Komali Prasad : టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన నటి కోమలి ప్రసాద్ ప్రస్తుతం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈసారి ఆమె చేసిన పని సినిమా కంటే కూడా ప్రత్యేకం. డాక్టర్‌గా మళ్లీ ప్రాక్టీస్ చేయడానికి ఆమె సిద్ధమవుతోంది. ఓ వైపు సినీ రంగంలో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆమె, మరోవైపు డాక్టర్‌గా మళ్లీ తన వృత్తిని కొనసాగించాలనే నిర్ణయం తీసుకోవడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచే విషయమే.

విశాఖపట్నంలో పుట్టి పెరిగిన కోమలి ప్రసాద్ చిన్ననాటి నుంచే చదువులో ప్రతిభ కనబర్చింది. ఆమె తల్లిదండ్రులు కూడా ఆమె చదువులపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. అదే సమయంలో, క్రీడా రంగంలోనూ ఆమె మంచి ప్రతిభ కనబర్చింది. కోకో, బ్యాడ్మింటన్ వంటి ఆటలలో ఆమె బంగారు పతకాలు గెలిచింది. అంతేకాకుండా, ఆమె ఒక మంచి క్లాసికల్ డాన్సర్ కూడా. విద్యలో, క్రీడల్లో, నృత్యంలో ఒకేసారి ప్రతిభ కనబర్చిన కోమలి, అనంతరం అహ్మద్‌నగర్‌లోని ప్రవర మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో మెడిసిన్ పూర్తిచేసింది.
మెడిసిన్ పూర్తి చేసిన తర్వాత, అమెరికాలో మాస్టర్స్ చేయాలనే లక్ష్యంతో న్యూయార్క్ వెళ్లాలనే ఆలోచనలో ఉన్న సమయంలో, ఆమెకు అనుకోకుండా సినిమాల్లో అవకాశం వచ్చింది. మొదట తలంపులో లేని అవకాశం వచ్చినా, ఆ ఛాన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చి, ఆమె మాస్టర్స్ అప్లికేషన్‌ను చింపేసేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
2016లో ‘సీతాదేవి’ సినిమాతో ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం నెపోలియన్, రౌడీ బాయ్స్, సెబాస్టియన్ PC 524, హిట్-2, హిట్-3 వంటి సినిమాల్లో నటించి తన నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇటీవలి హిట్ చిత్రం హిట్-3లో నాని సరసన ‘ఎస్పీ వర్షా’ పాత్రలో కనిపించి తన పాత్రకు ప్రాధాన్యతను చాటుకుంది.
ఇంతవరకు సినిమాల్లో బిజీగా ఉన్న కోమలి ప్రసాద్, ఇప్పుడు మరోసారి డాక్టర్‌గా తన రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. ఆమె ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో వైట్ కోట్ ధరించిన ఫోటోలు షేర్ చేస్తూ, “స్వచ్ఛమైన నవ్వుల కోసం సిద్ధంగా ఉండండి.. త్వరలోనే డాక్టర్ కోమలి ప్రసాద్ రాబోతోంది” అని పేర్కొంది. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది చూసిన అభిమానులు ఆమె నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. కొన్ని టీవీ షోలు, సోషల్ మీడియా ద్వారా మాత్రం ఆమె అభిమానులతో టచ్‌లో ఉండే అవకాశముంది. ఆమె నటనను మిస్ అవుతామన్న వేదన కొంతమందిలో ఉన్నా, సేవా దృక్పథంతో చేసిన ఈ నిర్ణయం హృదయాన్ని తాకుతోంది.
కోమలి ప్రసాద్ ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. చదువు, క్రీడలు, నాట్యం, సినిమాలు అన్నీ అద్భుతంగా సమతౌల్యంలో ఉంచి ముందుకు సాగుతోంది. ఇప్పుడు ఆమె వైద్య సేవల్లో మునిగి తెలుగునాట మరో రోల్ మోడల్‌గా నిలవనుంది.































