తెలుగు తెరపై ‘నాలుగు స్తంభాలాట’ చిత్రంలో ‘చినుకులా రాలి’ అంటూ ప్రణయ గీతంలో ఆడి
పాడిన హోమ్లీగాళ్ పూర్ణిమ గుర్తుందా.? ఈమె లంగా ఓణి వేసుకుని గలగలా మాట్లాడుతుంటే, ముద్దుకే ముద్దొచ్చే మందారంలా కనిపించేది.

ఎక్స్ పోజింగ్ కి మోడరన్ డ్రెస్సులలో నటించనని ఖచ్చితంగా చెప్పిన పూర్ణిమ అచ్చమైన తెలుగింటి అమ్మాయిగా పక్కింటి అమ్మాయిలా టాలీవుడ్ చిత్రాలలో కనిపించేది. 1980లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ముద్దమందారం, ‘నాలుగు స్తంభాలాట, శ్రీవారికి ప్రేమలేఖ, అలాగే కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ‘మా పల్లెలో గోపాలుడు’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. సీనియర్ నటి పూర్ణిమ స్వంత ఊరు మచిలీ పట్నం. ఆమె తండ్రికి తన కూతురు
సినిమాల్లో నటించడం ఇష్టం లేదట. కానీ సినిమాలపై.. నటనపై పూర్ణిమ తల్లిగారు బలవంతం చేయడంతో మీద ఒప్పుకోక తప్పలేదట. ఆరేళ్ళ వయస్సులోనే మహానటి సావిత్రి చివరి చిత్రమైన ‘సత్యహరిశ్చంద్ర’ లో సావిత్రితో కలిసి నటించింది పూర్ణిమ.

ఇప్పటివరకూ 100 చిత్రాలకు పైనే నటించానని ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో తెలియ జేసింది పూర్ణిమ. వాస్తవానికి 13 ఏళ్ల వయస్సులోనే హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మెగాస్టార్ చిరంజీవితో కలసి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, దొంగ చిత్రాల్లో నటించిన పూర్ణిమ ఆ తర్వాత కొంటె కోడళ్ళు, కృష్ణ గారడీ వంటి చిత్రాల్లో నటించింది. అప్పట్లో నరేష్ ప్రదీప్, రాజేష్, సుమన్, అర్జున్ వంటి హీరోలతో నటించి బ్లాక్ బస్టర్స్ హిట్ లను అందుకుంది పూర్ణిమ.

అప్పటి స్టార్ హీరోలైన కృష్ణ, శోభన్ బాబు వంటి స్టార్స్ సరసన జోడీ కుదరకపోవడంతో వాళ్ళు నటించే చిత్రాలలో చెల్లెలి పాత్రలలో నటించి ప్రేక్షకులందరినీ మెప్పించింది. ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా మలయాళంలో కూడా సుధ పేరుతో నటించిన పూర్ణిమ కొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించింది. చిన్న వయస్సులోనే సినిమా రంగంలోకి రావడం వలన చాలామంది పూర్ణిమను తింగరి అని, చిరంజీవి వంటి స్టార్ హీరోలు పూరి అని సరదాగా పిలిచే వారట. ఇక చిన్న వయస్సులోనే ఎమోషన్స్ పండించే బలమైన, బరువైన పాత్రలను పోషించి మెప్పించింది.

పరికిణీ , ఓణీ, చీరల్లో కనిపించే పాత్రలు ఆమెకు రావడం మరో అదృష్టమైతే కంటతడి పెట్టించే బరువైన పాత్రల్లో కూడా ఒదిగి పోవడం మరింత విశేషమని చెప్పాలి. మలయాళంలో గ్లామర్ రోల్స్ వచ్చినా
ఒప్పుకోలేదు పూర్ణిమ. సినిమా రంగంలో ఉన్నప్పుడే చెన్నైలో సెటిలైన పూర్ణిమ పెళ్లైన తర్వాత తన భర్త మెరైన్ ఇంజనీర్ కావడంతో వైజాగ్ కి మకాం మార్చేసి సెటిలై పోయింది. పూర్ణిమకి ఓ పాప, ఓ బాబు ఉన్నారు. కొడుకు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు. కూతురికి కూడా ఈమధ్యనే పెళైపోవడంతో ప్రస్తుతం సినిమాల్లో తల్లి, వదిన వంటి పాత్రలతో రాణిస్తోంది పూర్ణిమ.



























