు, ఆమె తల్లి మంజులపై పరువు నష్టం క్రింద దావా వేశారు. ఈ వివాదాలతో ఇంత కాలం వీళ్ళు కోర్టు చుట్టూ తిరిగారు. 2013 డిసెంబర్ 3వ తేదీన వీళ్ళందరూ ఒక రాజీకి వచ్చి ఆస్తులు పంచుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here