సినిమా రంగంలో ఎవరి జాతకం ఎప్పుడెలా వుంటుందో చెప్పడం కొంచెం కష్టమైన పనే.! టాలీవుడ్ లో వున్న విచిత్రమేమిటంటే.. ఒక్కొక్క హీరోకీ ఒక్కొక్క సమయంలో మంచి క్రేజ్ వస్తుంది. ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగి 4,5 విజయవంతమైన సినిమాలు విడుదలైన తర్వాత రెండు ఫ్లాపులొస్తే ఇక అక్కడ్నుంచి వాళ్ళ సినీ కెరీర్ గ్రాఫ్ సడెన్ గా పడిపోతుంటుంది. అలా ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ లేపేసిన హీరోలు ఇప్పుడు మాయమయ్యారు.

ముఖ్యంలో లవ్, రొమాన్స్ వంటి యువతరం చిత్రాలలో నటించి నవతరం గుండెల్లో సుస్ధిర స్ధానాన్ని సంపాదించుకున్న తరుణ్.. వేణు.. J.D. చక్రవర్తి.. వరుణ్ సందేశ్ లు ఇప్పుడెక్కడున్నారు.? ఏం చేస్తున్నారు.? ఈ ప్రశ్నలకు సంపూర్ణ సమాధానం నేటికీ తెలియదు. మారుతున్న ట్రెండ్ కు తగినట్టుగా నేటి ప్రేక్షకులు కూడా వాళ్ల గురించి పూర్తిగా మర్చిపోయారు. కానీ టాలీవుడ్ లో టాప్ లేపి కనుమరుగైన ఆ రొమాంటిక్ హీరోల వివరాలేమిటో మీరే ఒక్కసారి చదవండి…
J.D.చక్రవర్తి

1990లో J.D. చక్రవర్తి అంటేనే ఓ సంచలనం. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన “శివ” సినిమాలో విలన్ పాత్ర ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న J.D సినిమాలు విడుదలయ్యాయంటే చాలు ప్రేక్షకులు ఎగబడి చూసేవాళ్లు. గులాబీ, ప్రేమకు వేళాయెరా, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా ఇలా చాలా ప్రేమకధా చిత్రాలలో నటించాడు J.D. బాలీవుడ్ లో “సత్య” లాంటి సినిమాలతో మంచి గుర్తింపును తెచ్చుకున్న J.D ఆ తర్వాత మాత్రం అస్సలు కనిపించలేదు.
వడ్డే నవీన్

తెలుగు చలన చిత్ర రంగం 20వ శతాబ్దంలోకి అడుగుపెడుతున్న రోజుల్లో టాలీవుడ్ లో ఉన్న కుర్ర హీరోల్లో వడ్డే నవీన్ కూడా ఒకరు. ప్రముఖ సినీ నిర్మాత వడ్డే రమేష్ వారసుడిగా తెలుగుతెరపై ఎంట్రీ ఇచ్చిన నవీన్ తండ్రి పేరు వాడుకున్నా కూడా తను హీరోగా నటించిన చిత్రాలు సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకుపోయాడు నవీన్. కోరుకున్న ప్రియుడు, పెళ్లి, మనసిచ్చి చూడు వంటి చిత్రాలతో సంచలన విజయాలు అందుకున్నాడు నవీన్. కాలగమనంలో నా ఊపిరి వంటి ఫ్లాప్ సినిమాల కారణంగా వడ్డే నవీన్ పూర్తిగా తెలుగు తెరకు దూరమయ్యాడు.
వేణు తొట్టెంపూడి

“స్వయంవరం” అనే వైవిధ్యమైన కధాంశంగల చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన హీరో వేణు. మొదటి చిత్రంతోనే సంచలన విజయం అందుకున్న వేణు ఆ తర్వాత నటించిన సినిమాలు కూడా చాలా విజయవంతమయ్యాయి. కళ్యాణ రాముడు, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, పెళ్లాం ఊరెళితే లాంటి సినిమాలు వేణును క్రేజీ హీరోగా మార్చేశాయి. ఆ తర్వాత దీపావళి, మళ్ళీ మళ్ళీ చూడాలి వంటి సినిమాలు ఫ్లాపవడంతో చివరిగా బోయపాటి తెరకెక్కించిన దమ్ము చిత్రంలో ఎన్టీఆర్ బావ మరిదిగా నటించిన వేణు మళ్ళీ నటించలేదు.
తరుణ్

టాలీవుడ్‌లో లవర్ బాయ్ అనే పదానికి సరైన నిదర్శనం తరుణనే చెప్పవచ్చు. 20వ శతాబ్దం ఆరంభంలోనే నువ్వే కావాలి అంటూ సూపర్ హిట్ నందించిన కుర్ర హీరో బాలనటుడిగా ఎన్నో సంచలనాలను సృష్టించాడు. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి కూడా మంచి మంచి చిత్రాలలోనే నటించాడు. నువ్వే కావాలి, ప్రియమైన నీకు, నువ్వులేక నేనులేను, నువ్వే నువ్వే లాంటి సినిమాలతో వరుస విజయాలను అందుకున్నాడు. కానీ ఊహించని విధంగా తరుణ్ సినీ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో టాలీవుడ్ కు దూరమైపోయాడు.
వరుణ్ సందేశ్

