చిరంజీవి నాయకత్వం ఇండ్రస్ట్రీలో కొందరికి నచ్చడం లేదా.? అసలు చిరు, బాలయ్యల మధ్య వివాదం ఎప్పుడు మొదలైంది.? ఇన్నిరోజులు ఈ కామెంట్స్ వస్తుంటే అబ్బే అలాంటిదేమీ లేదు అని టాలీవుడ్ ప్రముఖులు కవర్ చేశారు. కానీ వీళ్ళిద్దరి మధ్య వార్ ఇంకా నడుస్తూనే ఉందనడానికి సాక్ష్యం దొరికింది.

నిజంగానే చిరంజీవి నాయకత్వం పట్ల టాలీవుడ్ లో ఒక వర్గం అసంతృప్తిగా ఉన్నట్లు సోషల్ మీడియాలో గాసిప్స్ హల్ చల్ చేస్తున్నాయి. ఈమధ్యనే బాలకృష్ణ చేసిన కామెంట్స్ తో ఇది నిజమేనని తేలిపోయింది. నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి నివాళులు అర్పించాడు బాలకృష్ణ. అక్కడే ఆయన ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతున్న రాజకీయాలపై చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో సినిమా షూటింగ్స్ గురించి టాలీవుడ్ పెద్దలతో ప్రభుత్వం చర్చించిన సంగతి తనకసలు తెలియదని చెప్పడం నిజంగానే ఆశ్చర్యం కలిగిస్తుంది.

టాలీవుడ్ లో బాలకృష్ణ అగ్ర హీరో. అలాంటిది ఆయనకు తెలియకుండా ఎందుకు ఉంటుందని కొందరు సినీ ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఆ సమావేశాలు చిరంజీవి ఇంట్లోనే జరగడం, వాటన్నింట్లోనూ చిరంజీవియే ముందుండటం కొందరికి నచ్చడం లేదనే వార్తలు గుప్పుమంటూ వినబడుతున్నాయి. ఆ కారణంగానే బాలయ్య ఇలాంటి వివాదస్పదమైన కామెంట్స్ చేసాడేమోనని విశ్లేషకులు అనుకుంటున్నారు. ఈ మధ్య సినీరంగానికి సంబంధించి ఏ సమావేశం జరిగినా.. ఏ చర్చ జరిగినా చిరంజీవియే ముందుంటున్నాడు. అన్నీ తానై ముందుకు నడిపిస్తున్నాడు. లాక్ డౌన్ సమయంలో ఆగిపోయిన సినిమా షూటింగ్స్ విషయంలో కానీ.. జరగాల్సిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ విషయంలో కానీ ఇలా అన్నింట్లోనూ ముందు చిరంజీవే కనిపిస్తున్నాడు.

ముఖ్యమంత్రితో మాట్లాడటం దగ్గర్నుంచి.. మంత్రి తలసానితో తన ఇంట్లోనే సినిమా పెద్దలతో చర్చించడం వరకు అన్నింటా మెగాస్టార్ జోక్యమే ఎక్కువగా కనిపిస్తుంది. దాంతో ఈ జోక్యం కొందరు హీరోలకు నచ్చడం లేదని ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది. చిరంజీవి ఒక్కడే అడిగితే చేస్తారా.. ఇండస్ట్రీలో ఇంక పెద్దలే లేరా.. లేదంటే ఇండ్రస్ట్రీలో వున్న పెద్దల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదా అంటూ వాళ్లు సన్నిహితులతో చెప్తున్నట్లు మీడియా సమాచారం. చిరంజీవి ఏమైనా ఇండస్ట్రీకి నాయకుడా.. లేదంటే అంతా కలిసి ఆయనకు ఏదైనా అధికారం కట్టబెట్టారా.. అన్నింట్లోనూ తానే ఎందుకు అంతలాగ ముందుకు వెళ్తున్నాడు.. పేరు తెచ్చుకోవడానికా.. లేక ఇంకేమైనా ఇతర కారణలున్నాయా.?.. అంటూ కొందరు హీరోలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి.

పైకి మాత్రం చిరంజీవి చాలా మంచి పనులు చేస్తున్నాడు.. ఇండస్ట్రీ కోసం పాకులాడుతున్నాడు అంటూనే లోపల మాత్రం క్రెడిట్ అంతా తానొక్కడే కొట్టేస్తున్నాడంటూ ఆయన తీరుపై కాస్త అసహనంగా ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే వాళ్లు మీటింగ్స్ కు కానీ.. చర్చలకు కానీ రావడం లేదని ప్రచారం కూడా జరుగుతుంది. మరి ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.!



























