సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి ఈరోజు ఉదయం పరమపదించారు. గుండెపోటుతో ఆయన ఇంట్లోని బాత్ రూమ్ లో కుప్పకూలినట్టు ఫామిలీ మెంబెర్స్ చెబుతున్నారు. అయితే కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్ లు నిర్ధారించారు.

కరోనా కారణంగా సినీమా షూటింగ్‌లపై ప్రభుత్వం నిషేధించడంతో లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి ఆయన తన సొంత ఊరు గుంటూరులోనే నివాసం ఉంటున్నారు. స్వతహాగా గుంటూరు వ్యక్తి అయిన ఆయన రాయలసీమ యాసలోనే బాగా ఫేమస్ అయ్యాడు. సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన ఆయన నాటక రంగం ద్వారా సినిమాల్లోకి ప్రవేశించారు. జయప్రకాశ్ రెడ్డి 1946 మే 8 న కర్నూలు జిల్లా, ఆళ్ళగడ్డ మండలంలోని శిరువెళ్ళ గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. అయితే ఆయన గుంటూరులో సెటిల్ అయ్యారు. సినిమాల్లోకి రాకముందు ఎస్సైగా పనిచేసిన జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మపుత్రుడు చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

నాటకాల్లోనూ బాగా రాణించిన ఆయన ప్రేమించుకుందాం రా, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, జయం మనదేరా, విజయరామరాజు, చెన్నకేశవ రెడ్డి, పలనాటి బ్రహ్మనాయుడు, నిజం, సీతయ్య, ఛత్రపతి, బిందాస్, గబ్బర్‌సింగ్, నాయక్, బాద్షా, రేసుగుర్రం, మనం, రెడీ, పటాస్, టెంపర్, సరైనోడు, ఖైదీ నంబర్ 150, జై సింహా, రాజా ది గ్రేట్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనదైన నటనతో ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నారు. జయప్రకాశ్ రెడ్డి చివరిసారిగా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరులో కనిపించారు. కమెడియన్‌గా, విలన్‌గా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు జయప్రకాష్ రెడ్డి. ముఖ్యంగా ఆయన రాయలసీమ మాండలీకానికి ఎన్నో ప్రశంసలు వచ్చాయి.



























