తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణమైన నటనతో రాయలసీమ మాండలికాలితో తనదైన శైలిలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు జయప్రకాష్ రెడ్డి. ఆయన మరణ వార్తతో సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. సినీ ఇండస్ట్రీలో పెద్దలు, ప్రముఖులు, నటీనటులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీ సైతం ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జయప్రకాష్ రెడ్డి మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటనే చెప్పాలి. జయప్రకాష్ రెడ్డి విలక్షణతకు పెట్టింది పేరు. ఆయన విలనీలో ఒక మ్యాజిక్ ఉంది. కాలానికి తగినట్లుగా తనను తాను మౌల్డ్ చేసుకుని వెండితెరను ఏలాడాయన. అందుకే ఆయన సామాజిక మాధ్యమాల్లో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యారు.

అంతే కాదు, జబర్దస్త్ స్కిట్స్ చేసే వారికి కూడా ఆయన మ్యానరిజాలే పాఠాలు అవుతున్నాయి. జయప్రకాష్ రెడ్డి పేరుకు విలన్, కానీ నిజ జీవితంతో ఆయన హీరో. నిరాడంబరత ఆయనకు ఉన్న అపురూప ఆభరణం. ఆయన మంచితనమే తరగని ధనంగా మాచుకున్నారు. ఆయన సినీ నటుడిని అని ఎక్కడా గర్వం చూపించేవారు కాదు, అంతేనా ఆయన రైళ్ళల్లో ఎపుడు రెండవ తరగతిలోనే ప్రయాణించేవారు. రైలు కోసం వేచి చూస్తూ సాధారన ప్రయాణికుడిగా ఫ్లాట్ ఫారం పై వేచి ఉండే జేపీని చూసి అంతా ముచ్చట పడేవారట. ఇక ఆయనకు నాటకాల పిచ్చి. తాను ఎంత డబ్బు అయినా పెట్టి నాటకాలు నిర్వహించడానికి రెడీ. గుంటూరు అంటే ఆయనకు ఎంతో ప్రేమ. అక్కడ ఆయన నాటకాలు ప్రతీ నెలకు ఒకటి వంతున నిర్వహించేవారు. ఇక ఎక్కడైనా నాటకాల పోటీలు ఉంటే చాలు జేపీ అక్కడకు వెళ్ళేవారు, సాధారణ ప్రేక్షకుడిగా కూర్చుని నాటకం చూడడం ఆయనకు ఇష్టం. తెలుగు భాషలోని సొగసు, యాసలు, ఆయనకు చాలా ఇష్టం. మాండలీకాలు పట్టుకుని ఆయా పాత్రల పోషణ ద్వారా వాటిని ప్రాణం పోయడంలో జేపీ దిట్ట.

సినీ రంగంలో అందరిదీ ఒక్కటే మాట. జేపీ లాంటి వారు లేరని, ఆయనకు డబ్బు కంటే కూడా నటన మీదనే ప్రేమ. మనుషుల మీదనే ప్రేమ. ఇలా తనకు తాను ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు కనుకనే ఆయన లేరు అన్న మాట విన్న చలన చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతికి గురి అయింది. భాషాభిమానులు తల్లడిల్లిపోయారు. ఏమైనా జేపీ హీరో. ఆయన గ్రేట్ అంటున్నారు అంతా. అయితే ఈ సీనియర్ నటుడికి అకస్మాత్తుగా మృతి చెందడానికి అసలు కారణం తీవ్ర ఒత్తిడికి లోనవ్వడమేనని తెలుస్తోంది.నెగిటివ్ రోల్స్ తో ఒక ట్రెండ్ సెట్ చేసిన జయప్రకాష్ రెడ్డి కమెడియన్ గా కూడా అభిమానుల్లో ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. ఎలాంటి పాత్రలనైనా సరే తనదైన శైలిలో చేసి మెప్పించే సత్తా ఉన్న జయప్రకాష్ స్టేజ్ ఆర్టిస్ట్ గా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. నాటకాలు అంటే ఆయనకు అమితమైన ఆసక్తి.

ఇండస్ట్రీలో తోటి నటీనటులతో ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవారు. ఎవరు తనని పలకిరించినా సొంత మనిషిలా ఆప్యాయంగా పలకిరించేవారు. అలాంటి జయప్రకాష్ కి ఒత్తిడికి లోనవ్వడం ఏంటి అని అందరూ అనుకున్నారు. అయితే జయప్రకాష్ కి కొన్ని నెలల క్రితమే హార్ట్ లో స్టంట్ వేశారు. అనంతరం ఆయన మెల్లగా కోలుకున్నారు. హార్ట్ పేషేంట్ కావడంతో వీలైనంత వరకు ఒత్తిడికి గురి కాకుండా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అయితే ఇటీవల జయప్రకాష్ కుటుంబంలో కరోనా మహమ్మారి ఒక్కసారిగా విజృబించినట్లు తెలుస్తోంది. కరోనా వల్ల ఒత్తిడి.. జేపీ భార్యతో పాటు కుమారుడు కూతురు కోడలు అలాగే వారి పిల్లలు కూడా కరోనా వైరస్ భారిన పడినట్లు తెలుస్తోంది. అయితే జయప్రకాష్ కి మాత్రం నెగిటివ్ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులంతా కరోనా భారిన పడటంతో జయప్రకాష్ మానసికంగా ఆవేదనకు గురయ్యారని తెలుస్తోంది. ఆ ఒత్తిడి వలనే జయప్రకాష్ కి గుండెపోటు వచ్చిందని తెలుస్తోంది.



























