Venkatesh makeup man Raghava : రామానాయుడు గారి కుటుంబం సినిమా ఇండస్ట్రీకి ఎంతో చేశారు. ఆయన సినిమాలను నిర్మిస్తూ సినిమా షూటింగ్స్ కోసం స్టూడియో నిర్మించారు. ఇక ఆయన మొదటి కొడుకు సురేష్ బాబు నిర్మాతగా సినిమా నిర్మాణంలో ఉండగా మరో కొడుకు వెంకటేష్ హీరోగా అగ్రహీరోల్లో ఒకడిగా నిలిచి ఎక్కువగా కుటుంబ ప్రేక్షకులకు, మహిళా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఒకవైపు కామెడీ చేస్తూనే మరోవైపు సెంటిమెంట్ ను పండిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు వెంకటేష్. దగ్గుబాటి కుటుంబం మీద ఒక్క రూమర్ కానీ, వివాదం కానీ లేకుండా నిలిచారు. ఇక ఆ కుటుంబం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను వెంకటేష్ వ్యక్తిగత మేకప్ మాన్ రాఘవ మాట్లాడారు.

రామా నాయుడుగారు మరణించినపుడు…
రామ నాయుడు గారి లెగసీని కాపాడుతూ ఆయన ఇద్దరు కుమారులు సురేష్, వెంకటేష్ సినిమా ఇండస్ట్రీలో ఒకరు సినిమాలను నిర్మిస్తూ మరొకరు సినిమాలలో నటిస్తూ ఆయన పేరును నిలబెట్టారు. అయితే కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే దగ్గుబాటి ఫ్యామిలీ కొడుకులుద్దరూ ఇప్పటికీ కలిసిమెలిసి ఉంటారంటూ వెంకటేష్ గారికి దాదాపు ముప్పైఏళ్ళు మేకప్ మాన్ గా పనిచేస్తున్న రాఘవ తెలిపారు. ఇక రామా నాయుడుగారు కొడుకులు ఒక రెండు రోజులు కనిపించక పోతే అడిగేవారంటూ ఇంకా ఎందుకు రాలేదు అంటూ ఆరాలు తీసేవారని, ఇక ఆయన మరణించాక చాలా రోజులు ఆ కుటుంబం కోలుకోలేదంటూ తెలిపారు రాఘవ.

వెంకటేష్ బాబు సినిమా షూటింగులకు వెళ్లినా నాన్నను తలుచుకుని ఏడ్చేవారంటూ తెలిపారు. ఒక్కోసారి మేకప్ చేసేటపుడు కళ్ళలో వాళ్ళ నాన్నను తలుచుకుని కన్నీరు పెట్టేవారు. నేను మేకప్ వేయడం మానేసి ఏంటండీ ఇలా అని అడిగితే మాట్లాడేవారు కాదు, రామా నాయుడు గారి ప్రస్తావన వస్తే కళ్ళలో నీళ్లు వచ్చేవి. ఆయన మరణించిన కొద్ది నెలలు ఇలానే ఉండేవారు అంటూ రామా నాయుడు గారి మీద ఆయన పిల్లలకు ఉన్న ప్రేమ గురించి రాఘవ తెలిపారు.



























