1992లో విడుదలైన ‘రోజా’ చిత్రం గుర్తుందా.? ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన మధుబాల ఇప్పటికీ తాను హీరోయిన్ నే అంటోంది. ఈ చిత్రంతోనే దక్షిణాది స్క్రీన్ పై మధుబాల తళుక్కున మెరిసింది. అప్పట్లో ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో అందాల భామ మధుబాలకు ఊహించని విధంగా క్రేజ్ వచ్చింది. 1991లో ‘అళగన్‌’ చిత్రంతో హీరోయిన్‌ గా పరిచయమైన మధుబాల తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపును సంపాదించుకుంది. అయితే కెరీర్ ప్రారంభంలో ఆమె సినీ రంగంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నట్లుగా ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో మధుబాల తెలియ జేయడం విశేషం.

”సినిమా రంగంలోకి నేను అడుగు పెట్టిన క్రొత్తలో ఓ సినిమాలో హీరోయిన్‌ గా ఛాన్స్ వచ్చింది. 4 రోజులు షూటింగ్ కు కూడా వెళ్ళాను. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఆ చిత్రం నుండి నన్ను తొలగించేశారు. ఆ సినిమా నుంచి నన్ను ఎందుకు తీసేశారన్న సంగతి కూడా ఆ చిత్ర దర్శక, నిర్మాతలు చెప్పలేదు. అదే నాకు పెద్ద బాధ అనిపించింది. ఊహించని ఆ సంఘటనకు నేను చాలా ఫీలయ్యాను. ఓ 4 రోజులు రాత్రుళ్ళు నా బెడ్‌ రూమ్‌లో ఒక్కదాన్నే బాధపడేదాన్ని. నా స్థానంలో వేరే హీరోయిన్‌ ని తీసుకున్నారన్న విషయాన్ని ఆ తర్వాత పేపర్ లో చదివి తెలుసుకున్నాను. అయినా అలా జరగడం ఒకందుకు మంచే జరిగింది. ఆ సంఘటన తర్వాత నేను చాలా కష్టపడ్డాను. ఇప్పుడు ఓ మంచి హీరోయిన్ గా మీ ముందున్నాను” అంటూ మధుబాల తెలియజేసింది.

ఆ సంఘటన తర్వాత ‘రోజా’ చిత్రంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన మధుబాలకు వరుసగా సినిమా ఆఫర్స్ వచ్చాయి. టాలీవుడ్ హీరో Dr. రాజశేఖర్ సరసన ‘అల్లరి ప్రియుడు’ ఆ తర్వాత శంకర్ డైరెక్షన్ లో ‘జెంటిల్ మెన్’ ఈ 2 చిత్రాలు మధుబాలను టాప్ రేంజ్ కి తీసుకువెళ్ళాయి. తెలుగులో పుట్టినిల్లా మెట్టినిల్లా, చిలక్కొట్టుడు, గణేష్ వంటి చిత్రాలలో అప్పుడప్పుడూ తళుక్కుమని మెరిసిన ఈ అందాల భామ టాలీవుడ్ కన్నా బాలీవుడ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. బాలీవుడ్ డ్రీమ్ గాళ్ హేమామాలినికి స్వయానా మేనకోడలైన మధుబాల, జూహిచావ్లాకు వదిన అవుతుంది.

అయితే మధుబాల పూర్తి పేరు మధుబాల రఘునాధన్. ఈమెది తమిళ కుటుంబమైనప్పటికీ ముంబైలోనే స్థిరపడింది. అందుకే హిందీ, ఇంగ్లీషు, మలయాళ భాషల్లో అనర్గళంగా మాట్లాడగల నేర్పు మధుబాలకు వచ్చింది. బాలీవుడ్ లో ఆమె నటించిన ‘ఫూల్ ఔర్ కాంటే’ చిత్రం ఇప్పటికే ఎవర్ గ్రీన్ హిట్ చిత్రంగా చెప్పుకుంటారు. బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో అదరగొట్టినప్పటికీ, దక్షిణాది భాషా చిత్రాల కారణంగానే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న మధుబాల 1999లో ఆనంద్ చావ్లాను పెళ్ళి చేసుకుని లైఫ్ లో సెటిలై పోయింది. మధుబాలకు ఇద్దరు కూతుళ్లున్నారు. 2008లో నటనపై మక్కువతో రీ ఎంట్రీ ఇచ్చిన మధుబాల టీవీ మరియు సినిమా రంగాలలో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. కుటుంబంతో హాయిగా జీవనం కొనసాగిస్తూ, రెండో ఇన్నింగ్స్ ను కూడా సక్సెస్ ఫుల్ గా రాణిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here