సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన “మహిళాశక్తి” సభలో సీఎం రేవంత్ రెడ్డి మహిళల అభివృద్ధి, సంక్షేమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు 553 ఆర్టీసీ బస్సులు అందజేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళల ఆర్థిక ఎదుగుదలే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

“ఇందిరమ్మ పాలనలోనే మహిళలకు నిజమైన గౌరవం దక్కుతుంది” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, మహిళా సంఘాలకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల సున్నా వడ్డీ నిధులు పెండింగ్‌లో పెట్టారని ఆరోపించారు. మహిళలతో అన్యాయం చేసినవారు రాజకీయంగా నిలబడలేరని వ్యాఖ్యానించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీకి భారీగా నిధులు ఇచ్చి ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశామని తెలిపారు. ఈ పథకం వల్ల విద్యార్థినులు, మహిళలు ప్రయాణ ఖర్చుల భారంలేకుండా సులభంగా చదువులు కొనసాగిస్తున్నారని చెప్పారు. మహిళల డ్రాప్‌అవుట్ రేటు తగ్గిందని ఆయన పేర్కొన్నారు.
మహిళల పాత్రను ప్రశంసించిన సీఎం, సమాజ అభివృద్ధిలో వారు ముందున్నారని అన్నారు. దేశ చరిత్రలో మహిళా హక్కుల సాధనకు కాంగ్రెస్ పార్టీ చేసిన కృషిని వివరించారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యం పెంచిన ఘనత తమదేనని తెలిపారు.
మహిళా సంఘాలు ఇప్పుడు ఆర్థికంగా బలపడుతున్నాయని, పెట్రోల్ బంకులు, సోలార్ ప్రాజెక్టులు వంటి రంగాల్లో కూడా అడుగుపెడుతున్నాయని సీఎం చెప్పారు. త్వరలో మహిళా శక్తి భవనాలు నిర్మిస్తామని, పెద్ద ఎత్తున భూములు మహిళా సంఘాలకు కేటాయించామని వెల్లడించారు.
“కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే వరకు నేను విశ్రమించను” అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 2034 వరకు రాష్ట్ర అభివృద్ధి, మహిళల సాధికారతే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.





























