ఆంధ్రప్రదేశ్‌లో రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో కీలక ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు మెరుగుపరచే దిశగా జాతీయ రహదారి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా జీలుగుమిల్లి నుంచి పోలవరం మీదుగా కొవ్వూరు వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి 365బీబీ ప్రాజెక్ట్ ఇప్పుడు కీలక దశలో ఉంది.

ఈ హైవే నిర్మాణాన్ని రెండు దశలుగా పూర్తి చేయాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే తొలి దశ పనులు ప్రారంభమయ్యాయి. జీలుగుమిల్లి నుంచి బుట్టాయగూడెం వరకు రోడ్డు నిర్మాణంతో పాటు మార్గమధ్యంలోని వాగులపై వంతెనల నిర్మాణాన్ని చేపట్టారు. అలాగే ఎల్‌ఎన్‌డీపేట నుంచి పోలవరం వరకు కూడా పనులు కొనసాగుతున్నాయి. ఈ దశలో రోడ్డు నిర్మాణంతో పాటు డ్రెయినేజీ వ్యవస్థలు, కల్వర్టులు ఏర్పాటు చేస్తున్నారు. మొదటి దశ పనులను ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
రెండో దశలో సుమారు 46 కిలోమీటర్ల మేర కొత్త రహదారి నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ త్వరలో పూర్తి కానుంది. ఈ హైవేలో బుట్టాయగూడెం మండలంలోని వీరన్నపాలెం వద్ద టోల్ ప్లాజా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా ప్రయాణికుల సౌకర్యార్థం మొత్తం 14 చోట్ల బస్ స్టాపులు కూడా ఏర్పాటు చేయనున్నారు.
ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత మన్యం ప్రాంత ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. పోలవరం ప్రాజెక్టు పరిధిలో ఉన్న ప్రాంతాలకు కూడా ఇది పెద్దగా ఉపశమనం కలిగించనుంది. ముఖ్యంగా హైదరాబాద్కు వెళ్లే ప్రయాణం మరింత వేగంగా, సౌకర్యవంతంగా మారే అవకాశముంది.
ఈ హైవే నిర్మాణం వల్ల మార్గమధ్యంలోని పట్టణాలు, గ్రామాలు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతాయని అధికారులు భావిస్తున్నారు. రవాణా సౌకర్యాలు పెరగడం వల్ల వ్యాపారం, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడనున్నాయి. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర అభివృద్ధికి మరో కీలక అడుగుగా నిలవనుంది.



























