ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను. నాకిప్పుడు ఇల్లు, కారు కొనుక్కోవాలని ఉందంటూ.. ఆర్ నారాయణ మూర్తి నోటి వెంట..

0
347

ఆకలి బాధలు.. ఆర్తనాదలే ఆయన సినిమా కథాంశాలు. పీడితా వర్గాల ప్రజలే ఆయన సినిమాలో నటించే పాత్రలు. సినిమా అంటే కేవలం కళాత్మకం కాదు.. ఆలోచనాత్మకం అని నిరూపించిన ఏకైక మానవీయ వ్యక్తి ఆర్ నారాయణమూర్తి.

సామాన్య ప్రజలే తన సినిమాకు పెద్ద ఆస్తి. సమాజంలోని బర్నింగ్ ఇష్యూస్‌ని, సామాజిక అంశాలను సినిమా కథలుగా ఎంచుకుని, వాటిపట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ, వాళ్ళను చైతన్య పరిచే చిత్రాలను నిర్మిస్తున్న రెడ్ స్టార్, పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి ఒక దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా, సింగర్ గా, కంపోజర్ గా, డాన్సర్ గా, రాణిస్తున్నా.. తాననుకున్నది వెండితెరపై ఆవిష్కరించడమే నారాయణమూర్తి స్టైయిల్. పీపుల్ స్టార్ గా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిన ఆర్. నారాయణమూర్తి పేరు చెబితేనే విప్లవ భావాలు తన్నుకొస్తుంటాయి. ఎర్రజెండా పట్టుకుని విప్లవ భావాలను రగిలించే సినిమాల్లో నటించడమే కాకుండా ఆయన నిజ జీవితంలో కూడా అలాగే జీవించేవారంటే నమ్మశక్యంగా లేదు కదూ..! సాధారణంగా సినిమా ప్రముఖులు చూపించే హంగులు, ఆర్బాటాలకు దూరం వుండే మన ‘సింగన్న’ డబ్బుదేముంది బ్రదర్.. ఈరోజు ఉంటుంది. రేపు పోతుందని చెప్పిన ఆ ఎర్ర సూర్యుడే.. ప్రస్తుతం అదే డబ్బుని ఎందుకు కూడబెట్టుకోలేకపోయానని బాధపడే పరిస్థితికి వచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. ఈమధ్య ఓ యూట్యూబ్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. అవేమిటో మీరే చదివి తెలుసుకోండి..

ఆర్. నారాయణమూర్తి.. తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలంలోని మల్లంపేట గ్రామంలో ఒక పేదరైతు కుటుంబంలో జన్మించాడు. అమ్మ పేరు రెడ్డి చిట్టమ్మ నాన్న పేరు రెడ్డి చిన్నయ్య నాయడు. వీళ్ళది అతి సాధారణ రైతు కుటుంబం. రౌతులపూడిలో 5వ తరగతి వరకు చదివాడు. రౌతుల పూడిలో ఒక సినిమా థియేటర్ ఉండేది. బాల్యం నుండి సినిమాలపై ఆసక్తితో NTR, ANRల సినిమాలు చూసి, ఖాళీ సమయాలలో వాళ్ళని అనుకరించేవాడు. అక్కడే తన నటనా జీవితానికి పునాది పడిందని చెప్పుకున్నాడు..శంఖవరంలో ఉన్నత పాఠశాలలో చేరాడు. అక్కడే నారాయణ మూర్తికి సామాజిక స్పృహ కలిగింది. సామాన్య ప్రజలకు జరిగే అన్యాయాలను గమనించి, విప్లవ ఉద్యమాలవైపు ఆకర్షితుడయ్యాడు.

