ఎవరి పేరు చెబితేనే టాలీవుడ్ వణుకుతుందో అలాంటి మోహన్ బాబునే మిమ్మల్ని వదలం అంటూ కొంతమంది దుండగులు డైరెక్ట్‌గా ఇంటికి వెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చిన సంఘటన లేటెస్ట్ గా ఫిల్మ్ నగర్‌లో సంచలనం సృష్టిస్తుంది. కలెక్షన్ కింగ్ మోహన్‌ బాబు ఇంటి దగ్గర భీభత్సం సృష్టించిన దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. శనివారం రాత్రి జల్‌ పల్లిలోని మోహన్‌ బాబు ఇంట్లోకి నలుగురు దుండగులు కారులో వచ్చి ఆయననుద్దేశించి వార్నింగ్ ఇస్తూ అక్కడి నుంచి పరారయ్యారు. వాచ్‌ మెన్‌ ఇచ్చిన సమాచారంతో మోహన్‌ బాబు కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ సంఘటన వివరాలు తెలుసుకుని ఆందోళన చెందిన మోహన్‌బాబు కుటుంబ సభ్యులతో సహా పహాడి షరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంటి పరిసరాలలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా ఏపీ 31 ఏఎన్‌ 0004 నంబరు గల ఇన్నోవా కారులో దుండగులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కార్‌ నెంబర్‌ ఆధారంగా మోహన్ బాబు ఇంటికి వచ్చిన నిందితులను మైలార్‌ దేవ్‌ పల్లి దుర్గా నగర్‌కు చెందిన రాఘవేంద్ర, ఆనంద్‌, గౌతమ్‌, డేవిడ్‌లుగా గుర్తించారు. ఈ నలుగురు మంచి ఫ్రెండ్స్ అని పోలీసులు తెలియజేశారు.
ప్రస్తుతం నలుగురినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. మోహన్ బాబు ఫ్యామిలీని బెదిరించమని ఎవరైనా పంపించారా.? లేక వాళ్ళే కావాలని చేశారా.? అనే కోణంలో పోలీసులు ఎంక్వయిరీ మొదలు పెట్టారు.

ఇదిలా వుండగా ఫిల్మ్ నగర్ ఎంట్రన్స్‌లోనే ఉన్న మోహన్ బాబు ఇంటికి పటిష్టమైన భద్రత ఉంది. ఇంటి ముందు పెద్ద గేట్ ఉండటమే కాకుండా సెక్యురిటీ సిబ్బంది కూడా స్ట్రాంగ్ గానే ఉంటారు. అయితే వచ్చిన వాళ్లు ఎవరు.? ఎందుకు వచ్చారు.? మోహన్ బాబు ఫ్యామిలీకి వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏమిటి.? మోహన్ బాబుకు శత్రువులు ఎవరైనా వున్నారా.? లేక దుండగులే కావాలని ఇలా చేశారా.? వంటి సందేహాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here