బి.విఠలాచార్య జనవరి 20, 1920 లో జన్మించి మే 28, 1999 న తనువు చాలించారు. ‘జానపద బ్రహ్మ’ అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత ఆయన. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో 70 చిత్రాలను రూపొందించిన ఈయన కర్ణాటకలోని ఉడిపిలో జన్మించారు. ఈయన సినిమాలు చేయక ముందు కొంతకాలం సర్కస్ కంపెనీలో జంతువుల ఆలనా పాలనా చూశారు. అలాగే ఉడిపి లో టూరింగ్ టాకీస్ కూడా నడిపారు. అయితే అందులో వేసే సినిమాల ప్రభావంతో ఆయన సినిమాలు తీయాలన్న బలమైన కోరికతో సినిమాలలోకి వచ్చారు. ఆయన చదువు కుంది కూడా కేవలం మూడో తరగతి మాత్రమే.

ఈయనకు కాస్త మూడ నమ్మకాలూ, జోత్యిషయం పై నమ్మకం ఉండడంతో ఆయనకు ఎవరో చెప్పైనట్టు తన మాతృ బాష అయిన కన్నడ లో సినిమా తీస్తే పేరు రాదని చెప్పి, మీరు పర భాషలో సినిమాలు తీస్తే పెద్దగా విజయం సాధిస్తారు అనడంతో వారు తెలుగు వైపు మొగ్గు చూపారు. దీనితో ఆయన తెలుగులో మొదటగా కన్యాదానం అనే సినిమా తీశారు. ఆయన ఎన్నో జానపద చిత్రాలకు అద్భుతమైన దర్శకత్వం వహించారు. అప్పటి పరిమితమైన సాంకేతిక పరిజ్ఙానముతో ఆయన చూపించిన ప్రతిభ అసామాన్యమైనది. చాలా కొద్ది ఖర్చుతో ఆయన కనులకింపైన జానపద కళా ఖండాలను రూపొందించారు.

1942 లో చిత్రరంగ ప్రవేశము చేసిన ఈయన నిర్మాతగా డి.శంకర్ సింగ్ తో కలిసి దాదాపు 18 చిత్రాలను తమ మహాత్మా పిక్చర్స్ ద్వారా నిర్మించారు. వీటిలో నిజానికి సాంఘిక చిత్రాలే అధికము. ఆ తరువాత తొలిసారిగా తెలుగులో 1953లో షావుకారు జానకి ప్రధాన పాత్ర పోషించిన “కన్యాదానం” చిత్రానికి దర్శకత్వము వహించారు. క్రమంగా తెలుగులో నిర్మాతగా, దర్శకునిగా కూడా రాణించి అనేక జానపద చిత్రాలను తీశాడు. ఈయన దర్శకత్వము వహించిన చిత్రాలలో 15 చిత్రాలు నందమూరి తారక రామారావు నటించినవే అందులో 5 చిత్రాలను విఠలాచార్యే స్వయంగా నిర్మించడం విశేషం. నిజానికి ఎన్.టి.రామారావు, కాంతారావు లకు ‘మాస్ ఫాలోయింగ్’ తెచ్చింది విఠలాచార్య చిత్రాలే. ఈ సినిమాలలో నటీనటులే కాకుండా, పక్షులూ, జంతువులూ కూడా పాత్రధారులు పోషిస్తాయి. ‘ట్రిక్ వర్క్’కి ఆయన చిత్రాలు ప్రాధాన్యం కల్పించేవి. ‘లాజిక్’ అక్కర్లేదు, ‘అదెందుకు జరిగింది?’ అని అడగడానికి లేదు. ‘ఏమీ అక్కర్లేదు. ప్రేక్షకుల్ని ఆహ్లాదపరచడమే ముఖ్యం. ఇది ‘కమర్షియల్ ఆర్ట్’ అనబడే సినిమా. మన ప్రేక్షకులు క్లాస్ సినిమాలు చూడరు. మాస్ చిత్రాలు అనబడేవాడినే ఎక్కువగా చూస్తారు. అందుకే అవే ఎక్కువగా తీశాను. ‘తక్కువ ఖర్చు పెట్టి, ఎక్కువ లాభం పొందాలి’ అన్న సూత్రం కూడా నమ్ముకున్నాను’ అని విఠాలాచార్య చెప్పేవారు.

ఇక అల్లాగే సినిమా నిర్మాణంలో ‘పొదుపు’ ఎలా చెయ్యాలి ..? అన్న దారి చూపించిన వ్యక్తి కూడా ఆయనే. ఒకే పెద్ద మందిరం సెట్టు వేస్తే, దాన్నే రకరకాల సెట్లుగా మార్చేవారు ఆయన. ఒక సినిమాలో అంత:పురం, రాజుగారి రహస్యమందిరం, ఇంకొక రాజుగారి ఇల్లూ ఇలా అన్నీ ఒకే ఒక సెట్లో ఇమిడిపోయేవి. సామాన్య జనానికీ, సినిమా చూట్టంలో లీనమైపోయే ప్రేక్షకులకీ ఈ తేడాలు అక్కర్లేదని విఠలాచార్య నమ్మేవారు. అలాగే కాస్ట్యూమ్స్, ఆభరణాలూ, ప్రతి సినిమాకీ మార్చవలసిన అసలుకే లేదు ఒక్క ముఖ్యపాత్రకి తప్ప. ‘నటీనటుల కాల్ షీట్లు గల్లంతైతే, వాళ్లని చిలకలుగానో, కోతులుగానో మార్చడం ఆయనకే చెల్లుతుందని ఒక సందర్భంలో కాంతారావు తెలిపారు.

స్క్రిప్టు ముందు పూర్తిగా రాయించుకుని, షెడ్యూల్స్ వేసుకుని టైముకి ముందుగానే షూటింగ్ పూర్తిచేసి, అనుకున్న తేదీకి సినిమా విడుదల చెయ్యడం ఆయనకే చెల్లింది. సినిమా ఆరంభించకముందే విడుదల తేదీ ఇవ్వడం ఎంతమందికి సాధ్యం …? సినిమా పరిశ్రమలో ఇదికూడా అరుదే ..! ఇలాంటి అరుదైన వాటిని అమలుపరిచిన విఠలాచార్య జానపద చిత్రాలకి ఆదరణ తగ్గుతోందన్న ఆలోచనలో అక్కినేని నాగేశ్వరరావుతో ‘బీదల పాట్లు’ తీశారు. తన విధానానికి భిన్నంగా తీశారు. ‘చిత్రం ఉత్తమంగా వుంది’ అని అందరూ ప్రశంసించారు.

































