సినిమా హీరోలు రాజకీయాల్లోకి రావడమనేది కొంచెం ఆసక్తికరమైన విషయమే.. కానీ రాజకీయాల్లోకి వచ్చిన సినిమా హీరోల మధ్యనే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి యే వస్తే.. ఊహించడానికే మరింత ఆసక్తిగా వున్న ఈ అంశంలోకి వెళ్తే..

లాక్ డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్ లు జరగక చిత్రపరిశ్రమ ఇబ్బందులు పడుతున్న విషయం విదితమే.. ఈ నేపధ్యంలో ఇటీవల మెగా స్టార్ చిరంజీవి ఇంట్లో సినిమాటోగ్రపీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో టాలీవుడ్ ప్రముఖులు సమావేశం అయిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఇదే విషయమై లెజెండ్ బాలకృష్ణ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భూములు పంచుకోటానికి సమావేశం అయ్యారంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు ఘాటుగానే స్పందించారు.

బాలయ్య బాబు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని.. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటం సరికాదని, బాలయ్య బాబు బూతులు మాట్లాడటం చాల తప్పని నాగబాబు పేర్కొన్నారు. బాలయ్య మాటలు పరిశ్రమనే కాకుండా, తెలంగాణ ప్రభుత్వాన్ని అవమానపరిచేవిధంగా ఉన్నాయని నాగబాబు స్పందించారు. అంతేగాక ప్రభుత్వం, చిత్ర పరిశ్రమకు బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని నాగబాబు డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరు చేశారో.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఏపీని ఎవరు సర్వనాశనం చేశారో ఒకసారి ఎపికి వెళ్తే తెలుస్తుందన్నారు. బాలకృష్ణ ఏం మాట్లాడినా నోరుమూసుకుని కూర్చోబోమని, ఇండస్ట్రీకి బాలకృష్ణ కింగ్ ఏమీ కాడనీ.. అతను కేవలం హీరో మాత్రమేనని మెగా బ్రదర్ పేర్కొన్నారు. మరి నాగబాబు వాదనలకు బాలకృష్ణ ప్రతివాదన ఎలా వుంటుందో తెలియాలంటే బాలయ్య సమాధానం కోసం ఆగాల్సిందే.!




























