దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రంపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్రత్యేక సెట్స్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.

హైదరాబాద్‌లో నిర్మిస్తున్న ఈ భారీ సెట్లో పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసి వాతావరణాన్ని అచ్చం ప్రతిబింబించేలా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. గంగా తీరాన్ని, అక్కడి పురాతన కట్టడాల శైలిని ప్రతిఫలించేలా రూపొందిస్తున్న ఈ సెట్స్ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
కథలో కీలకమైన ఘట్టం కోసం ఈ సెటప్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రపంచ యాత్ర నేపథ్యంతో సాగే అడ్వెంచర్ కథలో భాగంగా భారతీయ ఆధ్యాత్మికతను కూడా ప్రతిబింబించాలన్న ఉద్దేశంతో ఈ ‘వారణాసి’ ఎపిసోడ్‌ను చేర్చినట్లు తెలుస్తోంది. తన ప్రతి సినిమాలో లొకేషన్లు, సెట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపే రాజమౌళి, ఈసారి కూడా అదే స్థాయిలో భారీగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఇక ఈ చిత్రంలో మహేశ్ బాబు పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. సాహసికుడిగా ఆయన పాత్ర ఉంటుందని, అందుకు తగ్గట్టుగా ఆయన ఇప్పటికే లుక్ మార్చుకున్నారు. పొడవాటి జుట్టు, గడ్డంతో కనిపించిన ఆయన న్యూ లుక్ ఫోటోలు గతంలోనే వైరల్ అయ్యాయి. పాత్ర కోసం ఫిజిక్‌ను కూడా ప్రత్యేకంగా మలుచుకుంటూ కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారని సమాచారం.
భారీ బడ్జెట్‌తో అంతర్జాతీయ ప్రమాణాల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం టాలీవుడ్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బయటకు వస్తున్న సెట్స్ ఫొటోలు సినిమాపై హైప్‌ను మరింత పెంచుతున్నాయి



























