100 కోట్లు వద్దనుకుని.. సాధారణ అసిస్టెంట్ ను పెళ్లి చేసుకున్న రాశి…!!

0
1013

బాలనటిగా తెలుగు చలన చిత్రసీమకు పరిచయమై.. ఆ తర్వాత కథానాయికగా మారి స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్న హీరోయిన్ రాశి. కథానాయికగా తన నట ప్రస్థానాన్ని ప్రారంభించిన తర్వాత అతి తక్కువ కాలంలోనే ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించడమే కాకుండా.. మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ ని కూడా సంపాదించుకోగలిగింది రాశి. మరి అంతటి స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకున్న ఆ అదృష్టవంతుడెవరు.? అనే ప్రశ్న నేటికీ చాలామందిలో ఉంది.

అయితే ఆ ప్రశ్నకు సమాధానం చెబుతూ సినీ నటి రాశి తన పెళ్లికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈమధ్యనే మీడియాతో పంచుకుంది. వివరాల్లోకి వెళ్తే.. 2003లో “ఒక పెళ్ళాం ముద్దు – రెండో పెళ్ళాం వద్దు” అనే చిత్రంలో నటిస్తుండగా.. శ్రీనివాస్ అనే అసోసియేట్ డైరెక్టర్‌తో రాశికి పరిచయమైంది. కానీ ఆ పరిచయం కాస్త వెరైటీగా జరిగింది. అదెలాగంటే..”ఒక పెళ్ళాం ముద్దు – రెండో పెళ్ళాం వద్దు” చిత్రం షూటింగ్ జరుగుతున్న టైంలో శ్రీనివాస్‌ని కొంత కాలం గమనించిన రాశి.. అతన్ని ఎలాగైనా ఏడిపించాలనుకుని.. తన లేడీ అసిస్టెంట్ తో కలిసి ఓ ప్లాన్ వేసిందట. ఆ ప్లాన్ ప్రకారం, రాశి అసిస్టెంట్ ముందు శ్రీనివాస్‌ దగ్గరకు వెళ్లి “మీ గురించి నాకు రాశి మేడమ్ ఓ మాట చెప్పారు” అని చెప్పిందట. అయితే ఆమె ఏం చెప్పిందో మాత్రం చెప్పలేదు. దాంతో శ్రీనివాస్ కంగారు పడుతూ అదేంటో చెప్పమని అడిగారట. కానీ తాను చెప్పనని.. ఆ విషయం ఏంటో రాశినే అడగమని చెప్పి ఆమె వెళ్లిపోయిందట. 

దాంతో శ్రీనివాస్ చేసేదేమీ లేక రాశి దగ్గరికి వచ్చి.. “మేడమ్.! మీరు నా గురించి ఏదో చెప్పారంట.. అదేంటి?” అని అడిగితే.. ఆమె నవ్వుతూ “ఓహ్ అదా!! నేను సాయంత్రం నీకు ఫోన్ చేసి చెప్తానులే” అని చెప్పి వెళ్లిపోయిందట. అంత గొప్ప పేరున్న స్టార్ హీరోయిన్ ఏం చెపుతుందో తెలుసుకుందామని ఎదురు చూస్తున్న శ్రీనివాస్‌ కి రాత్రి రాశి ఫోన్ చేసి.. “ఏం లేదండి! మీరు బాగా కష్టపడుతున్నారు, ఖచ్చితంగా మీరు మంచి డైరెక్టర్ అవుతారు” అని చెప్పిందట. ఆ రోజు నుండి వీళ్ళిద్దరి మధ్య రోజూ ఫోన్ సంభాషణలు మొదలయ్యాయి. సినిమా షూటింగ్ నడుస్తున్న కొద్దీ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. సినిమా షూటింగ్ పూర్తయ్యాక కూడా వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయ్యింది. అలా వాళ్ళిద్దరూ తమ వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్న తర్వాత ఒకరోజు ఉన్నట్టుండి – “మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా.?” అని శ్రీనివాస్‌ ను రాశి అడిగిందట. ఊహించని రాశి ప్రపోజల్‌కి ఏమి చెప్పాలో అర్ధంకాక శ్రీనివాస్.. తనకు కూడా మనసులో రాశి అంటే ఇష్టం ఉండడంతో.. ఆ ప్రపోజల్ షాక్ నుండి తేరుకుని “చేసుకుంటాను” అని చెప్పాడట.

మార్చి 23, 2004 తేదిన ఈ సంఘటన జరిగింది. కొన్ని రోజులకు తన పెళ్లికి సంబంధించి రాశి తీసుకున్న నిర్ణయాన్ని తన తల్లి, అన్నయ్యతో చెప్పగా.. వాళ్ళెవరూ ముందు ఒప్పుకోలేదంట. అయితే రాశి మాత్రం “నేను అతన్ని మాత్రమే పెళ్లి చేసుకుంటాను” అని ఖరాకండిగా చెప్పేయడంతో.. తప్పనిసరై కుటుంబ సభ్యులు వాళ్ళిద్దరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఆ విధంగా రాశి పెళ్లి వ్యవహారం శ్రీనివాస్ కుటుంబానికి కూడా ఒక విధమైన షాక్ వంటిదే కావడంతో.. శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు కూడా ఏం చేయాలో మొదట్లో అర్ధం కాలేదట. అయితే ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు కాబట్టి వెంటనే “పెళ్లి చేసేద్దాం” అని ఒక నిర్ణయానికి రావడంతో.. ఏప్రిల్ 23, 2004 తేదిన రాశి – శ్రీనివాస్ ల పెళ్లి జరిగిందట. ఇదండీ.. అందాల ‘రాశి’ అందమైన ప్రేమకథ. ఈ కధలో మరో ట్విస్ట్ ఏమిటంటే.. రాశి – శ్రీనివాస్ ల పెళ్లి ప్రస్తావన వచ్చిన 30 రోజుల్లోనే రాశి పెళ్లి జరిగిపోవడంతో.. ఆరోజుల్లో టాలీవుడ్ లో రాశి పెళ్ళి వార్త బాగానే సంచలనం సృష్టించింది.

ప్రస్తుతం శ్రీనివాస్, రాశి దంపతులకు ఒక పాప వుంది. ఈమధ్యనే సినీనటి రాశి మళ్ళీ టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలియ జేసింది. దాంతో రాశికి చాలా ఆఫర్స్ కూడా వచ్చినట్టుగా టాలీవుడ్ టాక్. ఏదేమైనా.. రాశి తన పెళ్లి నిర్ణయం కేవలం 30 రోజుల్లో తీసుకున్నప్పటికి కూడా.. తన 15 ఏళ్ళ సంసారం జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా.. తన భర్తతో హాయిగా ఉన్నాననే చెబుతుండటం విశేషం. ఇలాగే ఈ దంపతులిద్దరూ రాబోయే రోజుల్లో కూడా సంతోషంగా ఉండాలని కోరుకుందాం. మళ్ళీ మన అందాల రాశి టాలీవుడ్ తెరపై ప్రేక్షకులను అలరించాలని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here