టాలీవుడ్ కి పరిచయమైన చాలా తక్కువ టైంలోనే యువ హీరోగా మంచి గుర్తింపును సంపాదించిన వరుణ్ సందేశ్ ఎంత స్పీడ్ గా వచ్చాడో.. అంతే స్పీడ్ గా మాయమై పోయాడు. హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం వంటి యువతరం ప్రేమకధా చిత్రాలతో యూత్ ఐకాన్ అయిపోయాడు వరుణ్. కానీ ఆ తర్వాత 20 సినిమాలు చేసినా కూడా అవేమీ పెద్దగా వర్కవుట్ కాలేదు. దాంతో బిగ్ బాస్ 3కి భార్యతో సహా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి.. బిగ్ బాస్ సీజన్ ముగిసిన తర్వాత మళ్ళీ కనబడలేదు.
నవదీప్

తేజ స్కూల్ నుంచి వచ్చిన యువ హీరోలలో నవదీప్ ఒకడు. నవదీప్ నటించిన చిత్రాలన్నిటిలోనూ చందమామ, గౌతమ్ SSC లాంటి సినిమాలు ఫర్వాలేదనిపించినా నవదీప్ కి మాత్రం సరైన గుర్తింపు రాలేదనే చెప్పాలి. హీరోగా దాదాపు 15 సినిమాలకు పైగానే నటించాడు నవదీప్. ఈమధ్యనే కొన్ని వివాదస్పదమైన వార్తల్లో నిలిచిన నవదీప్ ప్రస్తుతం కారెక్టర్ ఆర్టిస్టుగా కాలం గడిపేస్తున్నాడు.
రాజ్ తరుణ్

హ్యాట్రిక్ విజయాలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యువ హీరో రాజ్ తరుణ్. ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్తా మావ, కుమారి 21F వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ కుర్ర హీరో.. ఆ తర్వాత తన జోరును కొనసాగించలేకపోయాడు. వరసగా ఫ్లాపులు ఎదురవడంతో తన కెరీర్ ను తానే చేతులారా పాడు చేసుకున్నాడు. ఇటీవలే విడుదలైన ఇద్దరి లోకం ఒకటే సినిమాకు కనీసం ఓపెనింగ్స్ రాకపోవడంతో రాజ్ తరుణ్ ప్రస్తుతం పూర్తిగా ఫేడవుట్ స్టేజీకి వచ్చేసాడు. చివరిగా వరుణ్ ఆశలన్నీ విడుదలకు సిద్ధంగా ఉన్న ఒరేయ్ బుజ్జిగా చిత్రంపైనే ఉన్నాయి.
రోహిత్

“6 టీన్స్” సినిమాతో సెన్సేషనల్ యూత్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోహిత్ ఆ తర్వాత కూడా గుడ్ బోయ్, గర్ల్ ఫ్రెండ్, నేను సీతామహాలక్ష్మీ వంటి కొన్ని సినిమాలు చేసాడు. చిరంజీవి హీరోగా నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో పేషెంట్ గా అతిధి పాత్రలో నటించిన రోహిత్ ఆ తర్వాత నేను రత్నం, అనగనగా ఓ కుర్రాడు లాంటి వరుస ఫ్లాపులతో వెనకబడిపోయాడు. ఇప్పుడు సొంతంగా బిజినెస్ చేసుకుంటూ బిజీగా ఉన్నాడు రోహిత్.
తనీష్

బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేసిన తనీష్.. రవిబాబు తెరకెక్కించిన నచ్చావులే సినిమాతో హీరోగా ఎంట్రి ఇచ్చాడు. రైడ్ సినిమాతో మరోసారి హిట్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత చాలా సినిమాలు చేసినా తనీష్‌ను ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడంతో విలన్ పాత్రలు కూడా చేయడానికి కూడా సిద్ధమయ్యాడు. అయినా కూడా తనీష్ కు కాలం కలిసిరాలేదు. ప్రస్తుతానికైతే బిగ్ బాస్ 2 తర్వాత అడపాదడపా షోలు చేసుకుంటూ కాలం గడిపేస్తున్నాడు తనీష్.
శివ బాలాజీ

“ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ” అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించిన యువ హీరో శివ బాలాజి. ఆ సినిమా తర్వాత దాదాపు 10 సినిమాలలో హీరోగా నటించిన శివ బాలాజీ విజయాలను మాత్రం అందుకోలేకపోయాడు. నవదీప్ తో కలిసి నటించిన చందమామ చిత్రం మాత్రం ఫర్వాలేనిపించింది. ఎంత ప్రయత్నించినా స్టార్ హీరోగా నిలబడలేకపోయిన శివ బాలాజీ పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చేశాడు. ఆ తర్వాత బిగ్ బాస్ తొలి సీజన్ లో విన్నర్ గా నిలబడినా కూడా శివ బాలాజీకి పెద్దగా కాలం కలిసిరాలేదనే చెప్పాలి.
అదండి సంగతి.. ఇలా ఒక్కరో ఇద్దరో కాదు ఒకప్పుడు టాలీవుడ్ లో సంచలనాలు సృష్టించిన హీరోలెందరో ఇప్పుడు తెరమరుగైపోయారన్నమాట.



























