టాలీవుడ్ లో అగ్రహీరోల మధ్య విభేధాలు ఈనాటివి కావా.? (ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే..)

0
702

సినీరంగం, రాజకీయ రంగం ఏ రంగంలో అయినా పోటీ సహజం. ఒక్కోసారి ఈ పోటీ కాస్త హద్దులు దాటి విభేధాలకు, కలహాలకు దారి తీయ్యొచ్చు. ఒక్కోసారి అసలు వ్యక్తుల జోక్యం లేకుండానే వాళ్ళ ఫ్యాన్స్ వల్ల కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. అగ్ర హీరోలు స్నేహ‌ పూర్వ‌కంగా ఉన్నా సినిమాల వ‌ర‌కూ వ‌చ్చేస‌రికి వారి మ‌ధ్య పోటీ మాత్రం బలంగానే ఉంటుంది.

టాలీవుడ్ అగ్ర‌హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి- నంద‌మూరి బాల‌కృష్ణ మ‌ధ్య మంచి స్నేహం ఉన్నా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కొచ్చేస‌రికి మాత్రం ఆరోగ్య‌క‌ర‌మైన పోటీ ఉండేది. చిరు-బాల‌య్య త‌ల‌ప‌డితే ఫ్యాన్స్‌కు పండగే మ‌రి! సినిమాల్లో బాల‌య్య‌- చిరు మ‌ధ్య పోటీ ఈమధ్య మరీ ఎక్కువైందన్న సంగతి తెలిసిందే.! అయితే టాలీవుడ్ లో ఈ స్టార్ వార్.. పొలిటికల్ వార్ ఇప్పటివి కావని.. NTR-ANR ల మధ్య, అలాగే NTR-కృష్ణల మధ్య కూడా వుండేదని తెలుగు సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఈమధ్యకాలంలో బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో సినిమా షూటింగ్ లు మళ్ళీ రీస్టార్ట్ చేసే విషయమై కొందరు టాలీవుడ్ సినీ ప్రముఖులు.. తెలంగాణ ప్రభుత్వంతో జరిపిన చర్చల సంగతి తనకు తెలియదని చెప్పి పెద్ద బాంబే పేల్చారు. ఆ తర్వాత ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారి చిరు, బాలయ్యల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. అయితే ఈ విభేదాలు, చిరంజీవి, బాలయ్య మధ్యనే వున్నాయనుకుంటే పొరపాటు.


ఒకప్పుడు తెలుగు చలనచిత్రసీమను ఏలిన NTR, ANRల మధ్య కూడా విభేధాలు ఉండేవని సీనియర్ సినీ జర్నలిస్టులు చెబుతున్నారు. అందుకనే ఆ రోజుల్లో వీళ్లిద్దరు మల్టీస్టారర్ సినిమాలు చేయకూడదనే నిర్ణయానికి వచ్చారు. NTR, ANRల మధ్య ఏదో అభిప్రాయ భేధం వచ్చి ఇక ఇద్దరూ జమునతో నటించకూడదనే నిర్ణయానికి వచ్చేశారు. అప్పట్లో నాగిరెడ్డి, చక్రపాణి.. NTR, ANR, జమునల మధ్య రాజీ కుదిర్చి ‘గుండమ్మకథ’ లో జమునను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఆ తర్వాత ఆ సినిమా ఎంత సూపర్ హిట్టయ్యిందో టాలీవుడ్ ప్రేక్షకులకు తెలుసు. సరిగ్గా ఇలాంటి సంఘటనే సినీరంగంలో NTR, సూపర్ స్టార్ కృష్ణల మధ్య జరిగిందని సీనియర్ జర్నలిస్టులు తెలిపారు. అదేమిటంటే.. “అల్లూరి సీతారామరాజు” సినిమా విషయంలో ఎన్టీఆర్, కృష్ణల మధ్య విభేదాలొచ్చాయి. ఆ రోజుల్లో ఇదే విషయమై టాలీవుడ్ లో పెద్ద రచ్చే జరిగింది.

ఇక పాత రోజుల్లో కృష్ణ – ANRల మధ్య వచ్చిన క్లాష్ గురించి చెప్పాలంటే.. ఆ రోజుల్లో విజయ నిర్మలతో కలిసి ANR ఆల్ టైమ్ క్లాసిక్ .. దేవదేసు’ సినిమాను సినిమా స్కోప్‌లో రీమేక్ చేసారు. సరిగ్గా అదే సమయంలో NTRకు చెందిన కొంత మంది వ్యక్తులు ..పాత దేవదాసు రైట్స్ తీసుకొని ఒక వారం ముందుగా మళ్లీ రీ రిలీజ్ చేసారు. మ్యూజికల్‌గా మంచి పాటలున్న కృష్ణ, విజయ నిర్మల దేవదాసు.. ANR దేవదాసు ముందు  బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఇక ఆ సంగతి ప్రక్కన పెట్టి మన టాలీవుడ్ అగ్రహీరోలు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ మధ్య పోటీ ఎలా వుంటుందో పరిశోధిస్తే.. NTR రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కృష్ణ కాంగ్రెస్ పార్టీలో జాయినై.. NTRను టార్గెట్ చేస్తూ.. ‘మండలాదీశుడు’, ‘గండిపేట రహస్యం’, నా పిలుపే ప్రభంజనం’ వంటి సెటైరికల్ మూవీస్ చేసి NTRతోనే తలపడ్డారు. NTR ముఖ్యమంత్రైన కొత్తలో ANRతో కలసి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అన్నపూర్ణ స్టూడియోను కట్టారనే వివాదం ఆ రోజుల్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఇక NTR, కృష్ణలు కూడా ఆ తర్వాత మళ్లీ కలిసిన సందర్భాలు చాలా వున్నాయి. NTR, ANR, కృష్ణల మధ్య ఎన్ని గొడవలున్నా వీళ్ళు కలిసి మల్టీస్టారర్ సినిమాలలో నటించిన సందర్భాలున్నాయి. ఇక గతంలో నుండి వర్తమానంలోకి వస్తే.. బాలకృష్ణ, చిరంజీవిల మధ్య ఉన్న గొడవలు కూడా అలాంటివేనని నెటిజన్ల అభిప్రాయం. టాలీవుడ్ లో  ప్రస్తుతం నెలకొని ఉన్న ఈ విభేదాలన్నీ వీలైనంత త్వరగా సమసిపోవాలని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here