అసలే కరోనా తో అల్లకల్లోలం అవుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో కష్టమొచ్చిపడింది. వైజాగ్ పరిసరాలైన గోపాలపట్నం, ఆర్ ఆర్ వెంకటాపురం ప్రాంతాలలో ఎల్జీ పాల్జిమర్స్ అనే ఫ్యాక్టరీ నుంచి వెలువడిన స్టెరీన్ వాయువు కారణంగా 8 మంది మృత్యువాత పడ్డారు. వందల మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారందర్ని విశాఖ కెజిహెచ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో పక్షులు, మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. కాగా ఈ వాయువు పీల్చిన వారిపై ఈ స్టెరీడ్ ప్రభావం దీర్ఘకాలికంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

ఈ వాయువు పీల్చడం వలన కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందని, దానితో కిడ్నీ సంబంధిత వ్యాధులు, తలనొప్పి, మానసిక రుగ్మత, అలసట, నీరసం, వినికిడి లోపం, క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇదిలా ఉంటే ఈ ప్రమాదంపై దేశవ్యాప్తంగా పలువురు స్పందిస్తున్నారు. ప్రధాన మంత్రి మోడీ బాధితులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా అని ట్వీట్ చేసారు. అదే సమయంలో వారికి సరైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేసారు. దీనితోపాటుగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, తెలంగాణ మంత్రి కేటీఆర్, కల్వకుంట్ల కవిత, టాలీవుడ్ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, తదితరులు సోషల్ మీడియాలో తమ సంఘీభావం తెలిపారు.




























