మన ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో, నిద్ర కూడా అంతే అవసరం. రోజంతా శారీరక-మానసిక శ్రమతో అలసిపోయిన శరీరం రాత్రి విశ్రాంతి కోరుకుంటుంది. అయితే నిద్రలోకి జారుకునే సమయంలో ఒక్కసారిగా ఉలిక్కిపడినట్టు అనిపించడం చాలా మందికి ఎదురయ్యే అనుభవం. దీన్ని చాలామంది జబ్బుగా భావించి ఆందోళన చెందుతుంటారు.

వైద్యుల ప్రకారం ఇది సాధారణ శరీర ప్రతిస్పందన మాత్రమే. నిద్ర ప్రారంభ దశలో శరీర కండరాలు సడలిపోతాయి. ఆ సమయంలో మెదడు తాత్కాలికంగా “పడిపోతున్నాం” అనే భావనను గ్రహించి అప్రమత్త సంకేతం పంపుతుంది. ఫలితంగా చేతులు, కాళ్లు ఒక్కసారిగా కదలడం లేదా జలదరించడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా మందిలో ఈ అనుభవం కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మానసిక ఒత్తిడి, అధిక అలసట, నిద్రలేమి, రాత్రివేళల వరకు మెలకువగా ఉండడం వంటి కారణాలు దీనికి దారితీస్తాయి. చిన్నవారు, పెద్దవారు అనే తేడా లేకుండా ఎవరికి అయినా ఇది కలగొచ్చు. సాధారణంగా ఇది ప్రమాదకరం కాదు. కానీ తరచుగా తీవ్రంగా ఉంటే లేదా పగలు కూడా కండరాలు అకస్మాత్తుగా కదిలితే వైద్యులను సంప్రదించడం మంచిది.
సమయానికి నిద్రపోవడం, ధ్యానం చేయడం, తేలికపాటి వ్యాయామం, ప్రశాంత వాతావరణం అలవాటు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. సరైన జీవనశైలి ఆరోగ్యకరమైన నిద్రకు దారి తీస్తుంది.



























