దేశ వ్యాప్తంగా ప్రజలందరి ప్రాణాలతో చెలగాటమాడుతున్న కరోనా మహమ్మారి టాలీవుడ్ ప్రముఖులను సైతం వదలడం లేదు. తెలుగు సినిమా రంగం కరోనా కోరల్లో చిక్కుకుంటోంది. ఒకరి తర్వాత ఒకరు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళికీ, అతని కుటుంబానికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెల్సిందే. ప్రముఖ హాస్య నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్ కరోనా నుండి కోలుకున్నారు. దర్శకుడు తేజ, కమెడియన్ పృథ్వీలకు కూడా కరోనా సోకింది. అలాగే ప్రముఖ సినీ గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, స్మిత కూడా కరోనా బారిన పడిన విషయం తెల్సిందే. లేటెస్ట్ గా మరో సినీ పెద్ద ఈ కరోనా వైరస్ కోరల్లో చిక్కుకున్నారని తెలిసింది. ‘RRR’ చిత్ర నిర్మాత డి.వి.వి. దానయ్యకు కూడా కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. హోమ్ క్వారంటైన్ లోనే ఉండి ఆయన కోలుకుంటున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ NTR లు హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘R.R.R’ సినిమా తెరకెక్కుతుండగా ఇప్పుడు ఈ చిత్ర దర్శక, నిర్మాతలిద్దరూ కరోనా బారిన పడడంతో RRR సినిమా పనులు ఎక్కడివక్కడ నిలిచి పోయాయి. ప్రస్తుతానికి ఆయన క్షేమంగానే ఉన్నారు. ఈవిషయం తెలిసిన టాలీవుడ్ సినీ పెద్దలు ఆయనకి ఫోన్ లు చేసి పరామర్శిస్తున్నారు. ‘R.R.R’ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఇప్పటికే చరణ్ పుట్టిన రోజుకి ఓ టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్రం యూనిట్. ఈ టీజర్‌లో రామ్ చరణ్ యుద్ధ విద్యలు నేర్చుకుని యుద్ధానికి తయారవుతున్నట్టు కనిపించారు.

ఈ సినిమాలో బాక్సింగ్‌కి సంబంధించి కొన్ని సన్నివేశాలున్నాయి. ఈ సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చాయని అంటున్నారు యాక్షన్ కొరియోగ్రాఫర్ కుల్దీప్. ‘R.R.R’ చిత్రం వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానుంది. మరో ప్రక్క దానయ్య తన కొడుకు కళ్యాణ్ ని హీరోగా పరిచయం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక తన కొడుకు కళ్యాణ్ సరసన నటించే హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేశారట. అయితే ఈ చిత్రాన్ని తాను నిర్మించకుండా మరొకరి నిర్మాణంలో చేయాలనీ నిర్మాత దానయ్య ప్లాన్ చేస్తున్నాడట. వీలైనంత త్వరగా కరోనా బారినుండి మన టాలీవుడ్ ప్రముఖులందరూ కోలుకోవాలని కోరుకుందాం.



























