తెలుగు చలన చిత్రసీమలో అందాల హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న సుమన్ ఒకప్పడు టాలీవుడ్ లో క్రేజీ హీరోగా, యాక్షన్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే టాలీవుడ్ లో ఆరోజుల్లో ఏర్పడిన పోటీ వాతావరణం వలన ఊహించని విధంగా సుమన్ కొన్ని వివాదాలలో చిక్కుకున్నారు. దాంతో అతని కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. ఆ తర్వాత కొన్ని విపత్కార పరిస్థితుల్లో సుమన్ జైలుకు వెళ్లటంతో ఆయన సినిమా కెరీర్ పూర్తిగా దెబ్బతింది.

అయితే సుమన్ జైలుకు వెళ్లటం వెనుక ఓ ప్రముఖ హీరో హస్తం ఉన్నట్టుగా అప్పట్లో రూమర్స్ కూడా వచ్చాయి. ముందు కోలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుమన్ ఆనతికాలంలోనే టాలీవుడ్‌లో కూడా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. తన మిత్రుడైన భానుచందర్ సహాయంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సుమన్ కు యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉండటంతో పాటు హీరోకుండాల్సిన పర్సనాలిటీ వుండటంతో సుమన్ కు ఆ అందమే ప్లస్ పాయింట్ గా మారి మెగాస్టార్ చిరంజీవిలాంటి అగ్ర హీరోలకు కూడా పోటీ ఇచ్చేంత స్థాయికి ఎదిగాడు. కెరీర్ మంచి ఊపులో ఉన్న టైంలో సుమన్ బ్లూ ఫిలింస్ కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్లటంతో అతని కెరీర్ ఒక్కసారిగా తారుమారైంది. ఆరోజుల్లో సుమన్ ఎదుగుదలను ఆపేందుకునే టాలీవుడ్ లోని కొందరు సినీ ప్రముఖులు సుమన్ ను బ్లూఫిల్మ్ కేసుల్లో ఇరికించారన్న గాసిప్స్ సంచలనం సృష్టించాయి.

సుమన్‌ను బ్లూ ఫిలింస్ కేసులో అరెస్ట్ చేసి, ఆయనపై గూండా యాక్ట్ కేసు కూడా ఫైల్ చేశారు. అయితే ఈ వివాదంలో తెర వెనుక ఓ ప్రముఖ హీరో హస్తం వున్నట్లుగా టాక్ వినిపించింది. ఎక్కడైతే సుమన్ తనకు పోటి వస్తాడన్న స్వార్థంతో ఆ హీరోయే ఇదంతా చేయించాడన్న గాసిప్స్ వినబడినా ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో అవన్నీ రూమర్స్ గా కొట్టి పారేశారు. జైలు నుండి బయటికొచ్చి అన్నమయ్య లాంటి భక్తి చిత్రాలలో నటించి తర్వాత కూడా ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా చాలా సందర్భాల్లో సుమన్ కు ఇదే ప్రస్తావన ఎదురయ్యేది. అసలు సుమన్ ను ఇరికించిందెవరు..? నిజంగానే టాలీవుడ్ లోని ప్రముఖులా.? లేక బయటి వ్యక్తులా..? సుమన్ తో పాటు భానుచందర్‌ను కూడా ఇబ్బంది పెట్టాలని చూశారా..? ఇలా ఎన్నో ప్రశ్నలు తరుచూ సుమన్ ని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తుంటే.. గతంలో చాలాసార్లు ఈ సందేహాలకు క్లారిటీ ఇచ్చారు సుమన్. అయితే లేటెస్టుగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి ఇదే అంశంపై మాట్లాడారు హీరో సుమన్.

“తనను కేసులలో ఇరికించిన వ్యక్తి కోసం గతంలో ఓ తమిళ పత్రిక ఇంటర్వ్యూలో అన్ని విషయాలు క్లుప్తంగా తెలియజేశానని అతని పేరు దివాకర్ అని, అతనికీ టాలీవుడ్ కూ ఏ సంబంధం లేదని, తన సమస్య పూర్తిగా ప్రైవేట్ ఫ్యామిలీ ఎఫైర్ అని, అయితే ఈ వివాదంలోకి సినీ ప్రముఖుల పేర్లను మీడియావాళ్ళు కావాలనే ప్రస్తావించారని” బాధ పడ్డారు సుమన్. ఈ సందర్భంగా మరో ముఖ్యమైన విషయం చెబుతూ.. “తను జైలుకు వెళ్తానన్న విషయం తనకు ముందే తెలుసని, ఈ వివాదంలో తన మిత్రుడు భాను చందర్‌ను కూడా ఇరికించే ప్రయత్నంలో వున్నారని తెలుసుకుని అతన్ని కాపాడేందుకు విశ్వ ప్రయత్నం చేశానని, ఆ టైంలో భానుచందర్‌తో తనను కలవొద్దని, ఫోన్ కూడా చేయొద్దని చెప్పానని, నేను టాలీవుడ్ లో హీరోగా బాగానే క్లిక్ అవుతానని నమ్మిన ఏకైక వ్యక్తి భాను చందరేనని, నా వల్ల అతను ఇబ్బందులు పడకూడాదనే అలా చెప్పానని తెలిపారు సుమన్. ఆ రోజు జరిగిన వివాదాలకు పూర్తి కారణం అప్పటి నా మిత్రుడు దివాకరే. అతనికి సంబంధించిన విషయాలేవి నేను రహస్యంగా దాయలేదు. కానీ మీడియా మాత్రం కొంత మంది హీరోల పేర్లు తెర మీదకు తీసుకువచ్చింది. వాస్తవానికి అవన్నీ వట్టి పుకార్లే..

ఆ రోజు జరిగిన దానితో ఏ హీరోకు సంబంధం లేదు. అంతే కాకుండా నాపై కేసు ఫైలైన సమయంలో గూండా యాక్ట్ పెట్టడంతో పరిస్థితి మరింత సీరియస్ అయ్యింది. అంతకు ముందు ఇలాంటి కేసులు రిఫరెన్స్ లేకపోవటంతో అన్ని విషయాలు కూలంకషంగా చర్చించి క్లీన్ చీట్ ఇవ్వడానికి, అసలు విషయం బయటకు రావాడానికి చాలా టైం పట్టింది. చివరకు అన్ని ఆరోపణలు అబద్ధాలేనని తేలిపోయింది” అంటూ ఆనాటి చేదు జ్ణాపకాలను గుర్తు చేసుకున్నారు హీరో సుమన్.



























