మెగా Vs నందమూరి వార్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు తెలిసిందే. దశాబ్ధాలుగా ఈ 2 కుటుంబాల మధ్య పరిశ్రమలో అటు వృత్తిపరంగానూ, ఇటు వ్యక్తిగతంగానూ ఆధిపత్య పోరు నడుస్తుందని తెలుసు. సంక్రాంతి సినిమా పోటీల బరిలో ఇద్దరి సినిమాలు రిలీజైతే ఇక ఇద్దరి ఫ్యాన్స్ మధ్య రగడ ఎలా వుంటుందో తెలిసిందే..!

అయితే ఈమధ్యకాలంలో సినిమా ఫంక్షన్ల వేదికలపై ఇద్దరూ స్నేహంగా కలుసుకోవడంతో గొడవలేవీ లేవనే ఫ్యాన్స్ భావించారు. కానీ అనూహ్యంగా కరోనా మమమ్మారీ లాక్ డౌన్ సమయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. మెగా నందమూరిల చెలిమి కలలో మాత్రమే కానీ ఇలలో జరగదని జనాలకు అర్థమైంది. ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దల వ్యవహారం మీడియాలో హైలైట్ కావడంతో ఆ ఇద్దరి మధ్యా నువ్వా నేనా? అన్నంత గొడవ మొదలైంది. కరోనా కష్ట కాలంలో సీసీసీ ట్రస్ట్ ప్రారంభించి సినీకార్మికుల్ని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ప్రయత్నించారు. అలాగే ఇటీవలి కాలంలో పలు సందర్భాల్లో సినీపరిశ్రమ సమస్యల్ని పరిష్కరించేందుకు నేనున్నాను అంటూ ఆయన ముందుకొచ్చారు. దాసరి తర్వాత నేనున్నాను అన్న భరోసాని కల్పించారు. అలాగే కరోనా కష్ఠకాలంలో తెలుగు చిత్ర పరిశ్రమను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. షూటింగుల పునప్రారంభ వ్యవహారం మొదలుగొని థియేటర్లు తెరిచే అంశం వరకూ తెలంగాణ ప్రభుత్వంతో సినీ ప్రముఖులందరూ సమావేశమై చర్చలు జరిపారు.

అయితే టాలీవుడ్ లో ఇంత ముఖ్యమైన విషయంలో చర్చలకు తనను పిలవకపోవడంతో బాలయ్య హర్ట్ అవ్వడం.. అటుపై మెగాస్టార్ పై తీవ్రమైన కామెంట్స్ చేయడంతో ఇండస్ట్రీలో సంచలనం మొదలైంది. “వారంతా భూములు పంచుకోవడానికే సమావేశమయ్యారంటూ” అటు తెలంగాణ ప్రభుత్వ పెద్దలపైనా.. ఇటు చిరంజీవిపైనా బాలయ్య వివాదస్పదమైన వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్ గా మెగాబ్రదర్ నాగబాబు రంగంలోకి దిగి నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ కూడా ఇచ్చారు. “నువ్వేమీ కింగ్ వి కాదు.. కేవలం హీరోవి!!” అంటూ బాలయ్య ఇమేజ్ ను తీసిపారేసినట్టే మాట్లాడారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధానికి కి ఇది ఆరంభమైంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు అగ్ర హీరోలు మధ్య మొదలైన ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ 2గా విడిపోయిందనే ఫీలింగ్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుండగా ప్రముఖ సినీ దర్శకులు థమ్మారెడ్డి భరద్వాజ, సీనియర్ నటుడు నరేష్, దర్శకుడు తేజ ఈ వివాదంలో కలగజేసుకుని ఇంతటితో ఈ వివాదం సద్దుమణిగేలా చేయవల్సిందిగా మీడియాను కోరారు.

ఆ తరువాత ఈ వివాదం అంతటితో ముగిసిపోయిందని అందరూ అనుకుంటూ ఉండగా, జూన్ 10న బాలయ్య తన పుట్టినరోజును పురస్కరించుకొని ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరిన్ని ఆసక్తికరమైన అంశాలను బయటపెట్టారు. అసలు చిరంజీవి, తనకు మధ్య విభేదాలు ఇప్పటివి కాదని, ఎప్పటి నుంచో ఉన్నవేనని గుర్తు చేస్తూ.. ఈ ఇంటర్వ్యూలో చిరంజీవినే టార్గెట్ చేస్తూ బాలయ్య కొన్ని సంచలన విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా టాలీవుడ్ కి సంబంధించి ప్రతి సంవత్సరం నిర్వహించే 80 స్ రీయూనియన్ గురించి లెజెండ్ బాలయ్య ప్రస్తావించారు. ఇందుకు సంబంధించిన ఫంక్షన్ ప్రతి సంవత్సరం కొన్ని కొన్ని ప్రాంతాల్లో జరిగేవని, సినీ ప్రముఖులంతా కలిసి అక్కడికి వెళ్లేవాళ్ళని, అక్కడే ఉత్సాహంగా గడిపేవాళ్ళని చెప్పారు. కానీ గత సంవత్సరం హైదరాబాదులో ఆ ఫంక్షన్ చిరంజీవి ఇంట్లో నిర్వహించారు. ఆ ఫంక్షన్ కు తనను పిలవలేదని, అందరినీ పిలిచారని, తనని మాత్రమే ఎందుకు పిలవలేదో తనకు ఇప్పటికీ తెలియదని బాలయ్య గుర్తు చేసుకున్నారు. ఎక్కడో జరిగిన ఫంక్షన్లకు నన్ను పిలిచి హైదరాబాద్ లో జరిగిన ఫంక్షన్ కు నన్నెందుకు పిలవలేదు.? నేనేమీ పిచ్చోడిని కాదంటూ.. ఉంటే గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ పద్ధతిలో వుండాలి. లేకపోతే నన్ను పూర్తిగా పక్కన పెట్టాలని, అప్పుడు తన పని తాను చేసుకుపోతుంటాను అంటూ బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిన్నటి వరకూ బాలయ్య, చిరుల మధ్య జరిగిన వార్ ను పరిశీలిస్తే వాళ్ళిద్దరూ ఇప్పుడప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. అయితే ఈ వివాదం ఇలానే కొనసాగితే టాలీవుడ్ కు ఏమంత శ్రేయస్కరం కాదన్నది కొందరు సినీ పెద్దల అభిప్రాయం. మరి ఈ వివాదానికి పరిష్కారం ఏమిటి? చిరు – బాలయ్య ఇప్పుడప్పుడే కలవరా? అన్న విషయం నేటికి సస్పెన్స్ గానే వుంది. చూద్దాం టాలీవుడ్ లోనే అగ్రహీరోలుగా కీర్తిగడించిన ఈ ఇద్దరూ మళ్ళీ ఒకే వేదికపై కలిసి మాట్లాడుకునే శుభ తరుణం ఎప్పుడొస్తుందో..?!



