పెద్దాపురం శ్రీ రాజ వత్సవాయి బుచ్చి సీతయ్యమ్మ జగపతి బహద్దర్ మహారాణి కళాశాలలో బి.ఏ చదవడానికి చేరాడు. అక్కడ రాజకీయాలతో ప్రభావితుడై, సినిమాలు, రాజకీయాలు, సామాజిక బాధ్యత 3 వ్యాసంగాలపై ఇష్టాన్ని ఏర్పరచుకున్నాడు. కళాశాలలో విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగానే కాకుండా కళాశాల లలిత కళల విభాగానికి కార్యదర్శిగా కూడా ఉన్నాడు. అంతేకాక తను ఉంటున్న ప్రభుత్వ హాస్టలు యొక్క విద్యార్థి అధ్యక్షునిగానూ, పేద విద్యార్థుల నిధి సంఘానికి కార్యదర్శి గానూ పని చేశాడు. స్థానిక రిక్షా కార్మికులు ఈయనను మద్దతు కోసం సంప్రదించేవారు. నారాయణమూర్తి పట్టణ రిక్షా సంఘం అధ్యక్షుడుగా కూడా ఉన్నాడు. ఎమర్జెన్సీ కాలంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నందువలన పోలీసులు ఈయన్ను తీసుకునివెళ్ళి ఇంటరాగేట్ కూడా చేశారు. అంతేకాక నారాయణమూర్తి సినిమా నటి మంజులతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేయించి నూతన కళాశాల నిర్మాణానికి నిధుల సేకరణ ప్రారంభించాడు. అప్పట్లో బీహార్లో వరద సహాయానికి తగిన విధంగా తోడ్పాడ్డాడు. సహవిద్యార్థులు నారాయణమూర్తిని కాలేజీ అన్నగా వ్యవహరించేవారు.

నారాయణమూర్తి సినిమాల్లో హీరో కావాలనే జీవితాశయం ఉండేది. సినిమా పిచ్చి తోటి 1972 లోనే ఇంటర్మీడియట్ పరీక్షలవ్వగానే ఎలాగైనా పరీక్షలో తప్పేది భాయం అనుకుని మద్రాసు వెళ్ళిపోయాడు. అప్పటికి ఇతడికి 17-18 ఏళ్ళ వయసు. మహానగరంలో ఎవరూ తెలీదు. మనసులో ఉందల్లా సినిమాల్లో వేషాలు వెయ్యాలని అంతే.. పక్కా సినిమా కష్టలు మొదలయ్యాయి.తిండి లేదు.వసతి లేదు. ఐనా ఏదో మూల ఆశ. ఆ తర్వాత దాసరి గారి పరిచయం వలన ‘నేరము-శిక్ష’ లో చిన్నపాత్రలో నటించే ఛాన్స్ వచ్చింది. అలా కష్టాలు పడుతూనే రోజూ స్టూడియోల చుటూ తిరిగితే ఒకటి అరా జూనియర్ ఆర్టిస్టు అవకాశాలు దొరికాయి.పొలాల్లో పనిచేసేవాళ్ళల్లో ఒకడిగా, కాలేజీ సూడెంట్స్ లో ఒకడిగా, ఊరేగింపులో వెనకాలా..ఇలా అన్నీ గుంపులో గోవిందా వేషాలే. అవి కూడా షూటింగ్ రోజు మాత్రమే తిండి పెట్టగలిగేవి. ఆ రోజుల్లోనే దాసరి నారాయణరావు గారి పరిచయం ఇతడి బ్రతుకుని ఒక మలుపు తిప్పింది. ఆ మహానుభావుడు ఇతడిలోని కళాతృష్ణని ఎలా కనిపెట్టగలిగారో కానీ ఆయన తీస్తున్న ‘నీడ’ చిత్రంలో ఇతడికి ప్రాధాన్యత – ఉన్న వేషాన్నిచ్చారు. ఆ సినిమాలో నారాయణమూర్తి కొంత ప్రాధాన్యత ఉన్న నక్సలైటు పాత్ర లభించింది. సినిమా బాగా విజయవంతమై, నారాయణమూర్తి మద్రాసులోని చోళ హోటల్లో కరుణానిధి చేతులపై వంద రోజుల షీల్డు అందుకున్నాడు.

