సినిమాను అమితంగా ప్రేమించే వ్యక్తి నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి. ఆయన ఒక పట్టువదలని విక్రమార్కుడు. అపజయాలు వెంటాడుతున్న సైతం గెలుపు గమ్యాలను వెతికే సినీ బాటసారి. పీకల్లోతు కష్టాల్లో ఉన్న కూడా సంకల్పం సడలని యోధుడు. 1989 ఎమ్మెస్ ఆర్ట్స్ బ్యానర్లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అంకుశం మూవీ ఘన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో 1991లో ఆగ్రహం సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను కల్పించింది. పరాజయం పొందిన అనంతరం ఆ బాధల నుంచి ఉపశమనం పొందడం కొరకు శ్యాం ప్రసాద్ రెడ్డి విదేశాలకు వెళ్లిపోవడం జరిగింది.

అక్కడ గ్రాఫిక్ వర్క్స్ తో ఉన్న ఒక ఇంగ్లీష్ మూవీని శ్యాం ప్రసాద్ రెడ్డి చూశారు.
అలా గ్రాఫిక్స్ ను ఉపయోగించి మన తెలుగు సినిమాలు కూడా తీయొచ్చు కదా అన్న ఉద్దేశంతో ఇండియా వచ్చి తన యూనిట్ సభ్యులకు పల్లెటూరు, ఒక దైవం నేపథ్యంలో కథ రాయమని చెప్పారు. కథ బాగా రావడంతో ఏ కోదండరామి రెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న రామారావును అమ్మోరు సినిమా కి దర్శకుడిగా ఎంపిక చేశారు. ఆ తర్వాత బాబు మోహన్.. శ్యాం ప్రసాద్ రెడ్డి ఆఫీసులో అమ్మోరు కథ విని చాలా బాగుంది అని చెప్పారు. ఈ సినిమాకి మనవరాలి పెళ్లి లో తన మరదలిగా చేసిన సౌందర్య అయితే బావుంటుంది అని చెప్పారు. వెంటనే మనవరాలి పెళ్లి సినిమా షూటింగ్ దగ్గరికి వెళ్లి సౌందర్యని చూసి అమ్మోరు సినిమా కి సెలెక్ట్ చేయడం జరిగింది. అప్పటికీ గ్లామర్ పాత్రలు చేస్తున్న రమ్యకృష్ణ ను ఈ సినిమాలో అమ్మోరు పాత్రకు ఎంపిక చేశారు.

హీరోగా సురేష్, విలన్ గా చిన్నాతో 1992 లో షూటింగ్ మొదలు పెట్టి దాదాపు 18 నెలల్లో షూటింగ్ పూర్తి చేశారు. తర్వాత శ్యాం ప్రసాద్ రెడ్డి ఆ ఫుటేజ్ ని తీసుకొని విదేశాలకు వెళ్లడం జరిగింది. అక్కడ గ్రాఫిక్స్ కు అనుగుణంగా సినిమా రాకపోవడంతో శ్యాం ప్రసాద్ రెడ్డి తిరిగి ఇండియాకు వచ్చి ఆ ఫుటేజ్ మొత్తం కూడా మూలకు పడేశారు. తిరిగి దర్శకుడు రామారావు స్థానంలో కోడి రామకృష్ణను తీసుకుని అమ్మోరు సినిమా మళ్ళీ మొదటి నుండి తీశారు. కొసమెరుపు ఏంటంటే విలన్ పాత్ర చేసిన చిన్న స్థానంలో రాంరెడ్డి ని తీసుకున్నారు. శ్యాం ప్రసాద్ రెడ్డి ఇక విదేశాలకు వెళ్లకుండా విఎఫ్ఎక్స్ వర్క్ కోసం లండన్ నుండి క్రిస్ ఇండియాకు వచ్చి దాదాపు ఒక సంవత్సర కాలం పాటు అమ్మోరు సినిమా కు పని చేయడం జరిగింది. అలా దాదాపు 270 రోజులపాటు షూటింగ్ జరిగిన సినిమాకి గ్రాఫిక్ వర్క్ అద్భుతంగా క్రిస్ చేయడంతో అమ్మోరు సినిమా 1995 నవంబర్ 23న విడుదలయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here