టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయమైన రాజా రవీంద్ర ఆ తర్వాత తక్కువ టైంలోనే మంచి మంచి పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హీరో ఫ్రెండ్ గా, నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో ఎక్కువగా మెరిసిన ఆయన ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించేశాడు. ప్రస్తుతం జయసుధ, రాజ్ తరుణ్, విష్ణు, నిఖిల్, సునీల్ ల మేనేజర్ గా వాళ్ల డేట్స్ చూసుకుంటూ, చిన్న చిన్న పాత్రల్లో మెరుస్తున్నాడు. పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ మంచి రోల్స్ చేయాలన్న ఉద్దేశ్యంతోనే తాను సినిమాలు కమిట్ కావటం లేదని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చాడు. ఇదే సమయంలో మాస్ రాజా రవితేజతో ఉన్న విభేధాల గురించి కూడా ప్రస్తావించాడు.

గతంలో రాజా రవీంద్ర రవితేజకు మేనేజర్ గా వ్యవహరించాడు. కాల్షీట్ల దగ్గరి నుంచి రెమ్యునరేషన్ దాకా అన్నీ అతనే చూసుకునేవాడు. కానీ, ఏమైందో ఏమో తెలీదుగానీ వీరిద్దరి మధ్య అభిప్రాయ భేధాలు వచ్చి విడిపోయారు. అయితే ఆర్థిక వ్యవహారాల కారణంగానే అది జరిగిందని అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి. అయినప్పటికీ కొన్ని సినిమాల్లో వీరు కలిసి నటించారు.

ఆ గొడవ జరిగిన ఆరేళ్ల తర్వాత అంటే తాజాగా ఆ గొడవపై స్పందించిన రాజా రవీంద్ర. చాలా మంది అనుకుంటున్నట్టు హీరో రవితేజకు, తనకు మధ్య ఎలాంటి ఆర్థిక విభేదాలు లేవని క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజా రవీంద్ర తెలిపాడు. రవితేజతో సినిమాల్లోకి రాకముందు నుంచే తనకు చాలా మంచి అనుబంధం ఉండేదని… పైగా అతని కాళ్లు కడిగి తానే పెళ్లి చేశానని చెప్పాడు. అసలు తనను మేనేజర్ ను చేసిందే రవితేజ అని తెలిపాడు. ఒకప్పుడు రవితేజను ‘ఏరా’ అని పిలిచేవాడినని… పెద్ద హీరో అయ్యాక బహుశా ఆ పిలుపు నచ్చకే తనను దూరం పెట్టి ఉండవచ్చని తెలిపాడు. ఓ రోజు తనను పిలిచి ఇక తన వ్యవహారాలను తానే చూసుకోగలనని చెప్పటంతో అప్పటి నుంచి మానేశానని చెప్పాడు. ఇప్పటికీ రవితేజ తన ఇంటికి వస్తుంటాడని తెలిపిన రవీంద్ర ఆర్థిక వ్యవహారాలన్నీ రవితేజే చూసుకునేవాడని, అలాంటప్పుడు సమస్య ఎక్కడి నుంచి వస్తుందని వివరణ ఇచ్చాడు.



























