వేసవి, వర్షాకాలం ప్రారంభ సమయంలో పాములు జనావాసాల్లోకి రావడం తరచూ కనిపించే విషయం. ఇళ్ల చుట్టుపక్కల చెట్లు, పొదలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అయితే నాగుపాములు సహా వివిధ రకాల సర్పాలు కనిపిస్తుంటాయి. వేడి నుంచి తప్పించుకునేందుకు ఇవి బైక్‌లు, షూస్, గోదాములు, ఇంటి మూలలు వంటి చోట్ల దాక్కోవడం వల్ల ప్రజల్లో భయం నెలకొంటోంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం తలెత్తే పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది భయంతో పాములను చంపేస్తుంటారు. మరికొన్ని సందర్భాల్లో రోడ్డుపై వాహనం కింద పడటం లేదా తెలియకపోవడం వల్ల పాములు చనిపోతుంటాయి. ముఖ్యంగా నాగుపాము విషయంలో మాత్రం ప్రజల్లో ఆధ్యాత్మిక భావనలు ఎక్కువగా కనిపిస్తాయి. దీంతో అనుకోకుండా నాగుపామును చంపితే అది పాపమా అనే సందేహం చాలామందిలో ఉంటుంది.
జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, పండితుల అభిప్రాయం ప్రకారం నాగుపామును హిందూ సంప్రదాయంలో దైవ స్వరూపంగా భావిస్తారు. అందుకే వీలైనంత వరకు పాములను హాని చేయకుండా స్నేక్ క్యాచర్లకు లేదా అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. పాములను చంపడం వల్ల ఆధ్యాత్మికంగా దోషాలు వస్తాయని కొందరు విశ్వసిస్తారు.
అనుకోకుండా నాగుపాము చనిపోయిన సందర్భంలో కొన్ని సంప్రదాయ పద్ధతులు పాటించాలని పండితులు చెబుతున్నారు. పాముకు పాలు సమర్పించడం, నాణెం ఉంచడం, అనంతరం పాతిపెట్టడం లేదా దహనం చేయడం వంటి ఆచారాలు కొందరు అనుసరిస్తుంటారు. మనిషికి చేసే విధంగా గౌరవంతో అంత్యక్రియలు చేయడం ద్వారా ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని నమ్మకం ఉందని వారు వివరిస్తున్నారు.
అయితే ఇవన్నీ పూర్తిగా మత విశ్వాసాలు, ప్రాంతీయ ఆచారాల ఆధారంగా చెప్పబడిన విషయాలేనని గుర్తుంచుకోవాలి. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పాములు కనిపించినప్పుడు వాటిని స్వయంగా పట్టుకోవడానికి లేదా చంపడానికి ప్రయత్నించకుండా వెంటనే సంబంధిత సిబ్బందికి సమాచారం ఇవ్వడం ఉత్తమ మార్గమని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.



























