అవంతిక, మిత్రవింద ఇవేవో సినిమా పాత్రల పేర్లులా వున్నాయి. వీళ్ళు సంపాదించడమేటని బుర్ర గోక్కుంటున్నారా.? మరీ అంతలా ఆశ్చర్యపోకండి. బాహుబలి లోని అవంతిక అంటే తమన్నా.. మగధీర లోని మిత్రవింద అంటే కాజల్ వీళ్ళిద్దరి సంపాదన కోసమే మీరిప్పుడు చదవబోతున్నారు. వీళ్ళిద్దరి కోసమే ఇంత ప్రత్యేకంగా ఎందుకు చదవాలంటే.. సినిమా కెరీర్ ఎంత గొప్పగా ఉన్నా తారలకు సినీరంగం ద్వారా వచ్చే రెమ్యునరేషనే కాకుండా వేరే వేరే సైడ్ బిజినెస్ లు ఉండటం ఈ రోజుల్లో సాధారణమైన విషయమే..

అలా చూసుకుంటే మన టాలీవుడ్ లోని హీరోలు దగ్గర్నుండి దర్శకుల వరకూ రకరకాలుగా వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం ఈ మధ్య ఓ ఫ్యాషన్ అయిపోయింది. అవకాశాలు తగ్గి సినీరంగం నుండి బయటికి వచ్చినప్పుడు ఖాళీగా ఉండకుండా ఆదాయం ఆగిపోకుండా చేసుకునే ఈ ప్రయత్నాలు కొన్ని సార్లు లాభాలు తెచ్చిపెడుతుంటాయి. కొన్ని సార్లు నష్టాల పాలు చేస్తుంటాయి. గతంలో ఒక్క స్టార్ డైరెక్టర్ తాను భారీగా నిర్మించిన 2 అట్టర్ ఫ్లాప్ సినిమాలు ఇచ్చిన నష్టాల ఫలితంగా ఎంతో అపురూపంగా కట్టుకున్న థియేటర్లను కూడా అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది. శోభన్ బాబు లాంటి అగ్ర హీరోలు రియల్ ఎస్టేట్ రంగంలో చాలా తెలివిగా పెట్టుబడులు పెట్టి నలుగురికి మార్గదర్శిగా నిలిచిన సందర్భాలూ చాలానే ఉన్నాయి.

ఇక ప్రస్తుతాంశానికొస్తే.. మిల్కీ బ్యూటీ తమ్మన్నా – క్రేజీ స్వీటీ కాజల్ కూడా ఇదే తరహాలో ఆలోచించి ఎవర్ గ్రీన్ గోల్డ్ బిజినెస్ ను గతంలోనే స్టార్ట్ చేసేశారు. మూడేళ్ళ క్రితం తమన్నా 2015లో విటెన్ గోల్డ్ పేరుతో ఈ కామర్స్ లో పెట్టుబడులు పెట్టింది. కాని అది ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు సరికదా.. నష్టాలు కూడా తేవడంతో 6 నెలల నుంచి తమన్నాకు ఆ నష్టాన్ని పూడ్చడం శిరో భారంగా మారిందట. ఇక విధి లేని పరిస్థితుల్లో దాన్ని మూసేసే నిర్ణయం తీసుకున్నట్టు తాజా సమాచారం. ఇక కాజల్ సైతం తన చెల్లెలు నిషా అగర్వాల్ తో కలిసి తమన్నా మొదలుపెట్టినట్టుగానే జ్యువెలరీ పేరుతో రిటైల్ బిజినెస్ స్టార్ట్ మొదలు పెట్టింది. దాని పరిస్థితి కూడా కొంతకాలంగా అటుఇటుగా ఉందని సమాచారం. నిజానికి వీళ్ళిద్దరు ఇంత సీరియస్ గా గోల్డ్ బిజినెస్ లో ఉన్నట్టు చాలా మందికి తెలియదు. కారణం ఏమిటంటే.. వాళ్ళ బ్రాండ్ ను వాళ్ళే సరిగా ప్రమోట్ చేసుకోలేకపోవడం. దానికి తోడు స్థిమితంగా ఉండలేని గోల్డ్ బిజినెస్ అంటే చాలా శ్రద్ధ పెట్టాలి. సినిమాయే ప్రపంచంగా ఉండే సినీ తారలకు అది అంత ఈజీ కాదు. అందుకే తమకు రాని విద్యలో కాజల్-తమన్నా చేతులు కాల్చుకున్నట్టు అర్ధమైంది.

అనుభవాన్ని మించిన గురువు లేరన్న సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకున్న మిత్రవింద, అవంతికలు ఇప్పుడు తన ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించే పనిలో పడి కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తమ లైఫ్ స్టైల్ నే మార్చేశారు. ఈ రోజుల్లో కాస్త గుర్తింపు వస్తే చాలు సినిమా హీరోయిన్‌లు షాప్ ఓపెనింగ్‌లు అంటూ.. లైవ్ పర్ఫార్మెన్స్ లు అంటూ సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కాజల్, తమన్నాకు మంచి ఫాలోయింగ్ ఉంది. వాళ్ళు ఒక్క ట్వీట్ వేస్తే.. ఒక్క ఇన్‌స్టా పోస్ట్ పెడితే చాలు లక్షల్లో లైకులు.. వేలల్లో వ్యూస్ వస్తుంటాయి. అయితే అప్పుడప్పుడూ కొన్ని బ్రాండింగ్ ప్రమోషన్స్ కూడా చేస్తుంటారు ఈ టాలీవుడ్ ముద్దుగుమ్మలు.

కానీ గతంలో గోల్డ్ బిజినెస్ లో వచ్చిన నష్టాలను పూడ్చేందుకుగానూ వీళ్ళిద్దరూ టైమ్ పాస్ గా కాకుండా బ్రాండ్ ప్రమోషన్స్ కి కూడా సపరేట్ రేట్ ఉంటుందని తాజా సమాచారం. ముఖ్యంగా హీరోయిన్‌లకు ఉన్న క్రేజ్ వాడుకోడానికి వాళ్ల సోషల్ మీడియా అకౌంట్స్‌లో తమ బ్రాండ్స్‌కు ప్రమోషన్ చేయించుకుంటున్నాయి కార్పోరేట్ కంపెనీలు. అలా ఒక్కో ట్వీట్ చేయడానికి కూడా లక్షల్లో వసూలు చేస్తుంటారు తమన్నా, కాజల్. వీళ్లిద్దరూ తమ క్రేజ్‌ను ఇలా వాడుకుంటూ లక్షలు సంపాదించుకుంటున్నారని.. ఎలాగో కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పుడు అవకాశాలు రావడం లేదు కాబట్టి తమ క్రేజ్‌ను పెట్టుబడిగా పెట్టి సంపాదిస్తున్నారని ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. మేధాశక్తి వున్నవాళ్ళు ఎడారిలో ఇసుకను సైతం అమ్మి బ్రతికేస్తారనడానికి నిదర్శనం ఇదేనేమో.!



























