తాజ్‌మహల్ సమాధికి చరిత్రలో గుర్తింపు ఉన్నట్లే తెలుగు చలనచిత్ర సీమలో “ప్రేమనగర్” చిత్రానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సురేష్ ప్రొడక్షన్స్ లో తన జీవితం తాడోపేడో తేల్చుకుందామని ప్రముఖ నిర్మాత రామానాయుడు తన చివరి ప్రయత్నంగా నిర్మించిన చిత్రమిది. అప్పట్లో రచయి(త్రి)తలు రాసిన సూపర్ హిట్ నవలలను సినిమాలుగా నిర్మిస్తున్న కాలం అది. ప్రముఖ రచయిత్రి కోడూరి కౌసల్యా దేవి రచించిన “విరచిత” నవలకు ప్రతిరూపమే ఈ “ప్రేమనగర్” చిత్రం.

ఆ రోజుల్లో ఎందరో నిర్మాతలు, దర్శకులు ఈ చిత్రాన్ని నిర్మించాలని ప్రయత్నించినా ఎందుకనో ధైర్యం చేయలేకపోయారు. కానీ ఈ నవలను చదివిన రామానాయుడు, అప్పటి అగ్ర హీరో అక్కినేని నాగేశ్వరరావుకు ఆ నవల కోసం చెప్పడంతో ఆయన బాగుందని, అందులోని కళ్యాణ్ పాత్ర నచ్చిందని చెప్పడంతో ఆ పాత్రను అక్కినేని నాగేశ్వరరావుతోనే చేయించారు రామానాయుడు. 1971 లో ప్రారంభించిన ఈ చిత్రం షూటింగ్ జరిగే టైంలో వాహిని స్టూడియో అంతా కిటకిటలాడిపోయింది. ఇంకా ఈ చిత్రానికి సంబంధించిన మరో విశేష సంఘటన ఏమిటంటే.? అక్కినేనికి రామా నాయుడు మీద ఉండే అభిమానంతో వారి మాటను కాదనలేక దేవుడికి కొబ్బరికాయ కొట్టారు. ఆ కొబ్బరికాయ సరిగ్గా 2 భాగాలుగా పగలడంతో అక్కడున్న వాళ్ళందరూ ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారట. దేవుడి పటాలకు కొబ్బరికాయ కొట్టడం అదే మొదటిసారి. అదే ఆఖరిసారి అని అక్కినేని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలపడం విశేషం.

ఇక ఈ చిత్రం వెనుక దాగివున్న రహస్యాల వివరాల్లోకి వెళ్తే.. 1971లో అక్కినేని నాగేశ్వర రావు, వాణిశ్రీ జంటగా వచ్చిన ‘ప్రేమ నగర్’ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. అయితే ఈ చిత్రం విజయం వెనుక ఒక ఆసక్తికరమైన కథ వుంది. అదేమిటంటే.. ఈ చిత్ర నిర్మాణానికి ముందు ఆ టైంలో ప్రముఖ రచయిత్రి కోడూరి కౌసల్యదేవి ‘విరచిత’ పేరుతో రాసిన నవల అద్భుతంగా పాఠకుల ప్రశంసలను అందుకుంది. ఆ సంగతి తెలుసుకున్న శ్రీధర్ రెడ్డి అనే నిర్మాత ANR హీరోగా ఈ కధను సినిమాగా తెరపైకి తీసుకురావాలని నిర్ణయించుకుని ఆ రచయిత్రి వద్ద నవల కాపీరైట్స్ ను కొనేశారు. ఆ తర్వాత ఆ నవల ఆధారంగా సినిమా
స్క్రిప్ట్ సిద్ధం చేయించి అక్కినేనికి ఇచ్చారు. స్వతహాగా ఏ పుస్తకాన్ని పూర్తిగా చదివే అలవాటు లేని ANR ఆ సినిమా స్క్రిప్ట్ ను చదవమని శ్రీమతి అన్నపూర్ణగారికి ఇచ్చారు. ఆవిడ ఆ స్క్రిప్ట్ ను మొత్తం చదివి దేవదాసులో లేని కమర్షియల్ అంశాలు ఇందులో చాలా ఉన్నాయని ఈ నవలను సినిమాగా తీసి.. అందులో ANR హీరోగా నటిస్తే ఆ సినిమా ఖచ్చితంగా విజయవంతమౌతుందని జోస్యం చెప్పారు. అంతే.. వెంటనే అన్నపూర్ణ గారి మాట విన్న ANR ఆ సినిమా ప్రాజెక్ట్ ను ఓకే చేసేశారు.

