టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి, అతని జీవితంలో చోటు చేసుకున్న సంఘటన గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఎందుకంటే అతను మీడియాకి చాలా దూరంగా ఉంటూ తన జీవితాన్ని గడుపుతుంటారు. జీవితంలో కొన్ని సార్లు చోటుచేసుకునే దుర్ఘటనలు కూడా చివరికి మంచి చేస్తాయని… అవి జీవితాన్ని తారాస్థాయికి తీసుకెళ్తాయని అనడానికి విక్టరీ వెంకటేష్ జీవితమే ఒక పెద్ద ఉదాహరణ.

విక్టరీ వెంకటేష్ తన కెరీర్ తొలినాళ్లలో సినిమాలంటేనే విసుక్కునేవారు. సినిమాల్లో నటించడానికి అతను బాగా అయిష్టత చూపేవారు. ఒకానొక సమయంలో సినీ పరిశ్రమకు స్వస్తి చెప్పి అమెరికా కి వెళ్లి హాయిగా ఉద్యోగం చేసుకోవాలనుకున్నారు. కానీ అమెరికా ప్రయాణానికి సిద్ధమవుతున్న సమయంలో అతను హీరోగా నటించిన కలియుగ పాండవులు సినిమా భారీ హిట్ అయ్యింది. దీంతో తెలుగు పరిశ్రమలో అతని క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పుడే అసలైన క్రేజీ ని ఆస్వాదించిన విక్టరీ వెంకటేష్ అమెరికా వెళ్లాలన్న తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.

తదనంతరం పూర్తి డెడికేషన్ తో సినిమాల్లో హీరోగా నటించడం ప్రారంభించారు. కానీ తీసిన ప్రతి సినిమా తొలి ఆటకే డిజాస్టర్ టాక్ ని సంపాదించుకుంది. దీంతో బాగా నిరాశ పడిపోయిన వెంకటేష్ ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిపోయారు. సినిమా పరిశ్రమలో అప్పుడే అరంగేట్రం చేసిన వెంకటేష్ కి ఏ కథ హిట్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి. తన తండ్రి రామానాయుడు కూడా వెంకటేష్ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎటువంటి సూచనలు ఇచ్చేవారు కాదు. ఈ క్రమంలోనే ఒక సినిమా షూటింగ్ లో వెంకటేష్ కి ఒక ప్రమాదం జరిగింది. దీంతో గాయాలపాలైన వెంకటేష్ మంచానికే పరిమితం అయ్యారు. ఆ సమయంలో కాలక్షేపం కోసం తమిళ సినిమాలను చూడడం ప్రారంభించారు వెంకటేష్. అయితే అతనికి భాగ్యరాజు సినిమాలు బాగా నచ్చాయి. భాగ్యరాజ్ సినిమా కథలన్నీ తనకి బాగా సూట్ అవుతాయని వెంకటేష్ లో ఒక ఆలోచన వచ్చింది. ఆరోగ్యం కుదుటపడిన వెంటనే భాగ్యరాజ్ సినిమాలని వరుసగా తెలుగులో రీమేక్ చేయడం ప్రారంభించారు వెంకటేష్. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భాగ్యరాజ్ సినిమా తమిళం లో సెట్స్ పైకి వెళ్ళగానే ఆ సినిమా రీమేక్ రైట్స్ వెంకటేష్ కొనుగోలు చేసేవారు.

ఆ విధంగా భాగ్యరాజ్ ఏ సినిమా చేస్తే దాన్ని కచ్చితంగా తెలుగులో రీమేక్ చేయాలని వెంకటేష్ అనుకునేవారు. తెలుగు స్ట్రెయిట్ సినిమాలు తీసినా అవి ఫ్లాప్ అవ్వడంతో వెంటనే భాగ్యరాజ్ సినిమాలను తెలుగులో రీమేక్ చేసి హిట్స్ అందుకున్నారు వెంకటేష్. ఈ విధంగా వెంకటేష్ తన సినీ కెరీర్లో అన్నీ హిట్స్ సినిమాలే తెరకెక్కిస్తూ విక్టరీ వెంకటేష్ గా తనకంటూ ఒక చెక్కుచెదరని ఉత్తమ స్థానాన్ని ఏర్పరచుకున్నారు. చిరంజీవి కూడా ఇతర భాషా సినిమాల రీమేక్ లు తీసి హిట్స్ అందుకునేవారు. ఒకానొక దశలో ఒక తమిళ సినిమా రైట్స్ కొనుగోలు విషయంలో చిరంజీవి కి, వెంకటేష్ కి పెద్ద మాటలు యుద్ధమే నడిచిందని సినీ జర్నలిస్టులు చెబుతుంటారు. అయితే ఆ సినిమా రైట్స్ దక్కించుకునే వార్ లో విక్టరీ వెంకటేష్ గెలిచారట.

వెంకటేష్ సినీ జీవితంలో ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన రోజా సినిమాలో అరవిందస్వామి నటించారన్న సంగతి తెలిసిందే. అయితే మణిరత్నం ముందస్తుగా వెంకటేష్ ని హీరోగా పెట్టి తన తీస్తున్న రోజా సినిమాలో హీరోగా పెట్టాలనుకున్నారు. కానీ వెంకటేష్ అప్పటికే చాలా సినిమాలతో బిజీగా ఉండి మణిరత్నం సినిమాలో నటించే లేకపోయారు.



