ఆ తరువాత దాసరి, రామానాయుడు, జ్యోతి శేఖరబాబు వంటి దర్శకుల ప్రోత్సాహంతో అనేక సినిమాలలో సహాయపాత్రలలో నటించాడు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో నారాయణమూర్తి పూర్తిస్థాయి హీరోగా ‘సంగీత’ అనే సినిమా తీశాడు. ఆ సమయంలోనే హీరో అవ్వాలంటే మొదట దర్శకునిగా నిలదొక్కుకోవాలని అనుకున్నాడు. ఆ తర్వాత అర్థరాత్రి స్వాతంత్య్రం, భూ పోరాటం, ఎర్ర సైన్యం, చీమలదండు, దళం, ఒరేయ్ రిక్షా, ఎర్ర సముద్రం, పీపుల్స్ వార్ లాంటి దాదాపు 35పైగా సినిమాల్లో నటించిన ఆర్.నారాయణ మూర్తి చివరిగా ఆయన అన్నదాత సుఖీభవ అనే చిత్రంలో నటించారు. అయితే ఈమధ్యకాలంలో ఆర్. నారాయణ మూర్తి సినిమాలు సరిగా సక్సెస్ కాకపోవడంతో ఆయన టాలీవుడ్ కు దూరంగా ఉంటున్నారు.స్టార్ డైరెక్టర్స్ కూడా ఆయనకు భారీ రెమ్యునరేషన్ ఇస్తామని ఆయన కోసం కొన్ని పాత్రలు రాసుకుని ముందుకు వచ్చినా.. ధనార్జన నా ధ్యేయం కాదు. కమర్షియల్ చిత్రాలలో నేను నటించనంటూ వచ్చిన ఆఫర్లను సున్నితంగా తిరస్కరించారు. కానీ ప్రస్తుతం ఎప్పుడూ డబ్బు ప్రసక్తి తీసుకురాని ఆర్. నారాయణ మూర్తి నోటి వెంట డబ్బు జీవితానికి అవసరమే అనే మాటలు వినబడుతున్నాయి.

ఇప్పటివరకూ తాను తీసిన సినిమాలకు కోట్లు వచ్చాయి. కాని వాటినెప్పుడూ కూడబెట్టుకోలేదు. ఇళ్లు కొనుక్కోలేదు. కార్లు కొనుక్కోలేదు. కొందరు సినిమా ప్రముఖులు ఆర్. నారాయణ మూర్తి వ్యక్తిత్వం తెలిసి చిత్రపురి కాలనీ, లోటర్ పాంట్ దగ్గర ఆయన కోసం స్థలాలు కేటాయించారు. వాటిని తను స్వీకరించలేదు. ఎందుకంటే అతని మైండ్ సెట్ అది కాదు.. ఎన్ని సినిమాలు తీసినా.. అతనింట్లో కనీసం బీరువా కూడా ఉండదు. ఇప్పటికీ ఆ ఇంట్లో చాప, దిండు తప్ప మరేమీ వుండవు. డబ్బు సంపాదించినప్పుడు దాచుకోకుండా చేయడం వల్లే తనిప్పుడు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవల్సి వస్తుందని, తనకిప్పుడు ఇల్లు, కారు కొనుక్కోవాలని ఉందంటూ ఆసక్తికమైన కామెంట్స్ చేశారు R. నారాయణ మూర్తి. ఇంకా ఈ ఇంటర్వ్యూను కొనసాగిస్తూ.. “ఇప్పుడు నా వయసు 66. మహా కష్టపడితే ఇంకో నాలుగేళ్లు కష్టపడతా. ఈ 4,5 ఏళ్లలో కనీసం 4 సినిమాలు తీసినా.. ఓ చిన్న ఇళ్లు కట్టుకోలను. ఓ కారు కొనుక్కోగలననిపిస్తుంది. బతకడానికి డబ్బు అవసరమే. దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దలు చెప్పినట్టుగా కష్టపడుతున్నప్పుడే కొంత ఖర్చు పెట్టుకుని కొంత దాచుకోవాలి. తినడానికి తిండి, ఉండటానికి ఇళ్లు, బతకడానికి కాస్త డబ్బు ఉండాలని ఈరోజు నేను నా అనుభవం ద్వారా తెలుసుకుని ఫీలవుతున్నాను’ అంటూ ఇంటర్వ్యూను ముగించారు R. నారాయణ మూర్తి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here