TTD Goshalas: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల వరుసగా అపచారాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా టీటీడీ గోశాలలో ఏకంగా వంద గోవులు మరణించాయనే విషయం వెలుగులోకి వచ్చింది. ఇక ఈ విషయాన్ని కొన్ని పార్టీలు అదునుగా చేసుకొని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి కేవలం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణినే ఇందుకు కారణం అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.

ఈ విధంగా టీటీడీ గోశాల గురించి వస్తున్నటువంటి వార్తలను కూటమి కొట్టి పారేసినప్పటికీ ఈ విషయంపై పెద్ద ఎత్తున రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. కేవలం మూడు నెలల వ్యవధిలోనే 100 ఆవులు మరణించాయని వైసిపి నేత, మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చనిపోయిన ఆవుల ఫోటోలను చూపిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి.
గోశాలను అసమర్థుల అధికారుల చేతులలో పెట్టారని, గోవులకు సరైన ఆహారం నీళ్లు లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని దీనంతటికీ టీటీడీ నిర్లక్ష్యమే కారణమని తెలిపారు. ఈ విధంగా భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలపై టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి స్పందిస్తూ భూమన కరుణాకర్ రెడ్డికి కౌంటర్ ఇస్తూ.. భూమన చేస్తున్నటువంటి వ్యాఖ్యలలో నిజం లేదని, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఫోటోలు టీటీడీ గోశాలకు చెందినవి కాదని క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం గోశాలలో ఉన్నటువంటి ఆవులన్నీ చాలా ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు అయితే ఈ ఘటనపై విజిలెన్స్ విభాగం విచారణ జరుపుతుందని తెలిపారు. భూమన కరుణాకర్ చేసిన ఈ వ్యాఖ్యలకు కారణం లేకపోలేదని గత కొద్ది రోజుల క్రితం జరిగిన తొక్కిసలాటలో ఆ అధికారి నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తిని కాపాడటం కోసమే ఈ విధమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు అంటూ భాను ప్రకాష్ రెడ్డి స్పందించారు. ఈ వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ వైసిపి నేతలపై విమర్శలు కురిపించారు.
ఇలా తిరుమల తిరుపతి దేవస్థాన గోశాలకు సంబంధించిన ఆవుల గురించి ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో టీటీడీ కేవలం సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసి వదిలేయడంతో ఇది కాస్త రాజకీయ రంగుపులుముకొని పెద్ద ఎత్తున చర్చలకు కారణం అయింది.





























