సాధారణంగా ఆడపిల్లలకు పాతికేళ్లు నిండగానే వచ్చే మొదటి ప్రశ్న పెళ్లెప్పుడు.? అని.. ఇక సినిమా హీరోయిన్స్ కైతే 30 ఏళ్ల వరకు పెళ్లికి ఛాన్స్ ఉంటుంది.

కానీ కొందరు హీరోయిన్‌లు మాత్రం 40 కాదు 50 దాటినా కూడా పెళ్లికి దూరంగా ఉన్నారు. అలా 40 ప్లస్ దాటుతున్నా ఇంకా పెళ్ళి చేసుకోకుండా సినిమాల్లో నటిస్తున్న ప్రముఖ హీరోయిన్లు ఎవరనేది మీరే చదివి తెలుసుకోండి.

హీరోయిన్ టబు బాలీవుడ్ , టాలీవుడ్ అనే భేధం లేకుండా అన్ని భాషల్లో నటించి టాప్ హీరోయిన్ గా మంచి గుర్తింపునే సంపాదించుకుంది. ఈమె వయసు 48. నాగార్జునతో అప్పట్లో ప్రేమలో పడిందనే రూమర్స్ కూడా వచ్చాయి. ఆయన కారణంగానే ఇప్పటికీ పెళ్లికి దూరంగా ఉందనే గాసిప్స్ కూడా వినిపిస్తుంటాయి.
అయితే ఇంతవరకు టబుకు ఎందుకు పెళ్లి చేసుకోలేదని ఆరా తీస్తే.. ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతవరకూ టబు పెళ్లి చేసుకోకపోవడానికి బాలీవుడ్ హీరో కారణం అని తెలుస్తుంది. ఆ హీరో మరెవరో కాదు.. అజయ్ దేవగన్. తనకు అజయ్ తో పాతికేళ్ల స్నేహం ఉందని, అజయ్ వల్లే తాను పెళ్లి చేసుకోలేదని, పెళ్లి చేసుకోనందుకు తనకు ఎలాంటి బాధా లేదని కూడా టబు తెలియ జేసింది.

సీనియర్ హీరోయిన్ శోభన అందరికీ గుర్తుండే ఉంటుంది. 1984లో సుమన్ హీరోగా వచ్చిన ‘శ్రీమతి కనుక’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది శోభన. ఆ తరువాత వెంకటేష్ తో ‘అజేయుడు’, ‘త్రిమూర్తులు’ వంటి చిత్రాల్లో నటించింది. ఆ వెంటనే చిరంజీవితో ‘రుద్రవీణ’ , బాలకృష్ణ తో ‘మువ్వగోపాలుడు’, నాగార్జునతో ‘విక్రమ్’ వంటి చిత్రాల్లో నటించింది. మలయాళం నటి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. అయితే ఈమె వయసు 50 ఏళ్ళకు దగ్గర పడుతున్నప్పటికీ ఇంకా పెళ్ళి చేసుకోకపోవడం గమనించదగిన విషయం. దానికి కారణం ఈమె ఓ మలయాళ హీరోని ప్రేమించిందట. కానీ అతను ఈమెకు హ్యాండివ్వడంతో ఇప్పటి వరకూ పెళ్ళి చేసుకోకుండా ఒంటరిగా ఉండి పోయినట్టు తెలుస్తుంది. దక్షిణాది భాషల్లో వందలాది సినిమాలు చేసిన శోభన ప్రస్తుతం ఓ పాపను దత్తత తీసుకుందని తెలిసింది.

