1987వ సంవత్సరంలో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన స్వయంకృషి సినిమాలో విజయశాంతి, చిరంజీవి, మాస్టర్ అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో మాస్టర్ అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులను వెండితెరకి కట్టిపడేసారని చెప్పుకోవచ్చు. స్వయంకృషి సినిమాలో చిరంజీవి అలియాస్ సాంబయ్య చెల్లెలు చనిపోతుంది. అయితే తన చెల్లెలుకు కుమారుడు ఉంటాడు. ఆ కుమారుడి పాత్రలో మాస్టర్ అర్జున్ అద్భుతంగా నటించాడు. సాంబయ్య (చిరంజీవి) పెంచుకునే శిరీష్ గా నటించిన మాస్టర్ అర్జున్ తదనంతరం తాతినేని రామారావు దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి నటించిన పచ్చని కాపురం లో కూడా బాలనటుడిగా నటించి అందరినీ ఫిదా చేశాడు.

ఈ సినిమాలో కృష్ణ, శ్రీదేవి భార్యాభర్తలుగా నటించారు. ఈ సినిమాలో వీళ్ళిద్దరూ విడిపోగా… కుమిలిపోయే కొడుకు పాత్రలో మాస్టర్ అర్జున్ గొప్పగా నటించి ప్రేక్షకుల మనసులను చూరగొన్నాడు. కృష్ణ, అర్జున్ మధ్య కొనసాగే ఒక పాటను ఏసుదాసు పాడగా ఆ పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్ గా నిలుస్తుంది.

శోభన్ బాబు, సుహాసిని, ప్రీతి నటించిన ఇల్లాలు ప్రియురాలు సినిమాలో కూడా బాలనటుడిగా మాస్టర్ అర్జున్ నటించి ఎంతగానో మెప్పించాడు. ఈ మూవీలో శోభన్ బాబు ప్రియురాలు కి జన్మించిన బాలుడు పాత్రలో అర్జున్ నటించాడు. శోభన్ బాబు ప్రియురాలు ప్రీతి చనిపోవడంతో కొడుకు మాస్టర్ అర్జున్ సుహాసిని ఇంటికి వెళ్లి తిట్లు తింటాడు. సుహాసినికి పుట్టిన మీనాతో విపరీతంగా తన్నులు తింటాడు. ఈ సినిమాలో విషాదకరమైన సన్నివేశాల్లో మాస్టర్ అర్జున్ చూపిన అద్భుతమైన నటనా చాతుర్యానికి ఎవరైనా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

మాస్టర్ అర్జున్ చాలావరకు ప్రేక్షకులకు కన్నీరు తెప్పించే విషాదకరమైన పాత్రలలోనే నటించి అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. హిందీ, కన్నడ, తెలుగు భాషా చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక ఊపుఊపిన మాస్టర్ అర్జున్ పెద్దవాడైనా తరువాత సినిమాలలో హీరోగా తెరంగేట్రం చేశాడు కానీ సక్సెస్ అవ్వలేక పోయాడు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఉన్నత చదువులు చదివి ప్రస్తుతం అమెరికాలో డాక్టర్ గా సెటిల్ అయ్యారు. సంగీతంపై ఆసక్తి ఉన్న మాస్టర్ అర్జున్ తన ఖాళీ సమయాల్లో కచేరీలు వంటివి చేస్తుంటారని సమాచారం.



