హీరోయిన్ గా ముందు KR విజయ ను ఫిక్స్ చేశారు. హీరోయిన్ పాత్ర కోసం కాస్ట్యూమ్స్ కొనేందుకు కారు ప్రయాణం చేస్తుండగా దారి మధ్యలో శ్రీధర్ రెడ్డి కారు అనుకోకుండా యాక్సిడెంట్ కు గురైంది. ఊహించని ఆ సంఘటనతో ఇదేదో అపశకునంలా భావించిన శ్రీధర్ రెడ్డి భార్య ఈ చిత్రాన్ని నిర్మించే ఆలోచనను విరమించుకున్నారు. అయితే కథలో బలం తెలిసిన అక్కినేని దీన్ని ఎలాగైనా కొనుక్కోమని రామానాయుడు గారికి రికమండ్ చేశారు. హీరోయే స్వయంగా అంత నమ్మకంతో చెబుతుంటే ఎవరైనా కాదంటారా.? అక్కినేని మాట కాదనకుండా వెంటనే ఆ నవల కాపీరైట్స్ ను శ్రీధర్ దగ్గర్నుండి కొనేశారు రామా నాయుడు. ఇక ఈ చిత్రానికి దర్శకుడిగా రాఘవేంద్రరావు గారి తండ్రి K.s ప్రకాష్ రావు గారిని తీసుకున్నారు. సినిమా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు కూడా జరిగాయి. హీరోయిన్ KR విజయ స్థానంలోకి వాణిశ్రీ వచ్చింది. అప్పట్లోనే 15 లక్షల బడ్జెట్ తో రామా నాయుడు గారు ‘ప్రేమ నగర్’ ని భారీగా నిర్మించారు. 34 ప్రింట్లతో విడుదల చేస్తే ఊహించని విధంగా 50 లక్షలు వసూలు చేసిందీ బ్లాక్ బస్టర్ మూవీ.

గమ్మత్తేమిటంటే.. ఈ చిత్రం విడుదలైన 15రోజులు భారీ వర్షాలు పడుతున్నా సరే.. ప్రేక్షకులు ఆ వర్షాలను లెక్క చేయకుండా గొడుగులు వేసుకుని తండోప తండాలుగా వచ్చి మరీ సినిమా చూశారు. Kv మహదేవన్ సంగీతం, ఆచార్య ఆత్రేయ సంభాషణలు, వెంకట రత్నం ఛాయాగ్రహణం అన్ని కలిసి ఈ చిత్రాన్ని ఓ అద్భుత దృశ్యకావ్యంలా మలిచాయి. గుమ్మడి, శాంతకుమారి, కైకాల సత్య నారాయణ, వరలక్ష్మి, రాజబాబు, ధూళిపాల లాంటి ఎందరో ప్రముఖ నటీనటులు తమ నటనా చాతుర్యం చూపించి ఈ చిత్ర విజయంలో భాగస్వాములయ్యారు. ఈ చిత్రాన్ని తమిళంలో శివాజీ గణేషన్ హీరోగా రామానాయుడు గారే రీమేక్ చేశారు. తమిళంలో కూడా హీరోయిన్ గా వాణిశ్రీనే ఎంచుకున్నారు. ఇక బాలీవుడ్ లో రాజేష్ ఖన్నా, హేమమాలినిలతో తీస్తే అక్కడ కూడా సూపర్ హిట్ సాధించింది ప్రేమ నగర్. ఈవిధంగా శ్రీధర్ రెడ్డి, K.R విజయల చేయి జారిన అదృష్టం.. రామా నాయుడు, వాణిశ్రీలకు అద్భుతంగా కలిసొచ్చింది. సురేష్ బ్యానర్ విలువ “ప్రేమ నగర్” దెబ్బకు రెట్టింపయ్యింది.



