1990 లో వచ్చిన ‘మనసు మమత’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది సితార. 46 ఏళ్ళ వయసు దాటినా ఈమె ఇంకా పెళ్ళి చేసుకోలేదంటే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే. అందుకు కారణం.. అప్పట్లో తమిళ నటుడు మురళితో సితార ప్రేమాయణం నడిపించిందని.. ఆ ప్రేమ కాస్త విఫలం కావడంతో ఇంతవరకూ సితార పెళ్లి చేసుకోలేదు అంటూ ఆప్పట్లో రూమర్స్ వచ్చాయి. అయితే సితార ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో తన పెళ్ళి ప్రస్తావన తీసుకొచ్చింది. ”మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం. అన్ని విషయాల్లో నేను ఆయన సలహాలు తీసుకునే దాన్ని. ఆయన నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చేవారు. ఏ పని చేయాలనుకున్నా ఆయనకి చెప్పే చేసేదాన్ని. నాకు అంతిష్టమైన మా నాన్న గారు… సడన్ గా మరణించడంతో నేను చాలా మనో వేదనకు గురయ్యాను. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఏ సినిమా లోనూ నటించలేదు.ఆ టైములో ఆ బాధను మరిచిపోవడానికి ఖాళీ లేకుండా అన్ని భాషల్లోనూ సినిమాలు చేశాను. ఈ క్రమంలో పెళ్ళి గురించి కూడా ఆలోచించలేదు. ఒకవేళ భవిష్యత్ లో పెళ్ళి చేసుకుంటే ఖచ్చితంగా మీడియాకి చెప్పే చేసుకుంటాను” అంటూ సితార చెప్పుకొచ్చారు.

అప్పట్లో టాలీవుడ్ స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, లెజెండ్ బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ ఇలా అగ్ర హీరోలందరి సరసన నటించింది నగ్మా. టాలీవుడ్ తో పాటూ కోలీవుడ్,బాలీవుడ్ లో కూడా అగ్రహీరోలందరితో నటించి సక్సెస్ ఫుల్ నటిగా మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్రను పోషిస్తున్న నగ్మా వయసు 50కి దగ్గరవుతుంది. అయినప్పటికీ ఇంకా పెళ్ళి చేసుకోకపోవడంతో ఈమధ్య ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న నగ్మాను.. ‘మీరు పెళ్ళెప్పుడు చేసుకోబోతున్నారు.? అని ప్రశ్నించారు మీడియా ప్రతినిధులు. ఆ ప్రశ్నకి నగ్మా సమాధానమిస్తూ… “పెళ్ళి ఎప్పుడు జరగాలని రాసిపెట్టి ఉంటే అప్పుడే జరుగుతుంది. ఎవరికైనా పెళ్ళెప్పుడు జరుగుతుంది? అసలు జరుగుతుందా? లేదా? అనే విషయాన్ని దేవుడు ముందే రాసి పెడతాడు. దాన్ని నేను డిసైడ్ చేయలేను.అలా అని నేను పెళ్ళికి వ్యతిరేకం కాదు” అంటూ తెలివిగా తెలియజేసింది నగ్మా. ఇంతకీ అసలు విషయమేమిటంటే.. అప్పట్లో ప్రముఖ క్రికెటర్ సౌరవ్ గంగూలీతో ప్రేమాయణం విఫలం కావడం.. ఆ తర్వాత తమిళ నటుడు శరత్ కుమార్ తో కూడా ప్రేమ విఫలం కావడంతో నగ్మా పెళ్లికి దూరంగా ఉందన్నదే నిజం.

వయసులో తనకంటే 15 ఏళ్ల చిన్నవాడ్ని ప్రేమిస్తోంది సుస్మితా సేన్ . మిస్ యూనివర్స్ గా ఎంపికై సంచలనం సృష్టించిన ఈ భామకు ప్రస్తుత వయస్సు 44 ఏళ్ళు అయితే ప్రేమ పేరుతో చెట్టా పట్టలేసుకొని తిరుగుతుంది కానీ ఇంకా పెళ్ళి చేసుకోలేదు. అయితే పిల్లల మీద మమకారంతో ఈమధ్యనే ఇద్దరు పిల్లలను దత్తత కూడా తీసుకుంది. కట్ చేస్తే ఇప్పుడు పెళ్ళిపై మనసు మల్లిందేమో కొంత కాలంగా తనకంటే వయసులో చాలా చిన్నవాడైన రొహమన్ షాల్ తో జోరుగా ప్రేమాయణం సాగిస్తోంది.
త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారని బాలీవుడ్ టాక్. ఇద్దరికి వయసులో 15 ఏళ్లకు పైనే తేడా ఉన్నప్పటికీ, వాళ్ళిద్దరి ప్రేమ ముందు అది బలాదూర్ అని అంటున్నారు.

