ప్రముఖ సీనియర్ నటి వాణీశ్రీ తనయుడు అభినయ వెంకటేష్ గుండె పోటుతో మరణించారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నిద్రలో వుండగానే ఆయనకు గుండెపోటు వచ్చి మృతి చెందారంటూ ముందు వార్తలు వినిపించాయి. చెన్నైలోని అన్నపూర్ణ మెడికల్ కాలేజీలో డాక్టర్‌గా పనిచేస్తున్న అభినయ వెంకటేష్ గుండె పోటు కారణంగా మరణించలేదని తాజాగా ఓ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.

మొదట అనుమానాస్పద మరణంగా పోలీసులు కేసు ఫైల్ చేశారు. అయితే ఆయన ఆత్మ హత్యకు పాల్పడినట్టు తాజాగా తెలుస్తోంది. తిరుక్కలి కుండ్రం ఫామ్ హౌస్‌లో అభినయ వెంకటేష్ ఆత్మ హత్య చేసుకున్నట్టు చెబుతున్నారు. తన తనయుడితో కాలక్షేపం చేసిన ఆయన శుక్రవారం చెంగల్పట్టు వెళ్లి అక్కడవున్న తన ఫామ్ హౌస్‌లో ఆత్మ హత్యకు పాల్పడినట్టు పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. అభినయ వెంకటేష్ మృత దేహాన్ని వాణిశ్రీ ఇంటికి తీసుకొచ్చారు. దీంతో చెన్నైలో వున్న సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా వాణీశ్రీ ఇంటికి చేరుకుంటున్నారు. అభినయ వెంకటేష్ మృతిపై ఆరా తీస్తున్నారు.




























