ఎక్కడో చైనాలో ఉన్న కరోనా జబ్బు మన ఇండియాకు రావడమేమిటి.? మనకు ఈ కష్టాలేమిటీ.? అంటూ ప్రజలంతా విలవిలలాడారు. గత 2 నెలలుగా కరోనా చుక్కలు చూపిస్తుంది. వ్యాపారాలు.. ఆఫీసులన్నీ బంద్ చేసి ఇంట్లో కూర్చునేలా చేసింది ఈ వైరస్. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీపై కూడా ఈ వైరస్ తన ప్రతాపం చూపిస్తుంది. ఇప్పటికే ఇండియాలో కరోనా మరణాలు కూడా పెరిగిపోతుండటంతో సినిమా షూటింగ్స్ 3 నెలలుగా ఆగిపోయాయి. పెద్ద సినిమాలన్నీ వాయిదా పడ్డాయి.

నాని వి సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, శర్వానంద్ శ్రీకారం, ఉప్పెన, నిశ్శబ్ధం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలే వాయిదా పడ్డాయి. దాంతో ఇంకా చాలా సినిమాల షూటింగ్స్ ఎక్కడికక్కడ ఆపేసారు. రోజురోజుకీ కరోనా కేసులు ఎక్కువ అవుతుండటంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రభావం టాలీవుడ్‌పై దారుణంగా పడుతుంది. ఇప్పటికే 1000 కోట్ల రూపాయలు నష్టపోయారని తెలుస్తుంది.

అనుకోకుండా వచ్చిన ఈ కరోనా మహమ్మారితో చిన్న నిర్మాతలు రోడ్డున పడుతున్నారు. బడా నిర్మాతలకు కూడా వడ్డీల రూపంలో కోట్ల నష్టం వస్తుంది. సినిమాలు విడుదలైన కాకపోయినా.. షూటింగ్స్ జరిగినా ఆగినా తీసుకొచ్చిన కోట్లకు వడ్డీలు అయితే కట్టాల్సిందే. కరోనా వైరస్ మూలంగా ఎప్పుడూ ఏదో ఒక ఊరికి వెళ్లొచ్చినట్లు బ్యాంకాక్, థాయ్ ల్యాండ్ లాంటి దేశాలు తిరిగేసి వచ్చే మన స్టార్స్ కూడా అంతా ఇంట్లోనే ఉన్నారు. ఇల్లు వదిలి బయటికి రావడం లేదు. పర్సనల్ టూర్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకుని అనుకోకుండా వచ్చిన సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా కరోనా వైరస్ ఇప్పుడు కనికరం లేకుండా అందరిపై దాడి చేస్తుంది. మరి దీని ముగింపు త్వరలోనే రావాలని కోరుకుందాం.



