అల్లుడుగారు వచ్చారు, పంచదార చిలక లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించి, తన అందం, అభినయం, నటనతో బాగానే ఆకట్టుకున్న నటి కౌసల్యకి ప్రస్తుతం 40 సంవత్సరాలు వచ్చాయి. దీంతో ఈ అందాల తార పెళ్లి గురించి సోషల్ మీడియాలో కొన్ని గాసిప్స్ హల్ చల్ చేస్తున్నాయి. మలయాళ చిత్రసీమకు చెందిన ఓ స్టార్ హీరోతో ఈ అమ్మడు అప్పట్లో ప్రేమాయణం నడిపిందని, ఆ హీరో మాత్రం ఓ బడా వ్యాపార వేత్త కూతురిని పెళ్లి చేసుకున్నాడని దాంతో కొంతకాలం పాటు నటి కౌసల్య తీవ్ర మనస్థాపానికి గురై సినీరంగానికి దూరమైందని మీడియా టాక్. డిప్రెషన్ నుండి కోలుకొని మళ్లీ ఇటీవలే సినిమాల్లో నటిస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.

40కి చాలా దగ్గర్లో ఉన్న కత్రినా కైఫ్ కూడా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. బాలీవుడ్ స్టార్ హీరోలైన సల్మాన్ ఖాన్, రణ్‌బీర్‌తో కత్రినా నడిపిన ప్రేమ పురాణం సంగతులు అందరికీ తెలిసినవే. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఇద్దరికీ బ్రేకప్ చెప్పేసిన కత్రినా.. ఇప్పటికీ పెళ్లి మాత్రం చేసుకోలేదు.

అనుష్క శెట్టి వయసు 40 వరకు వచ్చినా కూడా ఇంతవరకూ పెళ్లి ఊసే ఎత్తడం లేదు. అనుష్క పెళ్లిపై ఇప్పటికే రకరకాల పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే.. హీరో ప్రభాస్ తో అనుష్క ప్రేమలో ఉందని రకరకాల వార్తలు వచ్చాయి. కానీ అప్పట్లో ఆ ప్రచారాన్ని కొట్టిపారేసింది కూడా.! ఈమధ్య అనుష్క ఓ క్రికెటర్‌తో ప్రేమలో ఉందని, త్వరలో అతన్నే పెళ్లి చేసుకోబోతుందనే రూమర్స్ మళ్ళీ మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో స్వీటీ మరోసారి తన పెళ్లి వార్తలపై స్పందించింది. ‘ప్రస్తుతం నేను ఎవరితోనూ ప్రేమలో లేను. నేను ప్రేమలో ఉన్నట్లు తరచూ వార్తలు వినిపిస్తుంటాయి. అవి నాకు చాలా బాధను కలిగిస్తున్నాయి. అలాంటి వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. నా పేరెంట్స్ ఎవరిని చూపించి పెళ్లి చేసుకోమంటారో వాళ్ళతోనే తాళి కట్టించుకుంటానని’ అని అనుష్క స్పష్టంగా తెలియజేసింది.

నయన తార వయసు కూడా 40కి దగ్గర్లో ఉంది. గతంలో శింబు, ప్రభుదేవాలతో ప్రేమ విఫలమైన తర్వాత ప్రస్తుతం ‘గ్యాంగ్’ చిత్ర దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో ప్రేమాయణం నడిపిస్తుందన్న సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ సహ జీవనం చేస్తున్నారని, రేపో మాపో పెళ్ళి కూడా చేసుకోబోతున్నారని ఎప్పటికప్పుడు గాసిప్స్ వస్తూనే వున్నాయి. ఇప్పుడు తాజాగా మరో వార్త కోలీవుడ్ లో హల్ చల్ చేస్తుంది. అదేంటంటే అన్ని భాషల్లో కలుపుకుని 100 సినిమాలను పూర్తి చేశాకే పెళ్ళి చేసుకోవాలని నయనతార నిర్ణయించుకుందట. ఇంత వరకూ 60 సినిమాల్లో నటించింది నయన్. ఇప్పుడు మరో అరడజను చిత్రాలను లైన్లో పెట్టింది. ఈ క్రమంలో నయనతార అనుకున్న టార్గెట్ ను చేరుకోవాలంటే ఓ నాలుగైదేళ్ళయినా పడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ లెక్కన చూసుకుంటే 2022 వరకు నయన్ పెళ్ళి జరిగే అవకాశం లేదని కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం.



























