వేసవి కాలంలో ఎండలు పెరిగిపోవడంతో చాలామంది చల్లటి నీళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ఫ్రిజ్‌లో ఉన్న ఐస్ చల్లని నీళ్లు తాగడం చాలా మందికి అలవాటుగా మారిపోయింది. ఆ క్షణానికి అది ఉపశమనం ఇచ్చినట్లే అనిపించినా.. ప్రతిరోజూ అధికంగా ఫ్రిజ్ నీళ్లు తాగడం ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

అత్యంత చల్లటి నీరు శరీర సహజ ఉష్ణోగ్రతను ఒక్కసారిగా మార్చేస్తుంది. ముఖ్యంగా ఎండలో తిరిగి వచ్చిన వెంటనే ఫ్రిజ్ నీళ్లు తాగితే శరీరానికి అకస్మాత్తుగా షాక్‌లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మందగించే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. కొందరిలో అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కనిపించవచ్చు.
చల్లటి నీళ్లు తరచుగా తాగడం వల్ల గొంతు సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటి ఇబ్బందులు చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొంతమందిలో తలనొప్పి లేదా అలసట కూడా కనిపించవచ్చు.
ఆరోగ్య నిపుణుల ప్రకారం చాలా చల్లటి నీరు శరీరంలోని రక్తప్రసరణపై కూడా ప్రభావం చూపొచ్చు. ముఖ్యంగా గుండె స్పందన తాత్కాలికంగా నెమ్మదించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే హృదయ సంబంధిత సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ఇంకా కొందరిలో చల్లటి నీళ్లు ఎక్కువగా తాగే అలవాటు వల్ల కొవ్వు కరిగే ప్రక్రియ మందగించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని ప్రభావం మెటబాలిజంపై పడే అవకాశం ఉంది. అందుకే వేసవిలో దాహం తీర్చుకోవడానికి మట్టికుండ నీళ్లు, సాధారణ ఉష్ణోగ్రతలో ఉన్న నీళ్లు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు.
వేసవిలో శరీరానికి తగినంత నీరు అందించడం చాలా అవసరం. అయితే అతిగా చల్లటి నీళ్లకు అలవాటు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఫ్రిజ్ నీళ్లు పరిమితంగా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.



























